విలీనంపై ‘ఎస్‌’ అనాల్సిందే! | Education officials are putting pressure on teachers | Sakshi
Sakshi News home page

విలీనంపై ‘ఎస్‌’ అనాల్సిందే!

Published Mon, Mar 10 2025 5:35 AM | Last Updated on Mon, Mar 10 2025 6:01 AM

Education officials are putting pressure on teachers

ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్న విద్యాశాఖ అధికారులు

స్కూల్‌ కమిటీలు ‘నో’ చెప్పినా అంగీకార పత్రాలు ఇవ్వాల్సిందే

పాఠశాలలు, తరగతుల విలీన ప్రక్రియను వేగవంతం చేసిన వైనం

అంగీకరించకుంటే  హెచ్‌ఎంలపై చర్యలు తప్పవని హుకుం

సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల మూసివేత వైపే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎంతో శ్రమకోర్చి తెచ్చుకున్న బడులను సర్కారు విలీనం వైపు నడిపిస్తోంది. ఇందుకు గ్రామస్తులు అంగీకరించకపోయినా.. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు ‘నో’ అని చెప్పినా ‘ఎస్‌’ అనిపించాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకమోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ఏర్పాటులో భాగంగా తక్కువ ఎన్‌రోల్‌ ఉన్న బడుల్లోని విద్యార్థులను ఒక్కచోటకు చేర్చే ప్రక్రియ చేపట్టారు. 

ఈ క్రమంలో దూరం వెళుతున్న విద్యార్థులకు రవాణా చార్జీలను ఇస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. గత ప్రభుత్వం జీవో నం.117 తీసుకొచ్చి పాఠశాలలను విచ్ఛిన్నం చేసిందని ఓపక్క విషం చిమ్ముతూనే.. మరోపక్క ఉన్న బడులను మూసివేసే ప్రక్రియ ప్రారంభించింది. మండల స్థాయిలో ఎంఈవోలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు విలీన ప్రక్రియను వివరించి ఒప్పించాలని, మండలంలోని ఏ క్లస్టర్‌లో ఏ పాఠశాలను ఎలా మార్పు చేశారో చెప్పాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. 

ముఖ్యంగా ఎంఈవోలు కాంప్లెక్స్‌ చైర్మన్లతో సమన్వయం చేసుకుంటూ క్లస్టర్‌లో ఉన్న ప్రధానోపాధ్యాయులతో కలిసి ఆ గ్రామంలోని పాఠశాలలను ఎలా మార్పు చేస్తున్నారో సంబంధిత గ్రామ పెద్దలు, స్కూల్‌ మెనేజ్‌మెంట్‌ కమిటీలకు తెలియజేయాలని ఆదేశించారు. ఆయా పాఠశాలలను ఫౌండేషన్‌ స్కూల్‌గా మార్చారా? బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌గా మార్చారా? లేదా మోడల్‌ ప్రైమరీ స్కూల్‌గా మార్చారా? అనేది వారికి వివరించి వారి నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే, ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ‘నో’ అని చెప్పకుండా చూడాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 

గ్రామాల సెంటిమెంట్‌పై కన్నెర్ర 
గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల, గుడి అనేవి స్థానికుల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశాలు. వీటిని మూసివేసేందుకు, తరలించేందుకు స్థానికులు అంగీకరించరు. అయినప్పటికీ స్థానికుల అంగీకారంతో పనిలేకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురంలో ఉన్న బాబు జగ్జీవన్‌రామ్‌ ఎంపీపీ స్కూల్‌ను విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం మూసివేసింది.

స్థానికులు ఎంతగా ప్రాథేయపడినా పట్టించుకోలేదు. పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని గత వైఎస్సాÆŠ­సీపీ ప్రభుత్వంలో గ్రామస్తులు విజ్ఞప్తి చేయగా తిరిగి తెరిపించారు. ఇప్పుడు ఈ పాఠశాలలోని విద్యార్థులను మరో బడిలో విలీనం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇలాంటి పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా 12 వేల వరకు ఉన్నట్టు అంచనా. గత ప్రభుత్వంలో జీవో నం.117 ద్వారా హైసూ్కళ్లకు కిలోమీటరు లోపు దూరం ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతుల విద్యార్థులు సబ్జెక్టు టీచర్‌ బోధన కోసం హైస్కూళ్లలో విలీనం చేశారు. 

మిగిలిన తరగతులను అదే ప్రాథమిక పాఠశాలలో కొనసాగించారు. ప్రస్తుతం 65 మంది ఎన్‌రోల్‌ ఉన్న పాఠశాలలను మోడల్‌ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తామని, అంతమంది విద్యార్థులు లేకుంటే సమీపంలోని ఇతర ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులను తరలించాలని ఎంఈవోలకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 3–5 కి.మీ. పైగా దూరం వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు మండిపడుతున్నారు. 

విలీన ఒత్తిడి భరించలేమంటున్న ఉపాధ్యాయులు  
ఆదర్శ పాఠశాలల ఏర్పాటు క్రమంలో ఓ పాఠశాలను కేంద్రంగా చేసి చుట్టూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం, లేదా 3–5 తరగతులను తీసుకొచ్చి ఎంపిక చేసిన పాఠశాలలో కలపడాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తు­న్నారు. పైగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యతను అదే ఉపాధ్యాయులకు అప్పగించడం, కాదన్న వారిని ఉన్నతాధికారులు బెదిరించడం తట్టుకోలేక పోతున్నామని వాపో­తు­న్నారు. 

గత ప్రభుత్వంలో ప్రతి పాఠశాల­లో మన బడి నాడు–నేడు పథకం కింద రూ.లక్షలు ఖర్చు చేసి సదుపాయాలు కల్పిస్తే వాటిని వినియోగించుకోకుండా విలీ­నం ఏమి­టని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రభు­త్వం పెట్టిన ఖర్చు వృథా అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ప్రక్రియ పూర్తయితే రెండేళ్లలోనే ప్రాథమిక పాఠశాలలు శాశ్వతంగా కనుమరుగవుతాయని.. ఇదంతా  ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించేందుకే అన్న­ట్లు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులు 40 లేదా 45 మంది పైగా ఎన్‌రోల్‌ ఉన్న స్కూళ్లను మోడల్‌ స్కూళ్లుగా మార్చి, మిగిలిన పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement