
కృష్ణా జిల్లా బందరు మండలం బుద్దాలపాలెంలో రైతుల నిరసన
అదునులో ఎరువులు అందక రైతన్నల అగచాట్లు
జోరుగా సాగుతున్న పొలం పనులు.. యూరియాకు గిరాకీ
రైతు సేవా కేంద్రాల్లో స్టాక్ నిల్
సొసైటీల్లోనూ కానరాని ‘మందుకట్ట’లు
పోలీస్ పహారాతో అరకొరగా పంపిణీ
టీడీపీ నేతల సిఫార్సులతోనే సరఫరా
వ్యవసాయేతర అవసరాలకు మళ్లుతున్న యూరియా
అధికారులను నిలదీస్తున్న అన్నదాతలు
పోలీసు పహారాలో..
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని పెనుమల్లి సొసైటీ పరిధిలో 10 గ్రామాలున్నాయి. ఇక్కడ 4 వేల ఎకరాలకు పైగా ఆయుకట్టు ఉంది. ఖరీఫ్‌లో వరి సాగు చేయగా ప్రస్తుతం మొలక దశలో ఉంది. ఇప్పుడు మొదటి డోసు కింద 120 టన్నుల యూరియా అవసరం. కానీ ఇప్పటివరకు 3 విడతల్లో వచ్చింది 70 టన్నులు మాత్రమే. సోమవారం ఎరువుల కోసం రైతులు పెద్ద సంఖ్యలో సొసైటీ వద్దకు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు.
సాక్షి, అమరావతి: ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతన్నలను ప్రభుత్వ నిర్వాకం వల్ల తలెత్తిన ఎరువుల కొరత పట్టి పీడిస్తోంది. యూరియా కొరత మరీ దారుణంగా ఉంది. అధికారులు చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయి పరిస్థితికి ఏమాత్రం పొంతన లేదు. రైతు సేవా కేంద్రా లు (పూర్వపు ఆర్బీకేలు) కాదు కదా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) వద్దా నిల్వలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. పొలాలకు చేరాల్సిన యూరియా, డీఏపీ పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి.
బహిరంగ మార్కెట్‌లో నిలువు దోపిడీ..
ఖరీఫ్ 2025 సీజన్ సాగు లక్ష్యం 85.26 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాగు 20 లక్షల ఎకరాలు దాటింది. ప్రస్తుతం మొలక దశలో ఉన్న పంటకు ఎకరాకు కట్ట యూరియా, కట్ట డీఏపీ తప్పనిసరి. పైరు ఎదుగుదలకు ఎంతగానో దోహదపడే యూరియా ప్రస్తుతం అసలు కానరావడం లేదు.
యూరియా ఎమ్మార్పీ రూ.266.50 కాగా బహిరంగ మార్కెట్‌లో రూ.310 – రూ.440 వరకు విక్రయిస్తున్నారు. డీఏపీ, ఇతర ఎరువులతో పాటు జింకు గుళికలను అంటగడుతున్నారు. అవి కొంటేనే డీఏపీ అంటూ అందినకాడికి దోచేస్తున్నారు. సొసైటీల్లో ఏ ఒక్క రైతుకూ బస్తాకు మించి ఇవ్వ డం లేదు. ఇదే అదునుగా కృత్రిమ కొరత సృష్టిస్తున్న ప్రైవేటు వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. యూరియా కొరత వల్ల డీఏపీ బస్తా ధర రూ.1,350 ఉండగా, మార్కెట్‌లో మాత్రం రూ.1,450 నుంచి రూ.1,550 వరకు పెంచి అమ్ముతున్నారు.
పక్కదారి పడుతున్నా పట్టని ప్రభుత్వం..
ఖరీఫ్ సీజన్‌లో 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా 9.74 లక్షల టన్నుల విక్రయాలు జరిగినట్లు చెబుతున్నారు. అత్యధికంగా 4.10 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ఓపక్క చూస్తే 50 శాతం సాగు కూడా పూర్తి కాలేదు. వర్షాధార ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల పంట భూములు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఈ నెలలో కేంద్రం నుంచి రావాల్సిన 1.65 లక్షల టన్నుల యూరియా ఇప్పటివరకు అందలేదు. యూరియా సహా ఎరువుల్లో సింహభాగం ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌లను కాదని ప్రైవేటు వ్యాపారులకే కేటాయిస్తున్నారు.
సొసైటీలకు చేరిన కొద్దిపాటి ఎరువులను అధికార పార్టీ సానుభూతిపరులకు పంపిణీ చేసి మిగిలిన నిల్వలను దొడ్డి దారిన ప్రైవేటు డీలర్లుకు తరలిస్తున్నారు. యూరియా దారి మళ్లుతున్నట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వ్యాఖ్యానించడం గమనార్హం. సారా, బీర్ తయారీతోపాటు పెయింట్లు, వార్నిష్, ప్లైవుడ్, యాడ్ – బ్లూ ద్రావణం, పశువుల దాణా, కోళ్లు, ఆక్వా మేత, కల్తీ పాల తయారీలో యూరియాను విచ్చలవిడిగా వాడుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీకి కేటాయించిన నిల్వలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్న ఆరోపణలున్నాయి.
2019కి ముందు దుస్థితి పునరావృతం..!
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను కూటమి సర్కారు నిర్విర్యం చేయడంతోపాటు ఎరువుల సరఫరాలో ముందుచూపు లేకపోవడంతో 2019కి ముందు పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీజన్‌లో కనీసం నాలుగైదు సార్లు తిరిగితే కానీ రైతన్నలకు ఎరువు కట్ట దొరికేది కాదు.
మండల స్థాయిలో పంపిణీ వల్ల రవాణా చార్జీలు తడిసి మోపెడయ్యేవి. వ్యయ ప్రయాసలతోపాటు లోడింగ్, అన్‌లోడింగ్ భారాన్ని భరించాల్సి వచ్చేది. అదనంగా చెల్లిస్తేగానీ కోరిన ఎరువులను డీలర్లు ఇచ్చేవారు కాదు. పైగా అవసరం లేని పురుగు మందులను బలవంతంగా అంటగట్టేవారు. ఎక్కడకెళ్లినా ఎరువుల కోసం చెప్పుల క్యూ లైన్లు కనిపించేవి. ఎండలో నిలబడలేక స్పృహ తప్పి పడిపోవడం, వడగాడ్పుల బారినపడి మత్యువాత పడిన ఘటనలూ చోటు చేసుకున్నాయి.
ఐదేళ్లూ గ్రామంలోనే కోరినన్ని..
వైఎస్సార్ సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఎరువుల సరఫరా చేపట్టడంతో అన్నదాతలు నిశ్చింతగా సాగు పనుల్లో నిమగ్నమయ్యేవారు. ఏనాడూ ఎరువు కట్టల కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు. విత్తనం నుంచి విక్రయం దాకా ఊరు దాటాల్సిన అవసరం లేకుండా రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఐదేళ్లలో రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్ రూపంలో రూ.100 కోట్లకు పైగా రైతులకు ఆదా అయ్యింది. అలాంటిది గడిచిన ఏడాదిగా రైతులు ఎరువుల కోసం నరక యాతన పడుతున్నారు.
కట్ట కూడా ఇవ్వలేదు..
రెండెకరాలు కౌలుకు తీసుకొని ఖరీఫ్‌లో వరి సాగు చేశా. ప్రస్తుతం మొల క దశలో ఉంది. ఎన్నిసార్లు తిరిగినా కట్ట యూరియా కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. –యార్లగడ్డ భార్గవ సాయి, ఎస్వీపల్లి, కృష్ణా జిల్లా
సాగు ఎలా చేయాలి?
సొంత భూమితో కలిపి 20 ఎకరాల వరకు కౌలుకు చేస్తున్నా. ప్రస్తుతం నాకు పది కట్టలు కావాలి. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఐదు కట్టలు ఇచ్చారు. ఇలా అయితే సాగు ఎలా? –కట్టా వాకలయ్య, లంకల కలవ గుంట, కృష్ణా జిల్లా
రోడ్కెక్కిన రైతన్నలు..
యూరియా కోసం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కవుతరం పీఏసీఎస్ వద్ద యూరియా కోసం నిరసనకు దిగారు. పెడన మండలం పెనుమల్లి, మచిలీపట్నం మండలం బుద్దాలపాలెం సొసైటీల పరిధిలో కూడా ఇదే రీతిలో ఆందోళన నిర్వహించారు. ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్లతో పాటు పలు జిల్లాల్లో సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీస్ పహారాతో ఎరువులు పంపిణీ చేయాల్సి రావడం కూటమి సర్కారు అసమర్థతకు నిదర్శనం.