రెయిన్‌బో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రోగుల ఆందోళన | Fire at Rainbow Children’s Hospital In Vijayawada Sparks Panic, All Patients Safe After Swift Evacuation | Sakshi
Sakshi News home page

రెయిన్‌బో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రోగుల ఆందోళన

Jun 17 2026 11:32 AM | Updated on Jun 17 2026 12:31 PM

Fire Accident In Rainbow Hospital At Vijayawada

సాక్షి, విజయవాడ: విజయవాడ రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ వార్డులో అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించడంతో పిల్లలు, రోగులు ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి ప్రాంగణంలో కేకలు, ఆర్తనాదాలతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే, ప్రమాదంలో అంతా సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వివరాల ప్రకారం.. రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతం కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. లోపలు పొగలు, మంటలు వ్యాపించడంతో ఆందోళన చెందారు. ప్రమాద తీవ్రతను గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ వార్డులోని చిన్నారులను, ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంపై సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అంతా సురక్షితంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

అనంతరం, విజయవాడ రెయిన్‌బో అగ్ని ప్రమాదంపై  ఏపీ ఫైర్ డైరెక్టర్ మురళీ మోహన్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. ఇదే ఘటన రాత్రి జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగేది. ప్రమాదం సమయంలో మొత్తం ఆసుపత్రిలో 12 పిల్లలు ఉన్నారు. 10 రోజుల క్రితమే ఈ ఆసుపత్రిలో మాక్ డ్రిల్ చేశాం. ఫైర్ సేఫ్టీపై అవగాహన ఉండటంతో సకాలంలో మంటలు అదుపులోకి వచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు దట్టంగా పొగలు వ్యాపించాయి. ప్రమాణాలు పాటించడం వల్ల అగ్నిప్రమాదం అదుపులోకి వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న పేషెంట్లను పక్కనే ఉన్న మరో ఆసుపత్రికి తరలించారు’ అని తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement