విద్యార్థులకు ఓఎస్‌ఎమ్‌ షాక్‌... | growing controversy surrounding the On Screen Marking system | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఓఎస్‌ఎమ్‌ షాక్‌...

May 31 2026 4:36 AM | Updated on May 31 2026 4:36 AM

 growing controversy surrounding the On Screen Marking system

ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌(ఓఎస్‌ఎమ్‌)పై పెరుగుతున్న వివాదం 

డిజిటల్‌ ఎవాల్యూయేషన్‌పై తల్లిదండ్రుల ఆందోళన 

సీబీఎస్‌ఈ కొత్త మార్కింగ్‌ విధానంపై దేశవ్యాప్తంగా చర్చ

సాక్షి, ఎడ్యుకేషన్‌ డెస్క్‌: సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్‌ఎమ్‌) విధానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫలితాల తర్వాత తక్కువ మార్కు­లు, ఆన్సర్‌ షీట్ల స్కానింగ్‌ సమస్యలు, రీవాల్యుయేషన్‌పై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆన్సర్‌ షీట్లు మారిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. మరోవైపు డిజిటల్‌ మూల్యాంకనం పారదర్శకతను పెంచుతుందని సీబీఎస్‌ఈ చెబుతోంది.

ఈ వివాదం ఇప్పు డు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల్లో పెద్ద చర్చకు దారితీసింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 2026లో క్లాస్‌–12 బోర్డు పరీక్షల మూల్యాంకనంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనినే ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్‌ఎమ్‌) అంటున్నారు. ఇప్పటి వరకు టీచర్లు విద్యార్థుల ఆన్సర్‌ పేపర్లను పరిశీలించి మార్కులు వేసేవారు. కానీ ఇప్పుడు ఆ పేపర్లను స్కాన్‌ చేసి కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాత చూసి మార్కులు వేస్తున్నారు. 

స్కానింగ్‌పై పెరుగుతున్న అనుమానాలు 
ఈ వివాదంలో మరింత ఆందోళన కలిగించిన అంశం ‘‘అన్సర్‌ షీట్లు మారిపోయాయి’ అనే ఆరోపణలు. కొంతమంది విద్యార్థులు తమ చేతిరాతలా లేదని, కొన్ని పేజీలు కనిపించలేదని, డయాగ్రామ్‌లు బ్లర్‌గా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. రీవాల్యుయేషన్‌ తర్వాత మార్కుల్లో భారీ మా ర్పులు రావడం కూడా అనుమానాలకు బలం చేకూర్చింది. అయితే ఇప్పటి వరకు భారీగా ఆన్సర్‌ షీట్లు మారిపోయా యని నిర్ధారించే అధికారిక ఆధారాలు వెలుగులోకి రాలేదు. 

సాంకేతిక సమస్యలూ చర్చలోకి.. 
విద్యార్థుల ఫిర్యాదుల్లో.. పోర్టల్‌ స్లోగా పనిచేయడం, ఓటీపీ ఆలస్యం, రీవాల్యుయేషన్‌ చెల్లింపుల సమస్యలు, లాగిన్‌ ఇబ్బందులు లాంటివి కూడా ఉన్నాయి. ఇక ఒక యువ సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు పరీక్షా పోర్టల్‌లో భద్రతా బలహీనతలు ఉన్నాయని పేర్కొనడం మరింత చర్చకు దారితీసింది. అయితే సీబీఎస్‌ఈ మాత్రం అసలు మూల్యాంకన వ్యవస్థ సురక్షితంగానే ఉందని స్పష్టం చేసింది. 

రాజకీయ రంగు కూడా 
ఈ వ్యవహారం రాజకీయ చర్చకూ దారి తీసింది. ప్రతి పక్షనేత రాహుల్‌ గాంధీ ఓఎస్‌ఎం టెండర్‌ ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తగా.. కేంద్ర విద్యాశాఖ, సీబీఎస్‌ఈ వాటిని ఖండించాయి. ‘‘కొన్ని ప్రారంభ సమస్యలు ఉండొచ్చు.. అవసరమైతే సరిదిద్దుతాం’ అని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. 

నిజంగా వ్యవస్థ విఫలమైందా? 
విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వివాదాన్ని రెండు కోణాల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఒకవైపు డిజిటల్‌ మూల్యాంకనంలో సాంకేతిక సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ స్కానింగ్‌ నాణ్యత కీలకం. స్పష్టమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ అవసరం. మరోవైపు జాతీయ స్థాయి పరీక్షల్లో మూల్యాంకనం కఠినతరం అవుతోంది. కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నలు పెరుగుతున్నాయి. స్ట్రక్చర్డ్‌ ఆన్సర్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. అంటే ప్రతి తక్కువ మార్కును సిస్టమ్‌ తప్పిదంగా చూడలేమని నిపుణులు చెబుతున్నారు. 

విద్యార్థులకు కొత్త సవాలు.. 
ఈ పరిణామం విద్యార్థులకు కూడా కొత్త పాఠాన్ని నేర్పుతోంది. భవిష్యత్తులో... స్పష్టమైన చేతిరాతతో పాయింట్ల రూపంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. డయాగ్రామ్‌లు స్పష్టంగా ఉండాలి. కీవర్డ్‌ ఆధారిత రాత మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. 

డిజిటల్‌ దిశగా అడుగులు.. 
భారత విద్యా వ్యవస్థ వేగంగా డిజిటల్‌ మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ కూడా ఆ మార్పులో భాగమే. అయితే సాంకేతికతతో పాటు విద్యార్థుల నమ్మకం, పారదర్శకత, వేగవంతమైన ఫిర్యాదు పరిష్కారం కూడా అంతే ముఖ్యం. ఓఎస్‌ఎం వివాదం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. డిజిటల్‌ వ్యవస్థలు ఎంత ఆధునికమైనా.. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి అంశంలో ఖచ్చితత్వం, నమ్మకం అత్యంత కీలకం!!  

ఓఎస్‌ఎం అంటే ఏమిటి? 
ఇప్పటి వరకు అన్సర్‌ పేపర్లను భౌతిక రూపంలోనే టీచర్లు పరిశీలించేవారు. కొత్త విధానంలో మాత్రం విద్యార్థుల ఆన్సర్‌ షీట్లను స్కాన్‌ చేసి డిజిటల్‌ కాపీలుగా మార్చి కంప్యూటర్‌ స్క్రీన్‌పై పరిశీలిస్తున్నారు. మార్కులు నేరుగా సిస్టమ్‌లో నమోదు అవుతున్నాయి. సీబీఎస్‌ఈ ప్రకారం–ఈ విధానం వల్ల మార్కుల లెక్కల్లో పొరపాట్లు తగ్గుతాయి, మూల్యాంకనం వేగవంతం అవుతుంది, పారదర్శకత పెరుగుతుంది, పర్యవేక్షణ సులభమవుతుంది. అయితే ఫలితాల విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. 

తక్కువ మార్కులపై అసంతృప్తి 
ఫలితాలు వెలువడిన వెంటనే సోషల్‌ మీడియాలో వేలాది పోస్టులు కనిపించాయి. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో ఆశించిన మార్కులు రాలేదని అనేక మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు ‘‘సమాధానాలు సరిగానే రాసినా మార్కులు తగ్గించారు’ అని ఆరోపిస్తుండగా.. మరికొందరు... ’డిజిటల్‌ మూల్యాంకనం చాలా కఠినంగా జరిగింది’’అని అంటున్నారు. కొంతమంది ఉపాధ్యాయుల అభిప్రాయం ప్రకారం కీవర్డ్స్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఉండొచ్చు. స్టెప్‌ మార్కింగ్‌ తగ్గి ఉండొచ్చు. పాత విధానంలో ఉండే లీనియెన్సీ తగ్గి ఉండొచ్చు. అయితే దీనిపై సీబీఎస్‌ఈ మాత్రం ‘‘మార్కింగ్‌ విధానం మారలేదు... కేవలం మూల్యాంకన మాధ్యమం మాత్రమే మారింది’ అని చెబుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement