మహానుభావుల నగరం..ఎక్కడుందో తెలుసా? | Do you know where the city of greats is? | Sakshi
Sakshi News home page

మహానుభావుల నగరం..ఎక్కడుందో తెలుసా?

Jun 1 2026 2:29 PM | Updated on Jun 1 2026 3:12 PM

Do you know where the city of greats is?

విజయనగరం జిల్లా అనగానే ఠక్కున గుర్తొచ్చేది గురజాడ, గిడుగు. ఈ జిల్లా ప్రాధాన్యత అంతటికే పరిమితం కాదు అన్నది రెడ్డి శంకరరావు ‘విజయనగరం జిల్లా అమరవీరుల చరిత్ర’ చదివితే అవగతమవుతుంది. సాంస్కృతిక జీవనంతో పాటు రాజకీయా లలో, ఉద్యమాలలో పనిచేసిన నూట ముగ్గురు ప్రముఖుల జీవిత చరిత్రలు కనుమరుగై పోకుండా, ఈ ప్రాంత వారసత్వాన్ని నేటి తరానికి అందించడానికి చేసిన ప్రయత్నమిది.

విజయనగరం జిల్లా బ్రిటిష్‌ కాలంలో మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాలో భాగంగా 1936లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడే వరకు ఉండేది. తరువాత విశాఖ జిల్లాలో కలిసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత శ్రీకాకుళం జిల్లాలో కొంత భాగం కలిసింది. 1979లో నేటి విజయనగరం జిల్లా ఏర్పడింది. 2022లో ఏర్పడిన పార్వతీపురం జిల్లాలో కొంత భాగం కలిసింది. అలా, నాటి గంజాం జిల్లా నుండి నేటి వరకు విజయ నగరం జిల్లా చరిత్ర అంటే ఉత్తరాంధ్ర చరిత్రే.     

1834లోనే బ్రిటిష్‌ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ‘ఈ ఊరు నాది– ఈ అడవి నాది’ అని విల్లంబు ఎత్తి, గిరి జనులను సమీకరించి పోరాడిన కొర్రా మల్లన్న, శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో మొదట అసువులు బాసిన కోరన్న, మంగన్న, గిరిజనోద్యమానికి ఊపిరి పోసిన పల్లె రాములు మాస్టారు, ఆ ఉద్యమ రథసారథలు వెంపటాపు సత్యం, గంటి రాజేశ్వరరావు, ఆదర్శ కమ్యూనిస్టు ఆదిభట్ల కైలాసం వంటి ఎందరో త్యాగధనుల చరిత్రలు భావితరాలకు స్ఫూర్తిదాయకం. జమీందారీ వ్యతిరేక పోరాటాలు పెద్ద ఎత్తున జరిగిన ప్రాంతమిది. ఆ పోరాటాల ప్రభావం ఎంతగా ఉందంటే 1937లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టెక్కలి, బొబ్బిలి జమీందారులు ఓడిపోయి, రైతు నాయకులైన పుల్లెల శ్యాంసుందర రావు, వి.వి. గిరి గెలుపొందారు. అలాగే మందస జమీందారీ వ్యతిరేక పోరాటం ప్రాణాలకు తెగించి సాగడం, పోలీసు కాల్పుల్లో వీర గున్నమ్మతో సహా మరో ఐదుగురు మరణించడం వంటివి చరిత్రలో నిలవాలంటే, అక్షర రూపంలో నిక్షిప్తం కావాలి. 

మా కొద్దీ తెల్లదొరతనం అని నినదించిన గరిమెళ్ళ, హరికథా పితా మహుడు ఆదిభట్ల నారాయణదాసు, ప్రజా కళాకారుడు సుబ్బారావు పాణి గ్రాహి, హేతువాది తాపీ ధర్మారావు, వయొలిన్‌ విద్వాంసుడు ద్వారం వెంకట స్వామి నాయుడు, మహాబలుడు కోడి రామమూర్తి, ఆంధ్ర జాలరి సంపత్‌ కుమార్, ఆరుద్ర, ఘంటసాల, సాలూరు రాజేశ్వరరావు – అత్యంత వెనుక బడిన ఈ ప్రాంతం ఇంతమంది ఉద్దండులకు జన్మనివ్వడం ఆశ్చర్యకరమే కాక, గర్వించదగ్గ విషయం. గత చరిత్రను తెలుసుకోవడం, భవిష్యత్తుకు పునాది. అటువంటి చరిత్రను కళ్ల ముందుంచిన పుస్తకమిది.
– ఎ. అజ శర్మ ‘ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
 

Advertisement
 
Advertisement
Advertisement