‘డీఎస్సీ డీల్స్‌’లో ప్రలోభాల పర్వం | DSC Sports Quota Jobs Scam In AP, Claims Of Irregularities And Political Pressure Surface, More Details Inside | Sakshi
Sakshi News home page

‘డీఎస్సీ డీల్స్‌’లో ప్రలోభాల పర్వం

Apr 30 2026 7:57 AM | Updated on Apr 30 2026 9:55 AM

DSC Sports Quota Jobs Scam In AP

ఉపాధ్యాయ ఉద్యోగాల అమ్మకంలో అడ్డంగా దొరికిన ప్రభుత్వం

దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు ‘మాస్టర్‌ మైండ్‌’ తంటాలు 

క్రీడా సంఘాలను ప్రలోభ పెట్టేందుకు విఫలయత్నం?

ప్రభుత్వం చెప్పినట్టు తలాడించలేమన్న క్రీడా సంఘాలు

మూడు రోజులైనా విచారణ ప్రాథమిక నివేదిక ఇవ్వని శాప్‌

సాక్షి, అమరావతి: డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా పోస్టుల కుంభకోణంలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాలు సాక్ష్యాలతో సహా బయటపడటంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత హేయంగా అంగడి సరుకులా డీఎస్సీ పోస్టులను సీఎం బంధువుగా చెప్పుకుంటూ అమ్మేసిన ‘మాస్టర్‌మైండ్‌’ మెడకు ఉచ్చు బిగుసుకోవడంతో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

మూడు రోజులకుపైగా విచారణ పేరుతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) కాలయాపన చేసి కనీసం ప్రాథమిక నివేదికను కూడా సిద్ధం చేయలేకపోయింది. బుధవారం రాష్ట్ర క్రీడా సంఘాలను శాప్‌ ఎంపికల్లో ఎక్కడా తప్పు జరగలేదని, క్రీడాకారులు తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందలేదని స్టేట్‌మెంట్లు ఇవ్వాలని ‘మాస్టర్‌మైండ్‌’ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే, అవినీతికి కొమ్ముకాసి అభాసుపాలు కాలేమని, ప్రభుత్వం చెప్పినట్టు తలాడించలేమని క్రీడా సంఘాల ప్రతినిధులు తెగేసి చెప్పినట్టు తెలిసింది. దీంతో శాప్‌ పరువు పోతోందని, కాపాడాలని క్రీడా సంఘాలను వేడుకోవడం గమనార్హం. విచారణ పేరుతో పిలిచిన క్రీడాకారులు ఇంకా అదే ఉద్యోగంలో కొనసాగుతుండటం కొసమెరుపు.  

మాస్టర్‌మైండ్‌ గేమ్‌లో చిక్కుకున్నశాప్‌ ఉన్నతాధికారులు 
డీఎస్సీ డీల్స్‌లో కీలకమైన ‘మాస్టర్‌ మైండ్‌’ గేమ్‌లో శాప్‌ ఉన్నతాధికారులు సైతం చిక్కుకుపోతున్నట్టు శాప్‌ వర్గాలే విమర్శిస్తున్నాయి. మరోవైపు ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్‌ ఎలా విచారణ చేస్తుంది? అందులో శాప్‌ అధికారులే కమిటీ సభ్యులుగా ఎలా ఉంటారు? ఈ ఒక్క విచారణతోనే నిజనిర్ధారణ చేసేస్తుందా? వాస్తవాలు బయటకు రావాలంటే కచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, రిటైర్డ్‌ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేస్తేనే ఇంటి దొంగలు బయటపడతారు’ అని క్రీడాకారులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, డీఎస్సీలో స్పార్ట్స్‌ కోటా ఉపాధ్యాయ పోస్టుల అమ్మకం ద్వారా మాస్టర్‌మైండ్‌ ఏకంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లను దండుకున్నట్టు ఆరోపణలు రావడంతో శాప్‌లో జరుగుతున్న మరిన్ని అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయి.  

ఉన్న పోస్టులు రద్దు.. ఉద్యోగాలు అడగొద్దు
చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఖాళీగా ఉన్న సర్కారు పోస్టులను భర్తీ చేయకపోగా.. మంజూరైన పోస్టులను రద్దు చేయడమే లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు సర్కారు అదే బాటలో పయనిస్తోంది. సమాచార శాఖలో రెండు అటెండర్‌ పోస్టులను రద్దుచేసి.. వాటి స్థానే ఒక చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పోస్టు భర్తీ చేసేందుకు అనుమతించింది. అంటే మంజూరైన నాలుగో తరగతి పోస్టుల్ని రద్దు చేసి నిరుద్యోగుల ఆశలకు గండికొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉండగా ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులన్నింటినీ రద్దు చేశారు. అవసరమైన చోట ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూడా 2014–19 మధ్య చంద్రబాబు సాధారణ పరిపాలన, పోలీసు శాఖలతోపాటు అనేక విభాగాల్లో మంజూరైన పోస్టులను రద్దు చేసి వాటి స్థానే ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో కొన్ని మాత్రమే భర్తీ చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా పాలనను కొనసాగిస్తున్నారు. సమాచార శాఖలో ఖాళీగా ఉన్న రెండు డార్క్‌ రూమ్‌ అటెండర్ల పోస్టులను రద్దు చేస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వాటిస్థానే రూ.44,570–1,27,480 వేతన స్కేలుతో ఒక చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పోస్టును మంజూరు చేశారు. ఇందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులనే రద్దు చేయడం అంటే శాశ్వతంగా ప్రభుత్వంలో నాలుగో తరగతి ఉద్యోగాలనేవి ఇక నిరుద్యోగులకు అందని ద్రాక్షగా మిగిలిపోనున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement