 
													ప్రకాశం బ్యారేజ్‌కు 5.67 లక్షల క్యూసెక్కులు
రెండో ప్రమాద హెచ్చరిక జారీ
పులిచింతల నుంచి హఠాత్తుగా 4.8 లక్షల క్యూసెక్కులు దిగువకు
కోతకు గురైన గిరిజన తండా రైతుల భూములు
ఆందోళనకు దిగిన గిరిజన రైతులు
నష్టం ఎవరు భరిస్తారని నిలదీత
గాందీనగర్ (విజయవాడసెంట్రల్)/తాడేపల్లి రూరల్/విజయపురిసౌత్/అచ్చంపేట: భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లోని మున్నేరు, కీసర, వైరా, కట్టలేరు ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గురువారం రాత్రి 7 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజ్ వద్దకు 5.67 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో రెండోప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా డెల్టాలో పంటలు దెబ్బతినడంతో డెల్టా కాలువలకు నీటి విడుదల నిలిపివేసి, వచ్చిన వరదను వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్ వద్ద నీటిమట్టం 14.6 అడుగులు ఉంది.
లీక్ అవుతున్న కొండవీటి వాగు గేట్లు.. 
అమరావతి కరకట్ట వెంబడి కృష్ణానదిని, కొండవీటి వాగును విడదీస్తూ ఏర్పాటు చేసిన గేట్ల నుంచి భారీగా నీరు లీక్ అయ్యి కొండవీటి వాగులోకి వస్తోంది. ఒక పక్క వాగుకు వచ్చే వరదను ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానదిలోకి విద్యుత్ మోటార్ల ద్వారా తరలిస్తుంటే.. మరో పక్క కృష్ణానదిలోకి వచ్చిన వరద ఇదే గేట్ల ద్వారా లీక్ అయ్యి మళ్లీ కొండవీటి వాగులోకి చేరుతోంది. 
మొత్తం 18 గేట్లు ఉండగా 15 గేట్ల నుంచి నీరు వాగులోకి చేరుతోంది. ఒకవేళ వాగులోనూ వరద ఉధృతి పెరిగి, ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరిగితే ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, యర్రబాలెం ప్రాంతాలకు ముప్పు తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగర్ నుంచి 4క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల.. 
మోంథా తుపాను ప్రభావంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో గురువారం నాలుగు క్రస్ట్‌గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 1,49,139 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడ నుంచి 66,139 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పులిచింతల నుంచి 4.8 లక్షల క్యూసెక్కులు విడుదల.. 
పులిచింతల ప్రాజెక్టు నుంచి గురువారం ఉదయం ఎలాంటి సమాచారం లేకుండా సుమారు ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో దిగువన ఉన్న గిరిజన తండాల రైతుల భూములు కోతకు గురై, పంటలు కొట్టుకుపోయాయి. 
జడపల్లి తండా, కంచుబోడు తండాలకు చెందిన మిర్చి రైతులు ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే పంట నష్టపరిహారం ఇవ్వాలని, కోతకు గురైన భూములను క్రమబద్దీకరించి తమ భూములను తమకు చూపాలంటూ నినాదాలు చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
