కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో బాబు సర్కారు ఘోర వైఫల్యం
సాక్షి, అమరావతి: అత్యంత పేలవమైన వాదనలు, బాధ్యతా రాహిత్యం, వ్యూహాత్మక తప్పిదాలతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమవుతోందని సాగునీటి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2)లో విచారణ జరుగుతున్న సమయంలో పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్‌ఆర్ (ప్రీ ఫీజుబులిటీ రిపోర్టు) కేంద్ర జల సంఘానికి సమర్పించడం ద్వారా టీడీపీ కూటమి సర్కారు వ్యూహాత్మక తప్పిదం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కృష్ణా, ఉప నదుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేలా 16 ప్రాజెక్టులు చేపట్టడానికి డీపీఆర్‌ల తయారీకి అనుమతిస్తూ సెప్టెంబరు 16న తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో 34ను సవాల్ చేస్తూ ఇంటర్ లొకేటరీ (ఐఏ) అప్లికేషన్ దాఖలు చేయకపోవడం చంద్రబాబు సర్కార్ చిత్తశుద్ధి లోపానికి నిదర్శనమని సాగునీటి, న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
విభజన చట్టం మార్గదర్శకాలు, కేంద్రం 2023 అక్టోబర్ 6న జారీ చేసిన అదనపు విధి విధానాల ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పంపిణీ చేయడంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్.. తెలంగాణ సర్కార్ తుది వాదనలు పూర్తయ్యాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకూ చేపట్టే విచారణలో ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది వాదనలను వినిపించనుంది.
నిర్లక్ష్యంతో నీరుగారుతున్న హక్కులు..!
కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలు.. 65 శాతం, సరాసరి లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన 194 టీఎంసీల మిగులు జలాలు వెరసి 1,005 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై ప్రస్తుతం ట్రిబ్యునల్ విచారిస్తోంది. పరివాహక ప్రాంతం ప్రాతిపదికగా తమకు 904 టీఎంసీలు కేటాయించాలని ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ సర్కార్ తుది వాదనలు వినిపించింది.
ఈ క్రమంలో కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి.. ఉప నదుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేలా కొత్తగా 16 ప్రాజెక్టులు చేపట్టడానికి డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీకి అనుమతి ఇస్తూ సెప్టెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసింది. కేటాయింపులు చేయకుండానే 372.54 టీఎంసీలు తరలించేలా.. 16 ప్రాజెక్టులు చేపట్టడానికి తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోను నిలుపుదల చేయాలని.. ఆ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరుతూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఏపీ ప్రభుత్వం ఐఏ (ఇంటర్ లొకేటరీ) అప్లికేషన్ దాఖలు చేయకపోవడాన్ని సాగునీటిరంగ నిపుణులు తప్పుబడుతున్నారు.
ఇది కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. సాగర్‌కు ఎగువన 45 టీఎంసీల కృష్ణా జలాలు అదనంగా వినియోగించుకుంటామని, చిన్న నీటిపారుదల విభాగంలో 45 టీఎంసీల మిగులు ఉందని.. వెరసి ఆ 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేయడంపై గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఐఏ దాఖలు చేసి దాన్ని అడ్డుకుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు.
పోలవరం–బనకచర్లతో తెలంగాణ చేతికి అస్త్రం..!
గోదావరి వరద జలాలు 243 టీఎంసీలను మళ్లించేలా చేపట్టనున్న పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి మే 22న టీడీపీ కూటమి సర్కారు పీఎఫ్‌ఆర్ సమర్పించడం ద్వారా తెలంగాణ సర్కార్ చేతికి అస్త్రం అందించిందని సాగునీటిరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో కర్ణాటక 21, మహారాష్ట్ర 14 టీఎంసీలు, నాగార్జునసాగర్ ఎగువన ఉమ్మడి ఏపీ 45 టీఎంసీలు అదనంగా వాడుకునేందుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది.
ఇప్పుడు దాన్నే గుర్తు చేస్తూ.. పోలవరం–బనకచర్లకు అనుమతి ఇచ్చిన రోజు నుంచే కృష్ణా జలాల్లో అదనంగా 64.75 టీఎంసీలు వాడుకునేలా ప్రాజెక్టులు చేపడతామని సెప్టెంబర్‌లో కర్ణాటక, అదే దామాషా పద్ధతిలో 42.53 టీఎంసీలు వినియోగించుకుంటామని మహారాష్ట్రలు సీడబ్ల్యూసీకి లేఖలు రాశాయి. తెలంగాణ సర్కార్ పోలవరం–బనకచర్లను పూర్తిగా వ్యతిరేకిస్తూనే.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో దాన్ని అస్త్రంగా మల్చుకుంది.
ప్రస్తుతం కృష్ణా జలాల్లో 323 టీఎంసీలను ఇతర బేసిన్‌లకు ఏపీ సర్కార్ మళ్లిస్తోందని.. కేవలం 189 టీఎంసీలే బేసిన్‌లోని ప్రాజెక్టులకు వినియోగించుకుంటోందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ రాష్ట్రంలో బేసిన్ ప్రాజెక్టులకు ఒక్క పంటకైనా నీటిని కేటాయించాలని వాదించింది. కృష్ణా బేసిన్ బయట ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించడానికి పోలవరం–బనకచర్ల లాంటి ప్రత్యామ్నాయాలు ఏపీకి ఉన్నాయని.. అలాంటి ప్రత్యామ్నాయాలు తమకు లేవని తెలంగాణ సర్కార్ ట్రిబ్యునల్ ఎదుట వాదించింది.
సమర్థ వాదనలు వినిపించకపోవడం వల్లే..!
అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం సెక్షన్–6(1) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్ట విరుద్ధం. ఇదే అంశాన్ని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేంద్రానికి 2013 నవంబర్ 29న ఇచ్చిన తుది నివేదికలో స్పష్టం చేసింది. ఇక విభజన చట్టం 11వ షెడ్యూలు సెక్షన్–85(7)ఈ–4 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యథాతథంగా కొనసాగుతాయి. దీన్ని పరిగణలోకి తీసుకునే ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తూ 2015 జూలైలో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.
దీన్ని బట్టి చూస్తే.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునఃపంపిణీ చేస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే. విభజన చట్టం ప్రకారం చూస్తే.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అదనంగా అంటే 65 శాతం లభ్యత, సగటు ప్రవాహాలు ఆధారంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 194 టీఎంసీల పంపిణీపైనే ప్రస్తుతం విచారణ చేయాలి. అందులోనూ తెలుగుగంగకు 25 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలను తుది నివేదికలో కేటాయించినట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వెల్లడించింది.
వీటిని మినహాయిస్తే.. మిగతా 165 టీఎంసీలను విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, నెట్టెంపాడు, కల్వకుర్తిలకు కేటాయింపులో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ.. తద్భిన్నంగా సెక్షన్–3 కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను పునఃపంపిణీపై విచారణ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించింది. చంద్రబాబు ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని నీటిపారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు.
తెలంగాణ సర్కార్ 372.54 టీఎంసీల కృష్ణా జలాలు తరలించేందుకు డీపీఆర్ తయారీకి అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులు ఇవే..
1. రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 4 నుంచి 10 టీఎంసీలకు పెంపు
2. గట్టు బాల్యెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 1.32 నుంచి 10 టీఎంసీలకు పెంపు
3. నెట్టెంపాడు ఎత్తిపోతల రెండో దశలో మరో 4 టీఎంసీలు తరలింపు
4. 0.5 టీఎంసీల సామర్థ్యంతో బుజ్జితండా–భీమ తండా ఎత్తిపోతల
5. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం మరో 20.12 టీఎంసీలు పెంపు
6. జూరాల వరద కాలువ ద్వారా 100 టీఎంసీలు తరలించి 11.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం
7. కోయిల్‌కొండ–గండీడు ఎత్తిపోతల ద్వారా 123 టీఎంసీలు తరలింపు
8. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల సామర్థ్యం అదనంగా 3.30 టీఎంసీలు పెంపు
9. జయపురం వద్ద 2 టీఎంసీల సామర్థ్యంతో ఆకేరు బ్యారేజ్
10. విస్పంపల్లె వద్ద 1.2 టీఎంసీల సామర్థ్యంతో మరో ఆకేరు బ్యారేజ్
11. 1.3 టీఎంసీల సామర్థ్యంతో మున్నేరు బ్యారేజ్
12. గార్ల వద్ద మున్నేరుపై 1.2 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజ్
13. డోర్నకల్ మండలం ముల్కపల్లి వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్
14. ఎద్దులచెర్వు వద్ద ఆకేరుపై 1.3 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజ్
15. శ్రీశైలం ఎడమగట్టు కాలువ విస్తరణలో భాగంగా 3.99 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా సోమశిల వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్
16. శ్రీశైలం నుంచి నీటిని తరలించి రీజినల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తాగునీటి కోసం దేవులమ్మనాగారం (పది టీఎంసీలు), దండు మైలారం (పది టీఎంసీలు), ఆరుట్ల(పది టీఎంసీలు) సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం.


