ఎర్రనేత.. భూముల మేత

CPM Leader Land Grab In Chittoor District - Sakshi

సీపీఎం నాయకుడి భూ బాగోతం

18 ఎకరాల డీకేటీ భూమి కబ్జా

బినామీ పేర్లతో పాసు పుస్తకాలు

విప్లవ పార్టీ పేరుతో అధికారుల పరిచయాలు.. మితిమీరిన స్వార్థం.. చట్టంలోని లోసుగులు.. తప్పుడు రికార్డుల సృష్టి..వెరసి ప్రభుత్వ భూమి ఓ నేత పరమైంది. అందులో నీలగిరి తైలం చెట్లు పెంచినట్లు ఆ భూములపై బ్యాంకుల్లో సైతం రుణాలు పొందారు. ఇదీ ఓ ఎర్ర పార్టీ నేత.. భూముల కబ్జా కథ.  

కేవీబీపురం: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసే పార్టీలు ఏవైనా ఉన్నాయంటే గుర్తొచ్చేవి రెండే పార్టీలు. ఒకటి సీపీఎం, మరొకటి సీపీఐ. ఈ పార్టీలకు చెందిన నాయకులంటే భూస్వాముల వెన్నులో వణుకు. నిస్వార్థంగా... లాభాపేక్ష ఆశించకుండా పేదల కోసమే పోరాటం చేస్తూ ప్రాణాలు విడిచిన నాయకులు ఈ పార్టీల్లో ఉన్నారు. అటువంటి పార్టీలో ఉంటూ... కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారన్న ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయి. కేవీబీపురం మండలంలో ఓ సీపీఎం నాయకుడు పార్టీని అడ్డుపెట్టుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవటంతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలు పొందడమే ఇందుకు నిదర్శనమన్న ఆరోపణలున్నాయి. 

కుటుంబసభ్యుల పేరున భూములు    
కేవీబీపురం మండలంలోని బ్రాహ్మణపల్లె పరిధిలోని సీపీఎం నాయకుడు ఒకరు పోరాటాల పేరుతో అధికారులతో పరిచయాలు పెంచుకున్నారు. 18 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు, స్థానిక గిరిజనులకు చెందిన మరో 4 ఎకరాలకు దొడ్డిదారిన పాసు పుస్తకాలు పొందారు. సర్వే నంబర్‌ 451/1, 2లో 5.20 ఎకరాలు, ఆ నాయకుని భార్య పేరున సర్వే నెంబర్‌ 454లో 90 సెంట్లు, 453/5లో 36 సెంట్లు, 456/6లో 2.99 ఎకరాల భూమిపై పాసు పుస్తకాలు కలిగి ఉన్నారు. దీనితో పాటు మరో 12.80 ఎకరాలు భూమి ఉన్నందున ఆతను రేషన్‌ కార్డుకు అనర్హుడిగా గుర్తించిన ప్రభుత్వం కార్డును తొలగించింది. ఈ భూముల పాసు పుస్తకాలను నాలుగు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొంది ఉన్నారు. అంతే కాకుండా 2015లో తనకున్న 12 ఎకరాల్లో తైలం చెట్లు పెంపకానికి ఇందిర క్రాంతి పథకం ద్వారా సుమారు రూ.80 వేలు రుణంగా పొందివున్నారు. అయితే తైలం చెట్లను పెంచిన దాఖలాలు కనిపించలేదు. అలాగే వేమలపూడి పంచాయతీలోని సర్వే నంబర్‌ 521/3లో 2 ఎకరాలు, 521/7లోని మరో 2 ఎకరాలను బినామీ పేర్లతో  పాసుపుస్తకాలు కలిగి ఉన్నట్లు సమాచారం.

కబ్జా భూమి..  

విక్రయానికి పట్టాదారు పాసు పుస్తకాలు
ప్రభుత్వ భూములకు ఒక ధర కట్టి స్థానికేతరులు, అనర్హులకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలిచ్చి అందినకాడికి దోచుకుంటున్నారు. గతంలో కేవీబీపురం తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఇలాంటి పాసు పుస్తకాలను వేల సంఖ్యలో సృష్టించి రూ.లక్షలు గడించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరహాలో సీపీఎం నాయకుడు ప్రభుత్వ భూములపై పట్టాపాసు పుస్తకాలను సృష్టించి, ప్రభుత్వ భూములను సొంతం చేసుకున్నారని గతంలో తహసీల్దార్‌ ప్రకాష్‌బాబుకు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఆక్రమణల విషయంపై మండల  తహసీల్దార్‌ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. ఆక్రమణలు జరిగి ఉంటే తక్షణం విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top