అయ్యో తపస్వి.. ఆ ప్రేమోన్మాది ఎంత కిరాతకంగా చంపాడమ్మా!

Guntur Medico Tapasvi Death Case Home Town Feel Shades of sadness - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: గుంటూరు తక్కెళ్లపాడులో సోమవారం జరిగిన ఘోరం.. రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది డెంటల్‌ విద్యార్థిని తపస్వి(21). దగ్గర్లో పరీక్షలు ఉండడంతో స్నేహితురాలి ఇంటికి చదువుకోవడానికి వెళ్లిన తపస్విపై హఠాత్తుగా దాడికి దిగిన జ్ఞానేశ్వర్‌.. ఆమె గొంతు కోసి పైశాచికంగా హతమార్చాడు. ఈ ఉదంతంతో కృష్ణా జిల్లా పామిడిముక్కల మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

పుట్టిన కొన్నిరోజులకే తపస్విని వృత్తిరిత్యా తల్లిదండ్రులు తన తాత-నానమ్మల దగ్గర వదిలేశారు వెళ్లారు. అలా పెరిగి ఐదో తరగతి దాకా కృష్ణాపురంలోనే చదువుకుంది తపస్వి. అనంతరం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఇక్కడే ఇంటర్మీడియెట్‌ దాకా చదువుకుంది ఆమె. నాలుగేళ్ల కిందట సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన ఆమె తల్లిదండ్రులకు ముంబైకి బదిలీ అయ్యింది. దీంతో.. బీడీఎస్‌ చదివేందుకు విజయవాడ వచ్చి హాస్టల్‌లో ఉంటోంది తపస్వి. 

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన జ్ఞానేశ్వర్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తపస్వితో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ప్రేమ, పెళ్లి అంటూ వేధింపులు మొదలుపెట్టాడు. సోమవారం సాయంత్రం ఇంట్లోకి ప్రవేశించి.. సర్జికల్‌ బ్లేడ్‌తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె స్నేహితురాలి అరిచి.. సాయం కోసం పరిగెత్తగా తలుపులు వేసి మరీ తపస్విని ఘోరంగా చంపాడు. ఇక తపస్వి ఘోర హత్యోదంతాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కళ్ల ముందే పుట్టి పెరిగిన బిడ్డ.. ఇలా విగత జీవిగా టీవీల్లో, ఫోన్‌లలో కనిపించడాన్ని స్వగ్రామం కృష్ణాపురం వాసులు తట్టుకోలేకపోతున్నారు. 

తపస్వి చాలా ధైర్యవంతురాలని.. తనకు ఎలాంటి సమస్యలు ఉన్నట్లు తమకేం చెప్పలేదని బంధువులు అంటున్నారు. ప్రేమ-వేధింపులు, తక్కెళ్లపాడులో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన విషయం కూడా తమకేమీ తెలియదని చెప్పారు.  అలాగే.. ఇలాంటివి ఇంకెక్కడా జరగకుండా చూడాలని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తపస్వి బంధువులు ఆవేదనగా కోరుతున్నారు. 

ఇదీ చదవండి: పోలీసులు హెచ్చరించినా కూడా తపస్విపై..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top