
ప్రభుత్వ ఐవీఆర్‌ఎస్ సర్వేలోనే తేల్చిచెప్పిన రైతులు
ఎరువుల లభ్యత లేదని 44 శాతం మంది రైతులు వెల్లడి
నాసిరకమైనవాటితో నష్టపోతున్నామన్న 34 శాతం మంది
సరఫరాలో అవినీతి జరుగుతోందని 37శాతం మంది వెల్లడి
ఎమ్మార్పికి మించి వసూళ్లు..ఇతర పురుగుల మందులు అంటగడుతున్నారని 60 శాతం మంది గగ్గోలు
సకాలంలో దొరకడం లేదన్న 74 శాతం మంది గిరిజనులు
సాక్షి, అమరావతి : ఇది పక్కన చెప్పుకొన్న ఉదాహరణలోని గిరిజన రైతు సమస్యనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం అన్నదాతలు పడుతున్న వెత.. ప్రభుత్వ సేవలపై ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఎరువుల సరఫరాపై ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే దీనికి నిదర్శనం.
కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత రాష్ట్రంలో ఎరువుల సరఫరా అధ్వాన్నంగా ఉందంటూ వారంతా తేల్చి చెప్పారు. సకాలంలో, సరైన సమయానికి అవసరానికి తగ్గట్టు లభ్యం కావడం లేదని స్పష్టం చేశారు. పైగా గతంలో ఎన్నడూలేని విధంగా పంపిణీలో కూడా అవినీతి చోటుచేసుకుంటోందని కుండబద్దలు కొట్టారు.
కూటమి పాలనలో కష్టాలు
టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి నప్పటి నుంచి ఎరువుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల (పూర్వపు ఆర్బీకేలు) ద్వారా ఎరువుల సరఫరాను నిలిపివేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా కూడా అరకొరగానే ఇస్తున్నారు. దీంతో సకాలంలో దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదివరకు తరహాలో మండల కేంద్రాలకు పరుగులు తీస్తూ సొసైటీల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
కాంప్లెక్స్ మోత
ఓపక్క కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు రూ.100 నుంచి రూ.255 మేర పెంచడంతో అన్నదాతలు భారం మోయలేక తల్లడిల్లుతున్నారు. మరోపక్క కృత్రిమ కొరత సృష్టిస్తూ డీలర్లు అందినంత దోచుకుంటున్నారు. యూరియా, డీఏపీ ఎరువుల బస్తాపై రూ.100–500 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు ఖరీఫ్‌లోనే కాదు.. రబీలోనూ దోపిడీ కొనసాగుతూనే ఉంది.
రైతు భరోసా లేదు.. అంతా బాదుడే
పది ఎకరాల్లో కాఫీ, పసుపు, మిరియాలు, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్స్‌తో పాటు వరి సాగు చేస్తుంటా. వరి మినహా మిగిలిన పంటలన్నీ సేంద్రియ పద్ధతిలోనే పండిస్తా. వరికి కావాల్సిన ఎరువులు గతంలో గ్రామంలోని రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)లోనే దొరికేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక సరఫరా నిలిపివేశారు. దీంతో 25 కి.మీ. దూరంలో ఉన్న చింతపల్లి, అక్కడ లేకపోతే 40 కి.మీ. దూరంలోని నర్సీపట్నం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది.
ఎరువుల కట్ట కోసం రోజంతా వృథా అవడమే కాదు. చార్జీలకు రూ.500 పైగా ఖర్చవుతోంది. ఎమ్మార్పీపై బస్తాకు రూ.50 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. అవసరం లేని పురుగు మందులు అంటగడుతున్నారు. ఎరువుల్లో నాణ్యత కూడా ఉండడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఏంటిది? అని అధికారులను అడిగితే మేమేం చేయగలం? అని అంటున్నారు. – బౌడు కుశలవుడు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామ గిరిజన రైతు.
ఎరువుల సరఫరాపై ఐవీఆర్‌ఎస్ సర్వేలో ‘ఎరువులు లేవు’ అని చెప్పిన రైతులు
41.2% జనవరిలో
44% మార్చిలో
74% అత్యధికంగాఏజెన్సీ జిల్లాల్లో
56% శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో
‘నాసిరకం’ అని చెప్పిన రైతులు
22.4% జనవరిలో
34% మార్చిలో
67% అత్యధికంగా ఏజెన్సీ జిల్లాల్లో
49% అనంతపురం జిల్లాలో
48% కర్నూలు జిల్లాలో
ఎరువుల సరఫరా సందర్భంగా సహకార సంఘాలు,రైతు సేవా కేంద్రాల్లో అవినీతి జరుగుతోందని చెప్పిన రైతులు 39% జనవరిలో
37% మార్చిలో
45% అత్యధికంగా పల్నాడు,కర్నూలు జిల్లాల్లో
సరిపడాఎరువులు అందుబాటులోఉన్నాయా..?
అన్ని జిల్లాల్లోనూ లేవు అని చెబుతున్న వారు 40- 44%
అవసరమైనప్పుడు, కోరుకున్న ఎరువులు దొరకడం లేదు..41%
ఎమ్మార్పికి మించి యూరియాకు వసూలు చేస్తున్నారు. 60%
ఎరువులతో పాటు అవసరం లేని మందులను అంటగడుతున్నారు 60%