నిరుపేద చిన్నారికి అరుదైన వ్యాధి
రూ.16 కోట్ల ఇంజక్షన్ ఇస్తేనే బతికే అవకాశం
వికారాబాదు జిల్లా: సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగించే నిరుపేద తల్లిదండ్రులకు కొండంత ఆపద వచ్చిపడింది. ఒక్కగానొక్క కొడుకు అరుదైన వ్యాధి (లక్షల మందిలో ఏ ఒక్కరికో సోకే) బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రూ.కోట్ల విలువ చేసే ఇంజక్షన్ ఇస్తే కానీ చిన్నారి బతికే అవకాశం లేదని చెప్పడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వివరాలు ఇలా.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం, బొంరాస్‌పేట్ మండలం వడిచర్ల పరిధిలోని ఊరెనికి తండాకు చెందిన ముడావత్ శ్రీను, గోరీబాయి దంపతులకు ముడావత్ జగన్ అనే ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం తాండూరుకు వచి్చన వీరు సాయిపూర్‌లో నివసిస్తున్నారు.
రెండేళ్లుగా జగన్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా సరైన చికిత్స అందలేదు. దీంతో అప్పు చేసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడిని పరీక్షించిన వైద్యులు.. బాబుకు అరుదైన, ప్రాణాంతక స్పైనల్ మసు్కలర్ ఆట్రోపీ (ఎస్‌ఎంఏ) అనే వ్యాధి సోకిందని చెప్పారు. ఇలాంటి వ్యాధి రాష్ట్రంలో ఎవరికీ లేదని, ఇది కొత్త వైరస్ వల్ల సోకిందని తెలిపారు. ఈ వ్యాధి నయం కావాలంటే జోల్‌జెన్‌స్మా అనే ఇంజక్షన్ ఇవ్వాలన్నారు.
దీన్ని అమెరికా నుంచి తెప్పించాలని, ఇందుకు రూ.16 కోట్లు ఖర్చవుతుందని చెప్పడంతో బాధిత తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రతీ 12 గంటలకు ఒకసారి సిరప్ వేస్తేనే మామూలు స్థితికి వస్తున్నాడని, కొంచెం ఆలస్యమైనా ఫిట్స్ వస్తోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఎమ్మెల్యే, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి తమ కొడుకును బతికించాలని వేడుకుంటున్నారు. దాతలు సైతం ఆరి్ధక సాయం (ఫోన్ పే, గూగుల్ పే నంబర్ 8639157327), (ఎస్‌బీఐ అకౌంట్ నంబర్ 43194942778) చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.


