కల్తీరాయుళ్లపై దాడులు నిరంతరం

Guntur District Collector‌ Warning to traders about food adulteration - Sakshi

గుంటూరు జిల్లా కలెక్టర్‌ హెచ్చరిక

‘సాక్షి’ కథనంతో కదులుతున్న అధికారులు

గుంటూరు వెస్ట్‌: కల్తీ వ్యాపారుల లీలలు చూస్తుంటే తీవ్ర ఆందోళన కలుగుతోందని.. వీరిపై దాడులను గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నిరంతరం జరపాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ఆదేశించారు. కల్తీ వ్యాపారుల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దన్నారు. గత సోమవారం ‘సాక్షి’లో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికతో వచ్చిన కథనం ఆధారంగా జిల్లా అధికారులు నాలుగు రోజులుగా వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లపై పెద్దఎత్తున దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నమూనాలు సేకరించడం, పరీక్షలకు పంపడం తదితర అంశాలు వేగంగా చేపట్టాలన్నారు. కల్తీ ఉన్నట్లు తేలితే 6 నెలలు జైలుశిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధిస్తారని కల్తీరాయుళ్లకు చెప్పాలన్నారు. వ్యాపారులకు కూడా చట్టంపట్ల అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కల్తీ వ్యాపారులను పట్టించాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎవరైనా 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేస్తే అధికారులు తక్షణం స్పందించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న అధికారులపై కలెక్టర్‌ మండిపడ్డారు. ప్రజలకు ఎంతో ముఖ్యమైన ఆహార వస్తువులు కల్తీ జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. 

కఠినంగా వ్యవహరిస్తున్నాం
కాగా, సమావేశంలో వివిధ శాఖల అధికారులు తాము చేపడుతున్న చర్యలను పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఇప్పటివరకు 124 వ్యాపార సంస్థలను తనిఖీచేసి 16 సంస్థలను సీజ్‌ చేశామన్నారు. 87 సంస్థల్లో శాంపిల్స్‌ సేకరించామన్నారు. కొన్ని శాఖల మధ్య సమన్వయ లోపం కూడా అక్రమార్కులు విజృంభించడానికి కారణమని, సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.ప్రశాంతి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ గౌస్‌ మొహిద్దీన్, పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్‌ చిన్నయ్య , జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top