జీఎస్టీ నేల చూపులు | GST Drops In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

జీఎస్టీ నేల చూపులు

Jun 2 2026 4:40 AM | Updated on Jun 2 2026 4:40 AM

GST Drops In Andhra Pradesh

గణనీయంగా తగ్గిన రాష్ట్ర జీఎస్టీ ఆదాయం– 2024తో పోలిస్తే 2026 మే నెలలో రూ.173 కోట్లు తగ్గిన ఆదాయం– గతేడాదితో పోలిస్తే రూ.86 కోట్లు తగ్గుదల– దీంతో ఏకంగా గత రెండేళ్ల గణాంకాలనే మార్చేసిన ప్రభుత్వం – ఈ ఏడాది పెరుగుదల చూపించేందుకు తంటాలు  

సాక్షి, అమరావతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లు తిరోగమన దిశలోనే పయనిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన 2026 మే నెల స్థూల జీఎస్టీ ఆదాయం రూ.3,717 కోట్లకు పరిమితమయ్యింది. 2024 మే నెలలో రూ.3,890 కోట్లు, 2025 మేలో రూ.3,803 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం.. ఇప్పుడు రూ.3,717 కోట్లకు పడిపోయింది.

2024తో పోలిస్తే రెండేళ్లలో మే నెల జీఎస్టీ ఆదాయం రూ.173 కోట్లు పడిపోయింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల ఆదాయంలో కూడా 5.2 శాతం క్షీణించింది. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.8,490 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం.. ఇప్పుడు రూ.449 కోట్లు తగ్గి రూ.8,041 కోట్లకు పరిమితమయ్యింది. వాస్తవాలు ఇలా ఉంటే గతంలో తామిచ్చిన గణాంకాలనే ఇప్పుడు మార్చేసి ఏకంగా రికార్డు స్థాయిలో వృద్ధి నమోదయ్యిందంటూ రాష్ట్ర ప్రధాన పన్నుల అధికారి ఎ.బాబు ప్రకటన జారీ చేయడం గమనార్హం 

దొంగ లెక్కల్లో బాబుకే ‘బాబు’ 
దొంగ లెక్కలు చెప్పడంలో రాష్ట్ర ప్రధాన పన్నుల అధికారి ఎ.బాబు ముఖ్యమంత్రి చంద్రబాబును మించిపోయారు. ఈ ఏడాది జీఎస్టీ పెరిగిందని చూపించుకోవడానికి ఏకంగా అంతకుముందు వారిచ్చిన జీఎస్టీ గణాంకాలనే మార్చేసి అడ్డంగా దొరికిపోయారు. కిందటి సంవత్సరం మే నెలలో జీఎస్టీ గణాంకాలు విడుదల చేసినప్పుడు రాష్ట్ర స్థూల జీఎస్టీ ఆదాయం 2024 మేలో రూ.3,890 కోట్ల నుంచి 2025 మేలో 2.4 శాతం క్షీణించి రూ.3,803 కోట్లకు పడిపోయిందని ఎ.బాబు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

ఇప్పుడు ఈ విలువ మరింత తగ్గి రూ.3,717 కోట్లకు పడిపోవడంతో ఏకంగా గత రెండేళ్ల గణాంకాలను తగ్గించేసి.. ఈ ఏడాది పెరిగినట్లు చూపిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జీఎస్టీ ఆదాయం పెరిగిందని చూపించడం కోసం 2024 మే నెల ఆదాయాన్ని రూ.3,631 కోట్లకు, 2025 మే నెల ఆదాయాన్ని రూ.3,596 కోట్లకు తగ్గించేసి.. ఈ ఏడాది మే నెల జీఎస్టీ ఆదాయం రూ.3,717 కోట్లకు పెరిగిందంటూ ప్రకటన జారీ చేయడంతో వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులే అవాక్కయ్యారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కీలక అధికారే ఇలా తప్పుడు సమాచారం విడుదల చేయడాన్ని తప్పు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement