ప్రయాణికులు.. ప్రమాదానికి బాధ్యులా? | High Court orders Nallapadu police in Singayya death incident | Sakshi
Sakshi News home page

ప్రయాణికులు.. ప్రమాదానికి బాధ్యులా?

Jun 28 2025 3:58 AM | Updated on Jun 28 2025 10:15 AM

High Court orders Nallapadu police in Singayya death incident

కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు ఎలా పెడతారు?

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలొద్దు

సింగయ్య మృతి ఘటనలో నల్లపాడు పోలీసులకు హైకోర్టు ఆదేశం

భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు కొన్నిసార్లు జరుగుతుంటాయి

కుంభమేళా లాంటి చోట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి 

కారు కింద పడిన ఆ వ్యక్తిని అలా చావనివ్వండంటూ వదిలేసి వెళ్లరు కదా!

అలాంటి ఉద్దేశం కారులో ఉన్న వారికి ఉంటుందా?

పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు.. విచారణ మంగళవారానికి వాయిదా

సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా ఆ వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారే గానీ కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు నమోదు చేయరని గుర్తు చేసింది.

ప్రమాదానికి కారులో ఉన్న వారిని ఎలా బాధ్యులను చేస్తారని సూటిగా ప్రశ్నించింది. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయని, కుంభమేళా లాంటి చోట్ల కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

సింగయ్య మృతికి సంబంధించి నమోదైన కేసులో వైఎస్‌ జగన్‌­, ఇతర నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజిని  తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

అక్రమ కేసు కొట్టివేయాలంటూ పిటిషన్లు
సింగయ్య మృతికి సంబంధించి నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తేలేంతవరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని తమ పిటిషన్లలో హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సుబ్రహ్మణ్య శ్రీరాం, చిత్తరవు రఘు, న్యాయవాదులు యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, ఆర్‌.యల్లారెడ్డి, కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి తదితరులు హాజరయ్యారు.  

ఎస్పీ మొదట వేరే కారు అని చెప్పారు.. ఆ తర్వాత మాట మార్చారు... 
మొదట పొన్నవోలు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రమేనని, సింగయ్య మృతితో వీరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వాస్తవానికి ప్రమాదం జరిగిన రోజు గుంటూరు ఎస్పీ స్పందిస్తూ ఏపీ 26 సీఈ 0001 నంబర్‌ కారు ప్రమాదానికి కారణమని స్వయంగా చెప్పారని పొన్నవోలు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మూడు రోజుల తర్వాత అదే ఎస్పీ మాట మార్చారన్నారు. ప్రమాదానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు ప్రయాణించిన వాహనమే కారణమంటూ మీడియా ముఖంగా చెప్పారని నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ప్రమాదానికి వాహనంలో కూర్చున్న వ్యక్తులను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు.  

వాహనంలో ఉన్న వారిని ఎలా విచారిస్తారు? 
రాష్ట్ర ప్రభుత్వం తరఫున  అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. పిటిషనర్లు ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు. ప్రమాదం తరువాత సింగయ్యను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారన్నారు. ఓ వ్యక్తి మరణానికి కారణమై ఇప్పుడు ఏమీ జరగలేదంటూ చెబుతున్నారన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాహనంలో ప్రయాణిస్తున్న వారిని ఎలా విచారిస్తారని ప్రశ్నించారు.  

ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుంది..? 
వేల మంది సమూహంగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. కుంభమేళా లాంటి భారీ జన సమూహాలు ఉన్న చోట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహన ప్రమాదంలో.. ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుందని విస్మయం వ్యక్తం చేశారు. అంత భారీ జనసమూహంలోని ఓ వ్యక్తి వాహనం కింద పడితే.. ఆ వ్యక్తిని అలా చావనివ్వండి అని ఎవరైనా పక్కన పడేసి వెళ్లిపోరుగా? అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందా? అని పోలీసులను సూటిగా ప్రశ్నించారు. 

దీనిపై అన్ని ఆధారాలున్నాయని, సమయం ఇస్తే వాటిని కోర్టు ముందుంచుతామని ఏజీ దమ్మాలపాటి నివేదించడంతో.. విచారణ మంగళవారానికి వాయిదా వేస్తామని, అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ సమయంలో పొన్నవోలు స్పందిస్తూ అప్పటి వరకు స్టే ఇవ్వాలని కోరగా, ఆ అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. 

వైఎస్‌ జగన్‌ భద్రతపై పోలీసుల నిర్లక్ష్యం
వైఎస్‌ జగన్‌ తరఫున శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఒక మాజీ సీఎంకార్యక్రమంలో భద్రతాపరంగా తీవ్ర లోపాలున్నా పోలీసులు కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదని న్యాయస్థానానికి నివేదించారు. దీనిపై తాము న్యాయపరంగా పోరాటం చేస్తున్నామన్నారు. మొదట బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106 కింద పెట్టిన కేసును పోలీసులు, తర్వాత 105 (కల్పబుల్‌ హోమిసైడ్‌) కిందకు మార్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్‌ జగన్‌ భద్రత, జనసమూహాలను నియంత్రించే విషయంలో పోలీసులు తీవ్ర ఉదాశీనత ప్రదర్శిస్తున్నారన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారని తెలిపారు. 

దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘ప్రభుత్వాన్ని పూర్తి ఆధారాలు కోర్టు ముందుంచనివ్వండి... ఈలోపు మీకు కావాల్సింది రక్షణే కదా? మీకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిస్తా..’ అని తెలిపారు. అనంతరం శ్రీరామ్‌ స్పందిస్తూ.. తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ, అప్పటివరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement