AP: ఈ-పంట ఉత్పత్తులు భేష్‌..

Good Agricultural Practices Certification For Farmers From Kharif Season In AP - Sakshi

ఖరీఫ్‌ నుంచి గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌ (జీఏపీ) ధ్రువీకరణ

పొలం బడుల ద్వారా జారీకి సన్నాహాలు

సాక్షి, అమరావతి: రసాయన అవశేషాల్లేని పంటల ధ్రువీకరణ (క్రాప్‌ సర్టిఫికేషన్‌) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించే రైతులకు రానున్న ఖరీఫ్‌ సీజన్‌ నుంచి గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌ (జీఏపీ) సర్టిఫికేషన్‌ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేలా రైతులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం 2019 రబీ సీజన్‌లో వైఎస్సార్‌ పొలంబడులకు శ్రీకారం చుట్టింది.
చదవండి: ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ? 

ఇందులో భాగంగా గ్రామానికి 25 ఎకరాలను ఎంపిక చేసి, విత్తు నుంచి కోతల వరకు 14 వారాల పాటు ఉత్తమ యాజమాన్య పద్ధతుల(జీఏపీ)పై ఆర్బీకేల ద్వారా శిక్షణ ఇస్తారు. తోటి రైతులతో కలిసి ప్రతి రోజూ పంటను పరిశీలిస్తూ సమగ్ర సస్యరక్షణ, పోçషక, నీటి, కలుపు, పురుగు మందుల యాజమాన్య పద్ధతులతో పాటు కూలీల ఖర్చు తగ్గించుకునేందుకు ఎప్పుడు.. ఎలాంటి యంత్ర పరికరాలను వినియోగించాలో ఫామ్‌ మెకనైజేషన్‌ ద్వారా ఎంపికైన రైతులకు అవగాహన కల్పిస్తారు. ఈ విధంగా సమగ్ర పంట నిర్వహణా పద్ధతులను పాటిస్తూ పర్యావరణహితంగా వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడితో రసాయన అవశేషాలు లేకుండా మేలైన దిగుబడులను ఏవిధంగా సాధించవచ్చో తెలియజెపుతారు. రైతులు తమ సొంత వ్యవసాయ క్షేత్రాల్లో వాటిని పాటించేలా ప్రోత్సహిస్తారు. పొలంబడులతోపాటు తోట, పట్టు, మత్స్యసాగు, పశు విజ్ఞాన బడులను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తోంది.

10 నుంచి 22 శాతం పెట్టుబడి ఆదా
5 సీజన్‌లలో నిర్వహించిన పొలంబడుల ద్వారా వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పప్పుధాన్యాల వంటి పంటల్లో 10 నుంచి 22% మేర పెట్టుబడి ఖర్చు ఆదాతో పాటు 10 నుంచి 24% మేర దిగుబడులు పెరిగినట్లు అధ్యయనంలో గుర్తించారు. మూడేళ్లలో రూ.71.17 కోట్లతో 39,944 పొలంబడుల ద్వారా 11.98 లక్షల మంది రైతులను ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దారు. ఇదే స్ఫూర్తితో 2022–23 సీజన్‌లో రూ.50.27 కోట్లతో 17 వేల పొలంబడులు నిర్వహించాలని సంకల్పించారు.

ఎఫ్‌ఏఓ ఆధ్వర్యంలో శిక్షణ 
ఇప్పటి వరకు శిక్షణలకే పరిమితమైన వ్యవసాయ శాఖ రానున్న ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించిన రైతులకు జీఏపీ సర్టిఫికేషన్‌ ఇచ్చేందుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. ప్రత్యేకంగా రూపొందించిన సిలబస్, ప్రొటోకాల్స్‌పై రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండలం, గ్రామ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది, రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు టెక్నికల్‌ కో ఆపరేషన్‌ ప్రొగ్రామ్‌ (టీసీపీ) కింద ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 30 మంది వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. మలిదశలో ఈ నెల 16 నుంచి విడతల వారీగా ఆగçస్టు్ట 20 వరకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ఎంపిక చేసిన 130 మంది అధికారులు, 260 మంది రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో శిక్షణనిస్తారు.

శాస్త్రవేత్తలు పరీక్షించాకే ధ్రువీకరణ
రానున్న ఖరీఫ్‌లో 9 రకాలు, రబీలో 7 రకాల పంటలకు సంబంధించి 5.10 లక్షల మంది రైతులకు జీఏపీ సర్టిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. 3 సీజన్‌లలో పొలంబడులలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించిన రైతులను పంటల వారీగా గుర్తిస్తారు. వారికి దశల వారీగా శిక్షణనిస్తారు. నిర్ధేశించిన ప్రొటోకాల్‌ మేరకు రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో మోతాదుకు మించి రసాయన పురుగు  మందులు వినియోగించకుండా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులను గుర్తిస్తారు. వీరు పండించిన పంట ఉత్పత్తుల నాణ్యతను వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తల ద్వారా పరీక్షించిన తర్వాత వారికి ఏపీ స్టేట్‌ సీడ్‌ సర్టిఫికేషన్‌ ఏజెన్సీ ద్వారా జీఏïపీ సర్టిఫికేషన్‌ (ధ్రువీకరణ) జారీ చేస్తారు. ఇలా ధ్రువీకరణ పొందిన రైతుల పంట ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుంది.

పొలంబడి పండితుడంటున్నారు
నాకున్న రెండెకరాల్లో ఏటా కూరగాయలు సాగు చేసేవాడిని. గడిచిన రబీలో 1.5 ఎకరంలో పొలం బడి పద్ధతిలో, మిగిలిన అరెకరంలో పాత పద్ధతిలో వరి సాగు చేశాను. పొలం బడిలో సాగు చేసిన క్షేత్రంలో 42 బస్తాలు, మిగిలిన అరెకరంలో 12 బస్తాల చొప్పున మొత్తం 54 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. పెట్టుబడి రూ.19,400 పోగా, రూ.55,400 మిగిలింది. పొలంబడిలో నేర్చుకున్న పాఠాలు తోటి రైతులకు చెబుతుంటే ఊళ్లో నన్ను పొలంబడి పండితుడు అంటున్నారు. ఇదే రీతిలో సాగు చేస్తే రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో జీఏపీ గుర్తింపును ఇస్తామంటున్నారు.
– జి.శ్రీనివాసులు, గాజులవారిపల్లి, చిత్తూరు జిల్లా

జీఏపీ కోసం రూట్‌ మ్యాప్‌ 
ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి జీఏపీ సర్టిఫికేషన్‌ ఇచ్చేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశాం. టెక్నికల్‌ కో ఆపరేషన్‌ ప్రాజెక్టు కింద ఎఫ్‌ఏఓ ద్వారా రైతులతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. వర్సిటీ శాస్త్రవేత్తల ద్వారా మూల్యాంకనం చేసి నాణ్యమైన దిగుబడులు సాధించే రైతులకు జీఏపీ గుర్తింపునిస్తాం. కనీసం 5 లక్షల మందికి ఇలా గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
– పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్, వ్యవసాయ శాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top