ఏపీలో ఫ్లిప్‌కార్ట్‌ పెట్టుబడులు 

Flipkart CEO Kalyan Krishnamurthy Met With CM YS Jaganmohan Reddy - Sakshi

విశాఖలో వెచ్చించేందుకు సంసిద్ధత.. ఆర్బీకేల ద్వారా వ్యవసాయ 

ఉత్పత్తుల కొనుగోలు.. పెరగనున్న మత్స్య ఉత్పత్తుల కొనుగోళ్లు  

సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కళ్యాణ్‌ కృష్ణమూర్తి బృందం భేటీ

ముఖ్యమంత్రి ముందుచూపుతో రైతులకు ప్రయోజనమని అభినందన 

అన్నదాతలకు మంచి ధర దక్కేలా సహకారం అందించాలని కోరిన సీఎం 

ఐటీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని ఆహ్వానం  

సాక్షి, అమరావతి: ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖపట్నంలో మరిన్ని పెట్టుబడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో భాగస్వామి కావడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కళ్యాణ్‌ కృష్ణమూర్తి నేతృత్వంలో సంస్థ బృందం గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రైతుల ఉత్పత్తులకు మంచి ధర అందించడం, నైపుణ్యాభివృద్ధిపై విస్తృత చర్చలు జరిగాయి. రైతుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన విప్లవాత్మక చర్యలను సీఎం జగన్‌ íఫ్లిప్‌కార్ట్ట్‌ బృందానికి వివరించారు. 

రైతులకు ఉత్తమ టెక్నాలజీ అందిద్దాం: సీఎం జగన్‌
రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకేలను ప్రారంభించాం. విత్తనం అందించడం దగ్గర నుంచి పంటల కొనుగోలు వరకూ ఆర్బీకేలు నిరంతరం రైతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించేలా ఫ్లిప్‌కార్ట్‌ కూడా ముందుకురావాలి. రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించడంలో పాలు పంచుకోవాలి. రైతులకు మంచి టెక్నాలజీని అందుబాటులోకి తేవడంలో సహాయపడాలి. ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు సీఎం యాప్‌ తీసుకొచ్చాం. దీన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలి. 

విశాఖ మంచి వేదిక
ఐటీ, ఇ–కామర్స్‌ పెట్టుబడులకు విశాఖపట్నం మంచి వేదిక. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఫ్లిప్‌కార్ట్‌ను కోరుతున్నా. నైపుణ్యాలను పెంపొందించేందుకు విశాఖలో ఏర్పాటు చేస్తున్న హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్సిటీలో పాలు పంచుకోవాలి. రాష్ట్రం నుంచి మత్స్య ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిని మరింత పెంచేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సహకారం అందించాలి.

జగన్‌ దార్శనిక ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కృష్ణమూర్తి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. తాము విస్తృతం చేస్తున్న సరుకుల వ్యాపారం ద్వారా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇది ఉభయులకు ప్రయోజనమని, మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషి చేస్తామన్నారు.

విశాఖలో ఇప్పటికే తమ సంస్థ వ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయని, అక్కడ మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని, వచ్చే ఏడాది నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. వాల్‌మార్ట్‌ భాగస్వామ్యంతో రాష్ట్రంలో మత్స్యఉత్పత్తుల కొనుగోళ్లు చేస్తున్నామని, దీన్ని మరింత పెంచుతామన్నారు. సీఎం దూరదృష్టి ఎంతో బాగుందని, రైతుల పంటలకు మంచి ధరలు లభించేలా అంకితభావంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని అభినందించారు. సమావేశంలో ఫ్లిప్‌కార్ట్‌ సీసీఏవో రజనీష్‌ కుమార్, సీఎం కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top