సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు తీసుకోనున్న ప్రభుత్వం
నోటిఫై చేసిన ఆర్బీఐ
రూ.3.37 లక్షల కోట్లకు చేరనున్న చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు మళ్లీ బడ్జెట్ పరిధిలో అప్పు చేస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,900 కోట్ల అప్పును సమీకరించి ఇవ్వనుంది. 17 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 20 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 25 ఏళ్ల కాల వ్యవధిలో రూ.900 కోట్ల అప్పును ప్రభుత్వం చేయనుంది.
ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. కాగా, ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం 22 నెలల్లోనే రూ.3,33,321 కోట్ల అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేయనున్న అప్పుతో కలిపితే మొత్తం రూ.3,37,221 కోట్లకు చేరనుంది. దీంతో నెలకు రూ.15,328.22 కోట్లు, రోజుకు రూ.511 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన ఆర్‌బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసి రూ.3,000 కోట్లు అప్పు సేకరించి ఇచ్చింది.


