Fact Check: దగాకోరు.. దబాయింపు! | FactCheck: Eenadu Ramojirao Fake News On Grain Purchases In Andhra Pradesh, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: దగాకోరు.. దబాయింపు!

Published Mon, Aug 28 2023 2:34 AM

Eenadu Ramojirao Fake News On Grain Purchases Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ►కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకన్నా రైతులకు మార్కెట్లోనే అధిక ధరలు లభిస్తున్నప్పుడు ఎవరైనా ఎమ్మెస్పీకి అమ్ముకుంటారా? లేక అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తారా? మరి మన రాష్ట్ర రైతులు బహిరంగ మార్కెట్‌లో మంచి ధరలకు అమ్ముకుంటే ఇందులో తప్పు ఏమైనా ఉందా?  
►కనీస మద్దతు ధర కన్నా అధిక రేట్లకు రైతులు పంట అమ్ముకుంటే ఆ రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నట్లా లేక  బాగోలేనట్లా?  
►మన దగ్గర పండే ధాన్యానికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ధాన్యం దిగుబడుల్లో 60 శాతానికి పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుండగా మిగతాది సొంత అవసరాలు పోనూ బయట మంచి ధరకు రైతులు విక్రయిస్తున్నారు. ఎక్కడ విక్రయిస్తేనేం? అన్నదాతకు మంది ధర దక్కితే సంతోషించాలి కదా?  

గతంలో ఏ గ్రేడ్, సాధారణ రకాలుగా విభజించి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగేది. ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం రంగుమారినా, తడిచినా వెరైటీల ప్రకారం గ్రేడెడ్‌ ఎంఎస్‌పీ చెల్లిస్తూ రైతులను ఆదుకుంటోంది. రైతుల సంఖ్య చూసినా, కొనుగోలు చేసిన ధాన్యం లెక్కలు గమనించినా ఇప్పుడెంతో మెరుగ్గా ఉంది.

చంద్రబాబు హయాంతో పోలిస్తే ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించిన రైతుల సంఖ్య రెట్టింపైందని చిన్న పిల్లాడైనా చెబుతాడు. ఇదంతా దగాకోరులకు రుచించడం లేదు. రైతులంటే గిట్టని చంద్రబాబు పాలనతో బేరీజు వేస్తే తమకు పుట్టగతులుండవనే భయంతో పక్క రాష్ట్రంతో పోలుస్తూ పొంతన లేని రాతలతో విషం చిమ్ముతున్నారు. ఇందులో భాగంగా ‘ధాన్యం రైతుకు దగా’ అంటూ వక్రీకరణలతో ఈనాడులో అవాస్తవాలను వడ్డించారు.  

ఒక్కో రైతు 34.42 టన్నులు విక్రయించారా? 
టీడీపీ హయాంలో ధాన్యం సేకరణ దళారుల దందాగా సాగింది. 2014–15లో గత ప్రభుత్వం రెండు సీజన్లలో (ఖరీఫ్, రబీ) 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. రూ.5,583 కోట్లు చెల్లింపులు చేసింది. అంటే సగటున ఒక్కో రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు. ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం సాధ్యమేనా? అంటే రైతుల పేరిట దళారులు  గత ప్రభుత్వానికి ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర కొట్టేశారన్నది సుస్పష్టం.

2015–16లోనూ ఇదే సీన్‌ రిపీట్‌.ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత పటిష్టంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. 2022–23లో ఒక్క ఖరీఫ్‌ సీజన్‌లోనే మొత్తం 6.39 లక్షల మంది రైతుల వద్ద నుంచి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించారు.  

దిగుబడిలో 60 శాతం కొనుగోలు 
తెలంగాణలో అత్యధికంగా ఎంటీయూ 1010, 1001 రకం ధాన్యాన్ని సాగు చేస్తారు. వాటికి బహిరంగ మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్‌ ఉంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి.

మిగిలిన రకాల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో 60 శాతానికి పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. గత రబీలో తొలిసారిగా ఐదు లక్షల టన్నుల జయ రకం (బొండాలు) ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఫలితంగా దొడ్డు బియ్యానికి మార్కెట్‌లో రేటు పెరిగింది. వ్యాపారులు పొలాల్లోనే ఎగబడి కొనడంతో రైతులకు మేలు జరిగింది.   

రైతుల సంఖ్య రెట్టింపు 
టీడీపీ హయాంలో ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్లు విలువైన 2,65,10,747 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే 32.78 లక్షల మంది రైతుల నుంచి రూ.58,766 కోట్లు విలువైన 3.10 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరి ఎవరి హయాంలో రైతులకు అన్యాయం చేశారో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఇక గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లు అంటే రైతులకు నరక యాతనే. కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదో గుర్తించేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సిందే.

సరైన యంత్రాలు లేక నాణ్యత నిర్ధారణలోనూ రైతులు మోసపోయేవారు. ఇప్పుడు ఆర్బీకేల రాకతో రైతు దగ్గరకే టెక్నికల్‌ అసిస్టెంట్‌ వచ్చి ధాన్యం శాంపిళ్లు తీసుకుంటున్నారు. రైతు ఎదురుగానే వివరాలు నమోదు చేసి రశీదు ఇస్తున్నారు. గతంలో ఎక్కడో మండల కేంద్రాల్లో అరకొర వసతుల్లో ధాన్యం కొనుగోళ్లు జరిగేవి. ఇప్పుడు రైతు ఊరిలోనే.. ఆర్బీకే పరిధిలో.. పొలం గట్టు వద్దే ధాన్యాన్ని కొని మిల్లుకు తరలిస్తున్నారు.    

రూ.960 కోట్లు బకాయి పెట్టిన బాబు 
చంద్రబాబు హయాంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చేది. టీడీపీ సర్కారు దిగిపోతూ అన్నదాతలకు రూ.960 కోట్లు ధాన్యం బకాయిలు పెట్టింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా మద్దతు ధరను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత రబీ సీజన్‌లో రూ.2,884 కోట్లకుగాను రూ.2,595 కోట్లను నిర్ణీత గడువులోగా 90 శాతం చెల్లించేశారు.

మిగిలిన చిన్న మొత్తాల చెల్లింపుల్లో జాప్యానికి కారణం రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం ఆలస్యంగా జరగడమే. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు ప్రతి జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తూ ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తోంది. 

జీఎల్‌టీ కింద రైతన్నకు టన్నుకు రూ.2,523 
గతంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం లోడు తరలించాలంటే రైతులపై ఆర్ధిక భారం పడేది. ధాన్యం సొమ్ములు నెలల తరబడి అందకపోవడంతో బయట అప్పులు చేయాల్సి వచ్చేది. గోనె సంచుల సేకరణను గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. ఇప్పుడు పౌరసరఫరాల సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే గోనె సంచులను సమకూరుస్తున్నాయి. ధాన్యం లోడును ప్రభుత్వమే ఎగుమతి చేస్తూ మిల్లులకు తరలిస్తోంది.


ఒకవేళ రైతుకు సొంత వాహనం ఉండి సంచులు, హమాలీలను సమకూర్చుకుంటే ఆ ఖర్చులను కూడా మద్దతు ధరతో కలిపి నిర్ణీత 21 రోజుల కంటే ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా క్వింటాల్‌కు అదనంగా రూ.252 రైతులకు లభిస్తోంది. టన్ను గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలీ రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్‌టీ కింద టన్నుకు రూ.2,523 ప్రభుత్వం అందిస్తోంది. ఇది ఆయా రాష్ట్రాల్లో ఇచ్చే బోనస్‌తో పోలిస్తే అధికంగా ఉండటం విశేషం.   

Advertisement
 
Advertisement