ప్రభుత్వ పరిధిలోనే రోగ నిర్ధారణ పరీక్షలు

Diagnostic Tests Within The Government Hands - Sakshi

పీపీపీ పద్ధతికి స్వస్తి.. ప్రతి ఆస్పత్రిలో సొంత ల్యాబొరేటరీ

గతం: ఏదో కంపెనీ రావడం పీపీపీ కింద పరీక్షలు చేస్తున్నామని చెప్పడం, ఫ్రాంచైజీల్లో పరీక్షలు చేశామనడం.. డాష్‌బోర్డులో ఇష్టారాజ్యంగా అప్‌లోడ్‌ చేసుకోవడం..
ప్రస్తుతం: ప్రభుత్వ పరిధిలోనే పరీక్షలు జరగాలి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబొరేటరీలు బాగుపడాలి.. సామాన్యులు, పేదలు ప్రతి ఒక్కరికీ మెరుగైన రోగ నిర్ధారణ పరీక్షలు జరగాలి.. దీనికి ఎంతైనా ఫరవాలేదు.. ఇదీ ఇప్పటి ప్రభుత్వ ఉద్దేశం.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ పరిధిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత నలుగురు సభ్యులతో కమిటీ నియమించి, పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. పలువురు వైద్యనిపుణుల అభిప్రాయాలతో పాటు, సుజాతారావు కమిటీ సూచనల మేరకు రాష్ట్రంలో 14 నుంచి 134 పరీక్షల వరకు ప్రభుత్వ పరిధిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. 

ల్యాబొరేటరీల ఉన్నతీకరణ
► రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తపరీక్షలకు అవసరమైన పరికరాలు సమకూరుస్తారు.
► ల్యాబొరేటరీల్లో పాథాలజీ, హిస్టోపాథాలజీ, మైక్రోబయాలజీ పరీక్షలు చేస్తారు. ల్యాబ్‌ పరికరాల కొనుగోలుకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తారు.
► కొనుగోళ్లను ఏపీఎంఎస్‌ఐడీసీ పర్యవేక్షిస్తుంది.
► నిర్ధారణ పరీక్షలకు అవసరమైన రసాయనాలు (రీఏజెంట్స్‌) కొరత లేకుండా చూస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 10 శాతం బయట నుంచి కొనుగోలు చేయవచ్చు.
► ర్యాపిడ్‌ డయాగ్నిస్టిక్స్‌ టెస్ట్‌ కిట్‌లు కూడా ప్రతి ఆస్పత్రిలో అందుబాటులో ఉంచుతారు.పరీక్ష ఫలితాలను రోగి మొబైల్‌ నంబరుకు మెస్సేజ్‌ రూపంలో పంపుతారు.
► ఇన్వెంట్రీ మేనేజ్‌మెంట్‌ అంటే నిర్ధారణ పరీక్షలు చేసిన ప్రతి రోగికి సంబంధించిన వివరాలు పొందుపరుస్తారు.

మూడు పెద్ద ల్యాబ్‌ల ఏర్పాటు
రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో అతిపెద్ద ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్కటి రూ.25 కోట్లతో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో వీటిని నిర్మిస్తారు. ఒక్కో ల్యాబ్‌లో రోజుకు 10 వేల పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. 

ఇక మన ఆస్పత్రుల్లోనే..
అన్ని రోగ నిర్ధారణ పరీక్షలు సొంతంగానే చేపడుతున్నాం.  రోజుకు 10 వేల టెస్టులు జరిగే మూడు మేజర్‌ ల్యాబ్‌లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత మిగతా జిల్లాల్లో ఏర్పాటు చేస్తాం.
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top