ఉండవల్లిలో సమావేశమైన రైతులు
రైతు హక్కులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా హరిస్తోంది
అధికారులతో జరిగిన సమావేశాల్లోనూ భరోసా లభించట్లేదు
తాడేపల్లి రూరల్: డిమాండ్లు పరిష్కరించకుండానే రాజధానికి భూములు సేకరించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమ హక్కులను పూర్తిగా హరిస్తోందని భావిస్తున్న రైతులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రాజకీయ, న్యాయ పోరాటాలు తప్పనిసరని భావిస్తున్నారు. రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో రైతులందరూ ఆదివారం రాత్రి తాజాగా సమావేశమయ్యారు. అధికారులతో జరిగిన సమావేశాల్లో భరోసా లభించట్లేదని ఆవేదన వెలిబుచ్చారు.
గ్రామ సభల్లో పాల్గొని తమ సమస్యలు విన్నవించుకుని అటు తర్వాత బాయ్‌కాట్ చేయాలని పలువురు రైతులు పిలుపునిచ్చారు. రైతులను బెదిరించడానికి కేసులు పెడతారని, ఆస్తులు ధ్వంసం చేస్తారని, అన్నింటికీ సంసిద్ధంగా ఉండాలని కూడా రైతులు నిర్ణయించుకున్నారు. ప్రముఖ వైద్యులు కన్నారావు నాయుడు, రైతు సంఘం నాయకులు ఈశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కళ్లం సంజీవరెడ్డి తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు..
తీవ్ర నిరసనకు సంసిద్ధం
గ్రామసభ నిర్వహించేందుకు 15 రోజుల ముందే ప్రతి ఒక్క రైతుకు నోటీసు అందజేయాలి. 29వ తేదీ గ్రామసభ అని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికీ అధికారికంగా నోటీస్ ఇవ్వలేదు. ఉండవల్లిలో 1,100 ఎకరాలు ఉంటే అందులో బడా బాబులు, వ్యాపార వేత్తలు 230 ఎకరాలు మాత్రమే ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చారు. 870 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఆ భూములకు భూసేకరణకు నోటీసులు ఇచ్చారు. అధికారులు ఉండవల్లిలో అంగుళం భూమి కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 870 ఎకరాల్లో సుమారు 1,500 మంది రైతులు ఉన్నారు. గ్రామ సభకు ప్రతి కుటుంబం నుంచి అందరూ వస్తే వేలాదిమంది అవుతారు. తద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తీవ్ర నిరసన తెలియజేయాలి.
విభజించి.. పాలించు
చంద్రబాబు సర్కార్ వైఖరిపై ధ్వజం
ఉండవల్లిలో వెయ్యిమంది రైతులకు దేవాలయ భూముల్లో ప్లాట్లు కేటాయిస్తామని కొంతమంది రైతులను మభ్యపెడుతున్నారు. అక్కడ ఉన్నది 200 ప్లాట్లు అయితే వెయ్యిమందికి ఎలా ఇస్తారో రైతులు ఆలోచించుకోవాలి. విభజించి పాలించాలనే సిద్ధాంతాన్ని రాజధాని రైతులకు వర్తింపజేయాలని ప్రభుత్వం, కొంతమంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని మనం తిప్పి కొట్టాలి. ఉండవల్లిలో అధికారిక రిజి్రస్టేషన్ వ్యాల్యూ ప్రకారం చూసినా ఎకరం రూ.5 కోట్లకు క్రయ విక్రయాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక గ్రామంలో ఎక్కువగా ఎంత మొత్తంలో రిజి్రస్టేషన్ జరిగితే దాని ప్రకారం అవార్డు ప్రకటించాల్సి ఉంది.
ఈ లెక్కన ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు వెళినా, రైతులకు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా న్యాయం జరగాలి. రాజధాని ప్రాంతంలోని ఒక గ్రామంలో రైతులకు 2018లో ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఆ రైతులకు మొత్తం రూ.9 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. భూములు ఇచ్చిన రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఇది అద్దం పడుతోంది.
గూగుల్ మ్యాప్‌లో ప్లాట్లు చూపిస్తున్నారు
ఇటీవల ఒక గ్రామంలో జరిగిన సభలో గూగుల్ మ్యాప్‌లో ప్లాట్లు చూపించారు. ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో రైతులకు ఎలా తెలుస్తుంది? తమకు ప్లాట్లు కేటాయించడంలో, అభివృద్ధి చేయడంలో ఎటువంటి న్యాయం జరగలేదంటూ సీఆర్‌డీఏ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్లాట్ల పత్రాలతో బ్యాంకు లోన్‌కు వెళితే బ్యాంకు అధికారులు తిరస్కరిస్తున్నారు. వ్యవసాయం లేక, ఇచ్చే అరకొర కౌలు చాలక, పిల్లల చదువులు, పెళ్లిళ్లు వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికే బడా సంస్థలకు భూములు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎందుకు ప్లాట్లు కేటాయించడం లేదని ప్రశి్నంచడంతో అధికారులు మధ్యలోనే సమావేశం ముగించి వెళ్లిపోయిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
కొన్ని గ్రామాల్లో సభలను వాయిదా వేస్తున్నారు. సీఆర్‌డీఏ కమిషనర్ ఉండవల్లి భూములు గతంలోనే చాలా విలువైనవి అంటూ మాట్లాడుతూనే ప్రతి అంగుళం భూమిని భూ సేకరణ కింద తీసుకుంటామని చెబుతున్నారు. అధికారులు నామమాత్రంగా సమావేశాలు నిర్వహించి మినిట్స్‌బుక్‌లో రాసుకుంటున్నారు తప్ప.. రైతులకు ఎటువంటి ప్రయోజనాలు లభించడం లేదు.
ఈ సమావేశంలో మున్నంగి వీరశ్రీధర్‌రెడ్డి, మున్నంగి అంజిరెడ్డి, దండమూడి సాంబశివరావు, గోపాలం ప్రభాకరరావు, దంటు బాలాజీ, దాసరి నాగేశ్వరరావు, ఆళ్ళ వాసు, గాదె నాగరాజు, బుర్రముక్కు పద్మారెడ్డి, కోటేశ్వరరావు, అశోక్‌రెడ్డి, సందు చినబసవయ్య, సింగంశెట్టి మనోహర్, గోపాలం ప్రభాకర్, ఉండవల్లి అశ్వని, కొప్పోలు శంకరరావు, తమ్మా శ్రీనివాస్‌రెడ్డి, జొన్న శ్రీను, గోపాలం వాసు, మోదుగుల శ్రీను, జొన్న శివశంకర్, పాల కోటేశ్వరరావు, పెద్దిశెట్టి వీరాస్వామి, గుంటక నరేష్‌రెడ్డి తదితర రైతులు, నేతలు పాల్గొన్నారు.


