అధిక లాభాలు, వడ్డీ ఆశచూపి 1,450 మంది నుంచి రూ.400 కోట్ల డిపాజిట్ల సేకరణ
కొంతమందికి తిరిగి చెల్లింపు..
1,355 మందికి రూ.135 కోట్లు, 25 మంది ఏజెంట్లకు రూ.9 కోట్లకు టోకరా
నలుగురు ప్రధాన నిందితుల అరెస్ట్
వారి వద్ద రూ.100 కోట్ల చరాస్తుల గుర్తింపు
విజయవాడ సీపీ రాజశేఖరబాబు వెల్లడి
లబ్బీపేట(విజయవాడతూర్పు): అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి రూ.144 కోట్ల మేర మోసానికి పాల్పడిన అద్విక ట్రేడింగ్ కంపెనీకి చెందిన నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు మంగళవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నగరానికి చెందిన తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య, అతని భార్య సుజాత 2022లో అద్విక ట్రేడింగ్ కంపెనీ స్థాపించారు. తొలుత రూ.15 లక్షల పెట్టుబడితో దుబాయిలో ఉన్న కబానా అకౌంట్ ద్వారా ట్రేడింగ్ ప్రారంభించారు.
మొదట్లో పెద్దగా లాభాలు రాలేదు. డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఆదిత్య, సుజాతతోపాటు బాదంశెట్టి బాలకృష్ణమూర్తి, నాగలక్ష్మీకుమారి కలిసి అధిక లాభాలు, వడ్డీలు ఆశ చూపించి కొందరు ఏజెంట్ల ద్వారా డిపాజిట్ల సేకరణ ప్రారంభించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు 2023లో భారీగా అద్విక ట్రేడింగ్ కంపెనీ వార్షికోత్సవం నిర్వహించారు. దాదాపు 1,450 మంది నుంచి రూ.400 కోట్లు వరకు డిపాజిట్ల రూపంలో వసూలు చేశారు.
కొందరు డిపాజిటర్లకు వడ్డీతో సహా తిరిగి చెల్లించారు. ఎక్కువ భాగం డిపాజిట్లను మల్టీ బ్యాంక్ గ్రూప్‌నకు బదిలీ చేశారు. కొంత మొత్తాన్ని విదేశీ ప్లాట్‌ఫామ్‌లకు బదిలీ చేశారు. తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య, అతని భార్య సుజాత పేరుతో చరాస్తులు, బంగారం కోనుగోలు చేశారు. కొత్తగా సేకరించిన డిపాజిటర్ల డబ్బులు పాతవారికి చెల్లించేవారు. కొంతకాలానికి డిపాజిటర్లకు డబ్బులు చెల్లించలేని స్థితికి చేరుకుని పారిపోయారు.
వెలుగులోకి ఇలా...
అద్విక ట్రేడింగ్ కంపెనీలో డిపాజిట్ చేస్తే మోసం చేశారంటూ వీరమల్లు గణేష్ చంద్ర ఈ ఏడాది జూన్ 26న మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులు రూ.53 లక్షలు డిపాజిట్ చేస్తే, రూ.13 లక్షలు తిరిగి చెల్లించారని, మిగిలినవి ఇవ్వకుండా మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పది పోలీసు బృందాలు విచారణ చేపట్టాయి. అద్విక ట్రేడింగ్ కంపెనీ 1,450 మంది నుంచి రూ.400 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించినట్లు తేలింది. అందులో కొందరికి తిరిగి చెల్లించగా, 1,355 మందికి రూ.135 కోట్లు చెల్లించాలని పోలీసులు నిర్ధారించారు.
25 మంది ఏజెంట్లకు రూ.9 కోట్లు చెల్లించకుండా మోసం చేసినట్లు తేలింది. నిందితుల వద్ద చరాస్తులు, బంగారం రూ.100 కోట్లు వరకు ఉన్నట్లు గుర్తించారు. తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య, సుజాత, గాదంశెట్టి బాలకృష్ణమూర్తి, నాగలక్ష్మీకుమారిని విజయవాడ రామవరప్పాడు బల్లెంవారి వీధిలో ఉన్న లక్ష్మి ఎంక్లేవ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.23 లక్షల నగదు, 580 గ్రాముల బంగారం, 8.30 కిలోల వెండి, కారు, కంప్యూటర్లు స్వా«దీనం చేసుకున్నారు.


