భూ ఆక్రమణలపై కన్నెర్ర!

High Court Mandate AP Govt On Occupiers of panchayat lands - Sakshi

మునిసిపల్, అటవీ భూముల ఆక్రమణదారులను 2 నెలల్లో గుర్తించాలి 

వారిని ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలి 

ఆ భూములు తిరిగి కబ్జాకు గురి కాకుండా గట్టి చర్యలు చేపట్టాలి 

ఖాళీ చేయించే ముందు నోటీసిచ్చి వారి వాదనలు వినాలి 

హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు    

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ, మునిసిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ భూముల ఆక్రమణదారులను ఆరు నెలల్లో ఖాళీ చేయించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. మునిసిపాలిటీ, అటవీ భూములను ఆక్రమించుకున్న వారిని రెండు నెలల్లోగా గుర్తించి ఆ తరువాత ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆక్రమణదారులను ఖాళీ చేయించిన తరువాత తిరిగి కబ్జాల బారిన పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది.

ఆక్రమణదారులను ఖాళీ చేయించే విషయంలో నిబంధనలు అనుసరించాలని అధికారులకు సూచించింది. పంచాయతీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల పేరు మీద క్రమబద్ధీకరించరాదని, వాటిని ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించాల్సిందేనంటూ జగ్పాల్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు 2011లోనే విస్పష్టమైన తీర్పు ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది.

సుప్రీం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది జీవో 188 జారీ చేసి ఆక్రమణల తొలగింపునకు నిబంధనలు రూపొందించిందని తెలిపింది. అయినప్పటికీ అధికారులు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది.

ఆక్రమణలపై పలు వ్యాజ్యాలు దాఖలు..
జీవో 188 జారీ అయినప్పటికీ ప్రభుత్వ భూములు, నీటి వనరులు, అటవీ, క్రీడా స్థలాలు, శ్మశానాల స్థలాలను ఆక్రమణల నుంచి అధికారులు కాపాడటం లేదని, ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది బుస్సా రాజేంద్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఇదే అంశంపై పలు పిల్‌లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై సీజే ధర్మాసనం ఉమ్మడిగా విచారణ జరిపింది. ఆక్రమణల చెర నుంచి ప్రభుత్వ భూములకు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ పరిస్థితి మారాలి...
‘జగ్పాల్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం 2011లో జీవో 188 జారీ చేసింది. ఆ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్‌ గ్రామ పంచాయతీ (ఆస్తుల పరిరక్షణ) రూల్స్‌ను తెచ్చింది. వీటి ప్రకారం పంచాయతీ భూములను మూడు రకాలుగా వర్గీకరించింది. 1.సొంతవి, సేకరించిన భూములు 2. దానంగా, విరాళంగా, పంచాయతీలకు బదిలీ చేసిన భూములు 3. పంచాయతీకి చెందిన భూములు. ఏటా పంచాయతీ పరిధిలోని భూముల వివరాలను సేకరించి గెజిట్‌లో ప్రచురించాలి. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఖాళీ చేయించాలి.

ఆక్రమణల గుర్తింపు, తొలగింపు కోసం కలెక్టర్‌ నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ మూడు నెలలకొకసారి సమావేశమై ఆక్రమణల తొలగింపు పురోగతిని సమీక్షించాలి. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా దురదృష్టవశాత్తూ అధికారులు వీటిని అమలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఏటా పెరిగిపోతున్నాయి. హైకోర్టులో పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు నిబంధనలను అమలు చేయడం లేదు.

ఈ పరిస్థితి మారాలి. ఆక్రమణదారుల చెర నుంచి ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. çపంచాయతీ, మునిసిపాలిటీ, అటవీ, రెవెన్యూ భూముల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేయించాలి’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించే ముందు నోటీసు ఇచ్చి వారి వాదన వినాలని స్పష్టం చేసింది.

నిర్దిష్ట సమయం నిర్ణయించుకుని ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని మునిసిపల్‌ అధికారులకు తేల్చి చెప్పింది. పంచాయతీ కార్యదర్శులంతా జీవో 188 ప్రకారం ఆక్రమణదారులను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పంచాయతీ భూముల నుంచి ఆక్రమణదారులను ఆరు నెలల్లో ఖాళీ చేయించాలని నిర్దేశించింది.

వక్ఫ్‌ భూములను ఈ జాబితాలో చేర్చలేం..
ధర్మాసనం మొదట తన ఉత్తర్వులను పంచాయతీ, మునిసిపల్, అటవీ భూములకే పరిమితం చేయగా రెవెన్యూ, దేవదాయశాఖ భూములను కూడా జత చేయాలని రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ రెవెన్యూ భూములను ఆక్రమణల తొలగింపు ఉత్తర్వుల్లో చేర్చింది. దేవదాయ శాఖ భూములపై వేరుగా విచారణ జరుపుతామని తెలిపింది.

ఈ సమయంలో ప్రభుత్వ మరో న్యాయవాది ఖాదర్‌ బాషా జోక్యం చేసుకుంటూ వక్ఫ్‌ భూములు కూడా పెద్ద సంఖ్యలో ఆక్రమణల్లో ఉన్నాయని, వాటిని కూడా ఆ ఉత్తర్వుల్లో చేర్చాలని కోరారు. అయితే ధర్మాసనం అందుకు నిరాకరిస్తూ వక్ఫ్‌ భూముల విషయంలో బహుళ వివాదాలుంటాయని, అందువల్ల వాటిని ఈ ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురాలేమని పేర్కొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top