బదిలీలు సరే.. జీతాలేవి? | 60000 teachers will not receive their July salaries | Sakshi
Sakshi News home page

బదిలీలు సరే.. జీతాలేవి?

Jul 28 2025 5:56 AM | Updated on Jul 28 2025 5:58 AM

60000 teachers will not receive their July salaries

60 వేల మంది టీచర్లకు జూలై వేతనాలు అందవు 

జూన్‌ నెల వేతనాలూ ఇవ్వలేదు

ఇటీవల 67 వేల మందికి స్థాన చలనం 

బదిలీ చేసి 2 నెలలుగా ఐడీలు ఇవ్వని విద్యా శాఖ.. మంత్రి మండలి అనుమతి లేకుండానే 20 వేల పోస్టుల కన్వర్షన్, రేషనలైజేషన్‌  

ఇటీవలి కేబినెట్‌ సమావేశంలోను చర్చించని వైనం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బదిలీ అయిన ఉపాధ్యాయులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. దాదాపు 60 వేలమంది ఉపాధ్యాయులకు జూన్‌ నెల వేతనాలు అందలేదు. వీరికి జూలై నెల వేతనాలు కూడా అందే పరిస్థితి కనిపించడంలేదు. జూలై నెల వేతనాల బిల్లుల సమర్పణకు గడువు ముగిసినా అవి ట్రెజరీలకు వెళ్లలేదు. దీంతో ఆగస్టులో కూడా వీరికి వేతనాలు అందే అవకాశాలు లేవు. గతనెలలో చేపట్టిన సాధారణ బదిలీల్లో 67 వేల మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పించారు. 

కొందరు స్కూల్‌ అసిస్టెంట్లను మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల హెచ్‌ఎంలుగాను, కొందరు ఎస్జీటీలకు పదోన్నతులిచ్చి హెచ్‌ఎంలుగాను పంపించింది. చాలామంది ఉపాధ్యాయులను క్లస్టర్‌ పూల్, డీఈవో పూల్, కమిషనర్‌ పూల్‌లో ఉంచింది. మే 31 నాటికి హెచ్‌ఎంల బదిలీలు పూర్తయ్యాయి. స్కూల్‌ అసిస్టెంట్, సమాన కేడర్‌ బదిలీలు జూన్‌ 9కి, ఎస్జీటీల బదిలీ జూన్‌ 14కు ముగిశాయి. మరుసటి రోజుకి అందరూ కొత్త పాఠశాలల్లో చేరిపోయారు. కొందరు ఉన్న కేడర్‌లోనే స్థానికంగా మారడంతో వారికి వేతనాలు అందాయి. 

కానీ పోస్టుతోసహా స్థానచలనం కలిగిన 60 వేలమంది ఉపాధ్యాయులకు జూన్‌ నెల వేతనాలు జమ కాలేదు. కనీసం జూలైలోనైనా సప్లిమెంటరీ బిల్లు ద్వారా వేతనాలిస్తారనుకున్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. పోనీ జూన్, జూలై నెలల వేతనాలు ఆగస్టులోనైనా వస్తాయనుకుంటే ప్రభుత్వం ఉపాధ్యాయులకు నిరాశనే మిగిల్చింది. ఆన్‌లైన్‌ బిల్లుల సమర్పణ తేదీ ముగియడంతో జూలై నెల వేతనాలు వచ్చేనెలలో రావని తేలిపోయింది.

రెండునెలల వేతనాలు అందే పరిస్థితి లేకపోవడంతో ఉపాధ్యాయులకు దిక్కుతోచడంలేదు. ప్రతినెలా తప్పనిసరిగా చెల్లించాల్సిన ఈఎంఐలు, ఇతర ఖర్చులను ఒకనెల ఏదోలా సర్దుకున్నారు. ఇప్పుడు వచ్చే నెలలో పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.  

పోస్టులు లేకుండానే పోస్టింగులు ఇచ్చేసి..  
ఉపాధ్యాయుల బదిలీల్లో ఈసారి కొత్త కేడర్‌ను సృష్టించారు. మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ పేరుతో కొత్తగా 9,600 స్కూళ్లను ఏర్పాటు చేశారు. వాటిలో ఎంపీఎస్‌ హెచ్‌ఎం పోస్టులను సృష్టించి స్కూల్‌ అసిస్టెంట్లను ఇందులో నియమించారు. దీంతోపాటు సుమారు 20 వేలమంది మిగులు ఉపాధ్యాయులను వివిధ రకాల ‘పూల్స్‌’లో సర్దుబాటు చేశారు. వాస్తవానికి కొత్త పోస్టులు సృష్టించాలంటే మంత్రిమండలి ఆమోదం తప్పనిసరి. 

ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి నిర్ణయం తీసుకుని ఉత్తర్వులివ్వాలి. తర్వాత ఆర్థికశాఖ అనుమతి పొందాలి. కానీ ఇవేమీ చేయకుండానే ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన కేబినెట్‌ సమావేశంలో సైతం ఈ అంశంపై చర్చించలేదు. మరోపక్క మిగిలిన 40 వేల పోస్టులపై క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ను రాష్ట్ర విద్యాశాఖ సకాలంలో అప్‌డేట్‌ చేయలేదు. కేడర్‌ స్ట్రెంగ్త్‌ను అప్‌డేట్‌ చేసేందుకు అన్ని జిల్లాల నుంచి డైరెక్టరేట్‌కు డిప్యూటేషన్‌పై సిబ్బందిని నియమించుకున్నారు. 

జూన్‌ 28వ తేదీ వరకు ఈ పనులు చేస్తున్నట్టు ప్రకటించి, ట్రెజరీలకు పంపినా జీతాలు మాత్రం రాలేదు. ట్రెజరీ అధికారులు దీన్లో తప్పులున్నా­యని కొర్రీలు వేసి వెనక్కి పంపినట్టు తెలిసింది. పీఎస్‌ హెచ్‌ఎం/ఎస్‌ఏ, స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులను పీఎస్‌ హెచ్‌ఎంలుగా కన్వర్షన్‌ చేయాలన్నా, రేషనలైజేషన్‌ పోస్టులను ఒకచోటు నుంచి మరొక చోటికి బదలాయించాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మంత్రిమండలి నిర్ణయం తీసుకుని ఆర్థికశాఖ అనుమతితో ఉత్తర్వులు ఇచ్చాక పోస్టుల కన్వర్షన్, రేషనలైజేషన్‌ చేయాలి. 

కానీ, ఇవేమీ లేకుండానే ప్రక్రియను పూర్తిచేయడంతో ఇప్పుడు ఉపాధ్యాయులు ఇబ్బందుల్లో పడిపోయారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో చేరినా పాత పాఠశాలలో కొత్తవారు లేకపోవడంతో తిరిగి పాత పోస్టులోనే (డిప్యుటేషన్‌ మీద) పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఒక్క చిత్తూరు జిల్లాలో మాత్రమే వీరికి సప్లిమెంటరీ బిల్లుల ద్వారా జూన్‌ నెల వేతనాలు చెల్లించినట్టు చెబుతున్నారు. మిగిలిన 25 జిల్లాల్లోను ఉపాధ్యా­యులు వేతనాలందక ఇబ్బందులు పడుతున్నారు.  

అవాంతరాలు తొలగించాలి 
ఉపాధ్యాయుల క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ను అప్‌డేషన్‌కు ఉన్న అవాంతరాలను వెంటనే తొలగించాలి. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని బదిలీ అయిన ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించాలి. జూలై నెల వేతనాలు ఆగస్టు ఒకటో తేదీన జమగాకపోతే బ్యాంకు రుణాలు తీసుకున్న ఉపాధ్యాయులు డిఫాల్టర్లుగా మారిపోతారు. ఇప్పటికే ఒకనెల వేతనాలు అందకపోవడంతో నోటీసులు అందుతున్నాయి. పొజిషన్‌ ఐడీలు మంజూరు చేసి వేతన బిల్లులు సమర్పణ కోసం గడువును ఈ నెల చివరివరకు పెంచాలి.  – సి.వి.ప్రసాద్, ఏపీటీఎఫ్‌ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు  

కూటమి పాలనలో టీచర్లకు కష్టాలు 
ఉపాధ్యాయులు నచ్చిన చోటకు బదిలీ అయితే సంతోషిస్తారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో దారుణ పరిస్థితి ఏర్పడింది. గ్రీన్‌ పాస్పోర్ట్‌ మొక్కల రిజిస్ట్రేషన్, విట్నెస్‌ రిజిస్ట్రేషన్, పీ–4 రిజిస్ట్రేషన్ సాయంత్రంలోగా అయిపోవాలని ఆదేశించే అధికారులు.. జూన్‌లో చేసిన పోస్టుల రీఅపోర్షన్‌ ప్రక్రియ, పొజిషన్‌ ఐడీలు, క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ ప్రక్రియ పూర్తికావడానికి మాత్రం మూడునెలలు తీసుకోవడం ఏమిటి?      – వి.రెడ్డి శేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ట్రెజరర్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement