Hijras Attack: రెచ్చిపోయిన హిజ్రాలు, బాలుడిపైనా ప్రతాపం

బత్తలపల్లి/అనంతపురం: హిజ్రాలు రెచ్చిపోయారు. ప్రధాన రహదారిపై భిక్షమెత్తుకుంటూ తాము అడిగిన మేరకు డబ్బు ఇవ్వని ప్రయాణికులపై దాడికి తెగబడ్డారు. ఫలితంగా పలువురు రక్తగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం సాయంత్రం బత్తలపల్లి మండలం పోట్లమర్రి సమీపంలో కొందరు హిజ్రాలు వాహనాలను ఆపి బలవంతంగా డబ్బు వసూలు చేయసాగారు.
అదే సమయంలో నార్పల మండలం బొందలవాడ నుంచి పెళ్లి బృందంతో బొలెరో వాహనం వచ్చింది. దాన్ని ఆపి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. ఇచ్చిన మేరకు తీసుకునేందుకు హిజ్రాలు ససేమిరా అన్నారు. అంతటితో ఆగకుండా రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఘటనలో పెళ్లి బృందంలోని బయన్న, ఈశ్వరమ్మ, ఆంజనేయులు, రామాంజినమ్మ, ఆదెమ్మ, సింహాద్రి, శివయ్య, బాలుడు చిన్న గాయపడ్డారు. అతి కష్టంపై బయటపడిన పెళ్లి బృందం.. బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. తర్వాత గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు.
హిజ్రాల దాడిలో గాయపడిన చిన్నా
ఇంతలో పోట్లమర్రికి చేరుకున్న హిజ్రాలు వివస్త్రలుగా మారి రోడ్డుపై పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని పంపించి వేశారు. అనంతరం బత్తలపల్లికి చేరుకున్న హిజ్రాలు మద్యం మత్తులో వివస్త్రలుగా మారి కూడలిలో నిలబడి అసభ్యపదజాలంతో దూషణలు మొదలుపెట్టారు. దీంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాశి, లావణ్య, మురళి, దుర్గ, శ్యామలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.