గళమెత్తిన సంతకం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
ఊపందుకున్న కోటి సంతకాల సేకరణ
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం
ఇది కేవలం సంతకం కాదు.. కోటి గుండెల నిరసన అంటూ గర్జన
సాక్షి,అమరావతి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం ఊపందుకుంది. కోటి సంతకాల సేకరణ శరవేగంగా సాగుతోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జోరువాన కురుస్తున్నా.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు సంతకాల సేకరణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రణన్నినాదాన్ని పూరించారు. అనేక చోట్ల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సర్కారు తీరుపై గళమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించకుంటే పోరాటం ఉద్ధృతమవుతుందని గర్జించారు.
గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌జిల్లాకు ఒకటి చొప్పున 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల పాలనలో వాటిని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. మెడికల్ సీట్లు వద్దన్న ఏకైక ప్రభుత్వం ఇదేనని దుయ్యబట్టారు. రూ.లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలను కూటమి పెద్దలు అతి తక్కువ ధరకు తమ అస్మదీయులకు సింగిల్ టెండర్‌లోనే కట్టబెట్టడం అన్యాయమని గర్హించారు. వైద్య విద్యను వ్యాపారంచేయొద్దని, ఇది కేవలం సంతకం కాదు.. కోటి గుండెల నిరసన అంటూ హెచ్చరించారు.
» అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం భట్టువానిపల్లి గ్రామంలో మంగళవారం కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య హాజరయ్యారు. భట్టువానిపల్లి గ్రామస్తులు సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
» బాపట్ల జిల్లా చుండూరు మండలంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు, నాయకులు సంతకాలు సేకరించారు.
» ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కోయరాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది.
» పార్వతీపురం 14వ వార్డులోని బైపాస్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు.
» ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
» కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోట నరసింహం ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
» కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం, సంతకాల సేకరణ చేపట్టారు.
» కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పాల్గొన్నారు.
» ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం మర్రిపూడి మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ , వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించారు.


