చేనేతలకు కరెంట్ షాక్‌ | Electricity Utilities Fail to Take Readings from Handloom Workers Power Connections | Sakshi
Sakshi News home page

చేనేతలకు కరెంట్ షాక్‌

May 9 2026 5:25 AM | Updated on May 9 2026 5:25 AM

Electricity Utilities Fail to Take Readings from Handloom Workers Power Connections

చేనేత కార్మీకుల విద్యుత్‌ సర్వీసుల నుంచి రీడింగ్‌ తీయని విద్యుత్‌ సంస్థలు 

ప్రతి నెలా ఒకటి, రెండు తేదీల్లోనే ఇవ్వాల్సిన బిల్లులు ఇంత వరకూ అందివ్వని వైనం  

ఆలస్యంగా రీడింగ్‌ నమోదు చేస్తే అప్పటికి వినియోగించిన విద్యుత్‌ ఆధారంగా పెరగనున్న యూనిట్లు  

ఫలితంగా 200 యూనిట్లు దాటిపోయి పథకానికి అనర్హులుగా మారనున్న చేనేతలు 

మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితమంటున్న ప్రభుత్వం 

1,04,488 చేనేత కుటుంబాల కోసం ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు చేస్తామని గొప్పలు 

ఆలస్యంగా రీడింగ్‌ తీసి... అనర్హులను చేసేందుకు ప్రభుత్వం కుట్రలు

సాక్షి, అమరావతి: వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు... చేనేతలకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెబుతున్న దానికీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పొంతన కుదరడం లేదు. ఆయన చెప్పిన దానికి... చేసే దానికి సంబంధం ఉండదనేది ఇప్పటికే అనేక అంశాల్లో రుజువు కావడమే ఇందుకు కారణం. కనీసం ఇప్పుడైనా ఇచ్చిన మాటను సక్రమంగా అమలు చేస్తారేమోనని అనుకుంటే ఎప్పటిలాగే వెన్నుపోటు ప్లాన్‌ వేసుకున్నాకే పథకం అమలు ప్రకటన చేశారనే సందేహం కలుగుతోంది. ఆదిలోనే హంసపాదు అన్నట్లు పథకం అమలులో కుట్ర దాగుందని... అర్హులను తగ్గించే ప్రక్రియ మొదలైందనే అనుమానాలు కలుగుతున్నాయి. మగ్గాల నిర్వహణ, అల్లిక, డైయింగ్‌ వంటి పనుల కోసం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు వెన్నుదన్నుగా నిలుస్తుందనుకున్న నేతన్నలకు చివరికి వెన్నుపోటే మిగులుతోంది.  

గొప్పలు సరే.. చిత్తశుద్ధి ఏదీ
చేనేతలకు ‘పవర్‌’ గిఫ్ట్‌ అంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు వరకూ విద్యుత్‌ ఉచితంగా ఇస్తామంటూ ప్రభుత్వం ఏప్రిల్‌ 1న ప్రకటించింది. తద్వారా 1,04,488 చేనేత కుటుంబాల కోసం ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు చేస్తామని గొప్పలు చెప్పుకుంది. ఒక్కో చేనేత కార్మీకుని కుటుంబానికి ఏటా రూ.8,640, పవర్‌ లూమ్‌ యూనిట్లకు ఏడాదికి రూ.21,600 వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందంటూ లెక్కలు వేసింది.

ఉచిత విద్యుత్‌ పథకం అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 93,000 మగ్గాలున్న కుటుంబాలు, 11,488 పవర్‌ లూమ్‌ కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతామని సంబరపడ్డాయి. చంద్రబాబు చెప్పిందంతా నిజమని కాసేపు భ్రమించారు. కానీ ఇంతలోనే ఇదంతా కేవలం ప్రచార ఆర్భాటమేనని తేలిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పుకోవడానికి మినహా నిజంగా చేనేతలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదని తేలిపోయింది.  

ఆలస్యం చేసి... అనర్హులుగా మార్చాలనే కుట్ర..! 
విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతి నెలా 1, 2 తేదీల్లోనే విద్యుత్‌ మీటర్ల నుంచి రీడింగ్‌ నమోదు చేసి, వినియోగం ఆధారంగా బిల్లులు ఇస్తుంటాయి. కానీ  ఈ నెలలో మాత్రం అలా జరగలేదు. ముఖ్యంగా అనేక చోట్ల చేనేత సర్వీసులకు రీడింగ్‌ తీయనేలేదు. ఈ నెలలో అప్పుడే 8వ తేదీ కూడా దాటిపోయింది. ఏ రోజుకారోజు విద్యుత్‌ వినియోగం యూనిట్లు పెరిగిపోతుంటాయి. మీటర్‌ రీడింగ్‌ తీయడంలో వారానికిపైగా ఆలస్యం కావడం వల్ల స్లాబులు కూడా మారిపోతాయి. ప్రధానంగా 200 యూనిట్ల లోపు వారికే పథకం వర్తిస్తుందంటున్నారు.

కానీ రీడింగ్‌ ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు ఆ పరిమితి ఉండదు. అంటే 200 యూనిట్లకు పైగా రీడింగ్‌ నమోదవుతుంది. ఆ సర్వీసులు ఆటోమేటిక్‌గా ఉచిత విద్యుత్‌ పథకానికి అనర్హత జాబితాలోకి చేరిపోతాయి. దీంతో ఈ నెల కూడా చేనేతలు విద్యుత్‌ బిల్లులు పూర్తిగా చెల్లించాల్సి వస్తుంది. ఓ వైపు ఉచిత విద్యుత్‌ ఇస్తామంటూనే ఇలా రీడింగ్‌ ఆలస్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆలస్యంగా రీడింగ్‌ తీసి, బిల్లు కట్టాలని చెబితే చేనేత విద్యుత్‌ వినియోగదారులు తమపై దాడి చేస్తారేమోననే ఆందోళన మీటర్‌ స్పాట్‌ బిల్లింగ్‌ రీడర్ల నుంచి వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement