భగ్గుమన్న భానుడు | Gudur in Nellore district recorded the season highest temperature at 45. 8 Degrees | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న భానుడు

May 1 2026 4:06 AM | Updated on May 1 2026 4:06 AM

Gudur in Nellore district recorded the season highest temperature at 45. 8 Degrees

గూడూరులో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత

ఈ సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు 

నేడూ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలు రికార్డయింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45,  తిరుపతి జిల్లా రాయలచెరువులో 44.3, ఎన్టీఆర్‌ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలో 43.6, బాపట్ల జిల్లా కారంచేడు, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43.5, నంద్యాల జిల్లా సంజామలలో 43.2, వైఎస్సార్‌ కడప జిల్లా కోడూరులో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 20 జిల్లాల పరిధిలోని 216 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు కురిశాయి. 

నేడు తీవ్ర వడగాడ్పులు 
శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 49 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

మరోవైపు కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్‌ గల్ఫ్‌ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న మూడు రోజులు అకాల వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement