ఇంగ్లిష్‌ పరిజ్ఞానం తప్పనిసరి | High Court comment on English medium teaching in AP govt schools | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ పరిజ్ఞానం తప్పనిసరి

May 7 2026 5:09 AM | Updated on May 7 2026 5:09 AM

High Court comment on English medium teaching in AP govt schools

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధనపై హైకోర్టు వ్యాఖ్య

ఇది ఎవరూ కాదనలేని సత్యం 

ఇంగ్లిష్‌ పరిచయం లేకపోతే పిల్లలు ఇతర రంగాల్లో రాణించలేరు 

తెలుగుతో పాటు ఇంగ్లిష్‌ కూడా నేర్చుకోవాలి 

అప్పుడే పిల్లలు ఇతర రంగాల్లో రాణించగలుగుతారు 

ఆ రంగాల్లో వారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయి

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు ఇంగ్లిష్‌ పరిజ్ఞానం తప్పనిసరి అని, లేకపోతే పిల్లలు ఆయా రంగాల్లో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపింది. ఇంగ్లిష్‌ అనేది అందరినీ ఏకం చేసే ఒక అంశమని కోర్టు అభి­ప్రాయపడింది. పిల్లలకు తెలుగుతో పాటు ఇంగ్లిష్‌ మీడియంలో కూడా చదువుకునే అవకాశం కల్పించడం ద్వారా వారు ఇతర రంగాలలోకి విస్తరించడానికి మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ద్వారా పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అది మంచి పరిణామమేనంది. ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్‌ పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు తగిన అవకాశాలు దొరక్క పోవచ్చని తెలిపింది. 

ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన భాషగా ఇంగ్లిష్‌ ఉంటుందంటూ గత నెల 16న విద్యా శాఖ ప్రొసీడింగ్స్‌ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ప్రొఫెసర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యా­జ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం విచా­రణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవా­ది గడిపూడి వెంకటేశ్వర్లు వాదనలు విని­పి­స్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ను బోధన భాషగా చేస్తూ గత ప్రభుత్వం తీసు­కొచ్చిన విధానాన్ని ఇదే హైకోర్టు కొట్టేసిందన్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం కూడా ఇంగ్లిష్‌ను బోధనా భాషగా చేస్తూ గత నెల 16న ప్రొసీడింగ్స్‌ జారీ చేసిందని వివరించారు.

పొరపాటు జరిగింది.. సవరించాం
విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) గుర్రం రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. బోధన భాషగా ఇంగ్లిష్‌ను పొరపాటున పేర్కొన్నామని, అందువల్ల ఆ ప్రొసీడింగ్స్‌ను సవరించామని కోర్టుకు నివేదించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ద్విభాషా విధానం (తెలుగు, ఇంగ్లిష్‌) అమల్లో ఉంటుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇక ఈ వ్యాజ్యం నిరర్థకమని, ఇందులో విచారించేందుకు ఏమీ లేదని స్పష్టం చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement