సొంత రెవెన్యూను మించి వేతనాలు, పెన్షన్ల వ్యయం

Expenditure of wages and pensions beyond own revenue - Sakshi

2019–20లో ఏకంగా 100.6 శాతం వ్యయం

టీడీపీ హయాంలో జీఎస్‌డీపీలో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల శాతం తగ్గుదల

విభజన నష్టాలతోపాటు కోవిడ్‌తో ఆర్ధిక ఇబ్బందులు

సంక్షేమం, అభివృద్ధి సమతుల్యతగా వేతన సవరణ సిఫారసులు

అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికలో వెల్లడి 

సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడులను మించి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని 11వ వేతన సవరణ నివేదికలో కమిషన్‌ చైర్మన్‌ అశుతోష్‌ మిశ్రా స్పష్టం చేశారు. 2019–20లో రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడులను మించి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు 100.6 శాతం వ్యయం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. టీడీపీ సర్కారు హయాంలో కన్నా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల వేతనాలు పెరిగాయని వెల్లడించారు. గత సర్కారు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు చెల్లించే శాతం తక్కువగా ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగిందని నివేదికలో విశ్లేషించారు. ఉద్యోగుల పదకొండవ పీఆర్సీకి సంబంధించిన అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం శనివారం విడుదల చేయడం తెలిసిందే. 

సమతుల్యత దిశగా..
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధికంగా నష్టపోగా కోవిడ్‌ కారణంగా రాష్ట్ర రాబడులు గణనీయంగా తగ్గిపోయాయని, ఇదే సమయంలో మహమ్మారి కట్టడికి వైద్య సదుపాయాల కోసం భారీగా వ్యయం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని నివేదికలో పేర్కొన్నారు. విభజన పరిణామాలు, పెండింగ్‌ బకాయిలు భారీగా చెల్లించాల్సి రావడం, కోవిడ్‌ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఒత్తిడికి లోనవుతోందని తెలిపారు. పేదలను ఆదుకునేందుకు సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆర్ధిక వనరులను వెచ్చించాల్సి ఉన్నందున రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ సమతుల్యత సాధించే దిశగా వేతన సవరణ సిఫార్సులు చేసినట్లు నివేదికలో వెల్లడించారు.

పీఆర్సీపై అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక విడుదల
ఉద్యోగుల పదకొండవ పీఆర్సీకి సంబంధించిన అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సందర్భంగా కమిటీ నివేదికపై ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం నివేదికను సీఎఫ్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top