బల్క్ డ్రగ్ పార్కు వద్దంటూ స్పష్టీకరణ
కలెక్టర్ నచ్చజెప్పినా వినని రాజయ్యపేట గ్రామస్తులు
ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులతో కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని మత్స్యకారులు స్పష్టంచేశారు. సముద్ర జలాలను కలుషితంచేసి, చేపల వేటకు విఘాతం కలిగించే బల్క్ డ్రగ్ పార్కును రద్దుచేయాలంటూ 41 రోజులుగా రాజయ్యపేటలో మత్స్యకారులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 15 రోజుల క్రితం వీరంతా జాతీయ రహదారిని దిగ్బంధించి నక్కపల్లిలో నాలుగు గంటలపాటు ధర్నాచేశారు. దీంతో కలెక్టర్ వచ్చి త్వరలో చర్చలు జరుపుతానని నచ్చచెప్పి అప్పట్లో ఆందోళన విరమింపజేశారు.
ఈ నేపథ్యంలో.. కలెక్టర్ శుక్రవారం రాజయ్యపేట వచ్చి మత్స్యకారులతో చర్చలు జరిపారు. గ్రామస్తుల తరఫున 20 మందిని ఎంపికచేసి వారితో మాట్లాడించారు. వారంతా పరిశ్రమను రద్దుచేయాలన్నదే తమ ఏకైక డిమాండ్ అని తేల్చిచెప్పారు. బల్క్ డ్రగ్ పార్కు వస్తే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది కలెక్టర్‌కు వివరించారు. గతంలో ఏర్పాటుచేసిన రసాయన పరిశ్రమలవల్ల భూగర్భ జలాలు కలుషితమై క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ అనారోగ్యం పాలవుతున్నామన్నారు.
దీనివల్ల ఇప్పటికే 40 మంది చనిపోయారన్నారు. తన భార్య గర్భవతి అని, పిల్లలు ఎలా పుడతారోనని బెంగగా ఉందని దైలపల్లి కృష్ణ అనే మత్స్యకారుడు ఆందోళన వ్యక్తంచేశాడు. మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయని, పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారని గోసల కామేశ్వరి అనే మహిళ కలెక్టర్‌కు వివరించింది.
అధికారుల మాటపై నమ్మకంలేదు..
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్పే విషయాలు వినాలని కలెక్టర్ వారికి సూచించగా.. అందుకు మత్స్యకారులు అంగీకరించలేదు. వారిపై నమ్మకంలేదని, వారు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆక్షేపించారు. దీంతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. రసాయన పరిశ్రమల్లో వ్యర్థ జలాలు శుద్ధిచేయకుండా వదిలేయడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై ప్రభుత్వం నిఫుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేసిందని, త్వరలోనే నివేదిక ఇస్తారన్నారు.
నిబంధనలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏయే కంపెనీలు పెడతారో తెలీదని, మందుల కంపెనీలకు భూములు కేటాయించలేదన్నారు. పదేళ్ల క్రితం ప్రభుత్వం సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పిస్తారన్నారు. ఇక్కడకు వచ్చే పరిశ్రమలపై మీతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే, బల్క్ డ్రగ్ పార్కు రద్దుచేయడమే డిమాండ్ అని స్పష్టంచేశారు.
ఆంక్షలు, కేసులు ఎత్తివేయండి..
హోంమంత్రిని అడ్డుకున్నందుకు, జాతీయ రహదారిని ముట్టడించినందుకు చాలా మందిపై కేసులు నమోదుచేశారని, గ్రామంలో సెక్షన్–30 అమలుచేస్తూ ఇతరులెవరినీ గ్రామంలోకి రానీయడం లేదన్నారు. ఈ కేసులు, ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ వారు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
దీనిపై కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్కు అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుందని, దీనిపై తానేమీ చెప్పలేనన్నారు. మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ కలెక్టర్ సమావేశాన్ని ముగించారు. కేసులు, గ్రామంలో సెక్షన్–30 ఎత్తివేయడం గురించి కలెక్టర్ ఎలాంటి హామీ ఇవ్వలేదు.


