ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తున్న వెనుకబడిన, చిన్న రాష్ట్రాలు
రూ.1,300 కోట్లతో 4 కళాశాలలు నిర్మిస్తున్న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం
ఆ రాష్ట్రం కంటే మెరుగైన స్థితిలో ఉన్న ఏపీలో మాత్రం వైద్య కళాశాలలు ప్రైవేటుపరం
రూ.5 వేల కోట్లు ఖర్చు కూడా చేయలేనంటూ ప్రైవేట్‌కు కట్టబెడుతున్న బాబు
వైద్య కళాశాలలు వస్తే వాటికి అనుబంధంగా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు కూడా వస్తాయ్
తద్వారా పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు లభిస్తాయి
కానీ, చంద్రబాబు ఈ అవకాశాన్ని కాలరాయడంపై నిపుణుల విస్మయం
సాక్షి, అమరావతి: ఛత్తీస్‌గఢ్.. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటి. చిన్న రాష్ట్రం, 33 జిల్లాలు.. 3.10 కోట్ల జనాభా.. 99 అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఏడాదికి రూ.1.41 లక్షల కోట్ల రెవెన్యూ.. ఇంతటి వెనుకబడిన రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఉంటే.. వాటిలో 12 ప్రభుత్వానికి చెందినవే.
ఆ రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు వీలుగా మరో నాలుగు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.1,300 కోట్లతో నాలుగు కొత్త కళాశాలల నిర్మాణానికి ఆ రాష్ట్ర వైద్య శాఖ టెండర్లను ఖరారు చేసింది. ఒకటి, రెండేళ్లలో ఆ రాష్ట్రంలో ప్రతి 19 లక్షల మందికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకివస్తుంది.
ఏపీ పరిస్థితి ఇదీ
జనాభా.. విస్తీర్ణం.. రెవెన్యూ వంటి అన్ని అంశాల్లో ఛత్తీస్‌గఢ్ కంటే ముందుండే ఏపీలో పరిస్థితి పరిశీలిస్తే.. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5.50 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. ఈ జనాభాకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ప్రారంభించిన ఐదు కళాశాలలతో కలిపి 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన ఏపీలో 34 లక్షల జనాభాకు ఒక ప్రభుత్వ కళాశాల ఉంది.
దేశంలోని అతి చిన్న, వెనుకబడిన రాష్ట్రాలు సైతం ప్రజారోగ్యం, పిల్లల భవిష్యత్‌కు బంగారుబాట వేసేలా ప్రభుత్వ రంగంలో విద్యా, వైద్య వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి. ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150కి పైగా కొత్త కళాశాలల ప్రారంభానికి అనుమతులిచ్చింది. వీటిలో 80 వరకు వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ కళాశాలలే ఉన్నాయి. ఏపీలో మాత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యల ఫలితంగానే గత ఏడాది పాడేరు వైద్య కళాశాల అందుబాటులోకి వచ్చింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక..
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నప్పటికీ చంద్రబాబు కొత్త ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు దిశగా అడుగులు వేయకపోగా.. గత ప్రభుత్వంలో వచ్చిన కళాశాలలను సైతం ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. ఇందుకోసం పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు దేశంలో అత్యంత వెనుకబడిన, చిన్న రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, హరియాణ , హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో సైతం లేనివిధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
పీపీపీ ముసుగులో ఏకంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తుండటంపై అన్నివర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఛత్తీస్‌గఢ్ వంటి చిన్న రాష్ట్రం, ఏపీతో పోలిస్తే ఆర్థికంగా ఎంతో వెనుకబడిన రాష్ట్రం సైతం ఒకేసారి రూ.1,300 కోట్లతో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తోంది. భూములు సేకరించి, టెండర్లు ప్రక్రియ పూర్తిచేసి, తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న కళాశాలలను సైతం చంద్రబాబు ప్రైవేట్‌కు కట్టబెట్టి ప్రభుత్వ వైద్యరంగాన్ని ధ్వంసం చేస్తుండటం గమనార్హం.
రూ.5 వేల కోట్లు లేవంటూ..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కల్పన, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను పెంచేలా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.8,480 కోట్ల అంచనాలతో కళాశాలలు నెలకొల్పడానికి ప్రణాళికలు రూపొందించారు. 17 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర సాయం, స్పెషల్ అసిస్టెంటెన్స్ టు ది స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పథకం, నాబార్డు రుణాల ద్వారా నిధులు సమకూర్చారు.
ఒక్కోచోట 50 నుంచి 100 ఎకరాల చొప్పున 17 వైద్య కళాశాలలకు భూములు సేకరించారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని సైతం ఎదురొడ్డి 2023–24లో 5, 2024–25లో మరో 5, 2025–26లో ఇంకో 7 కళాశాలలు ప్రారంభించేలా అడుగులు ముందుకు వేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు వందేళ్ల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 2023–24లో ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం కళాశాలల్ని ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చారు.
2024–25లో మరో 5 కళాశాలలు ప్రారంభించేలా సార్వత్రిక ఎన్నికల నాటికే ఏర్పాట్లు చేశారు. ఆ చర్యల ఫలితంగానే పాడేరు, పులివెందులకు 50 చొప్పున సీట్లతో అడ్మిషన్లకు ఎన్‌ఎంసీ అనుమతులు ఇచ్చింది. గతేడాది బాబు గద్దెనెక్కిన వెంటనే వైద్య కళాశాలలపై నీలినీడలు కమ్ముకున్నాయి. పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టేస్తున్నామని వైద్య శాఖపై మొదటి సమీక్షలోనే సీఎం ప్రకటించారు. అంతేకాకుండా గతేడాదే పులివెందుల వైద్య కళాశాలకు ఎన్‌ఎంసీ అనుమతులు ఇచ్చినా వద్దని కుట్రపూరితంగా రద్దు చేయించారు.
ప్రభుత్వమే కళాశాలలు నిర్మించి, నిర్వహించడానికి నిధుల్లేవంటూ ఏకంగా 10 కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు కట్టబెట్టడానికి పూనుకున్నారు. వాస్తవానికి 10 కళాశాలలు నిర్మించడానికి రూ.5 వేల కోట్ల నిధులుంటే సరిపోతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి ఖర్చు పెట్టాల్సి అవసరం లేదు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వ రంగంలో 10 కళాశాలలు అందుబాటులోకి వచ్చేవి.
మోసపూరితంగా..
వైఎస్ జగన్ ప్రభుత్వం రచించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నడుచుకుని ఉంటే ఈ విద్యా సంవత్సరానికే 17 వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం అయి ఉండేవి. ప్రైవేట్‌కు వైద్య కళాశాలలు కట్టబెట్టడం కోసం ఆయన చేసిన కుట్రలతో రెండేళ్లలో 2,550 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు కళాశాలలు పీపీపీకి ఇవ్వడంతో ప్రజలు, విద్యార్థులపై ఎటువంటి భారం ఉండబోదనే ప్రకటనలతో మోసం చేస్తోంది.
వైఎస్ జగన్ విధానంలో ఒక్కో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆలిండియా, రాష్ట్ర కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కోటా సీట్లు 86 ఉండగా.. వీటిలో 11 సీట్లకు బాబు గండి కొడుతున్నారు. తద్వారా 10 కళాశాలల్లో 110 సీట్లను విద్యార్థులు నష్టపోతున్నారు. ఆ సీట్లన్నింటినీ యాజమాన్య కోటాకు మళ్లించి, ప్రైవేట్ వ్యక్తులు ఫీజులు రూపంలో దోచుకునేలా ప్రభుత్వమే ప్రణాళిక వేసింది.
అదేవిధంగా పీపీపీలో యాజమాన్య కోటా సీట్లకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఫీజులను ప్రతిపాదించారు. జగన్ విధానంలో రోగులకు బోధనాస్పత్రుల్లో పూర్తిస్థాయిలో ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేవి. బాబు విధానంలో ఏ సేవకైనా పేదలు డబ్బు చెల్లించాల్సిందేనని, ఏదీ ఉచితం కాదని ఇప్పటికే స్పష్టం అయిపోయింది.


