ఏడాదంతా పందేల జోరు | cockfights in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏడాదంతా పందేల జోరు

Mar 31 2026 6:05 AM | Updated on Mar 31 2026 6:05 AM

cockfights in Andhra Pradesh

శ్రీనివాసపురం శివారు పామాయిల్‌ తోటలో కోడిపందేలు నిర్వహిస్తున్న దృశ్యం

జంగారెడ్డిగూడెంలో భారీగా పందేల నిర్వహణ 

దెందులూరు, ఉండిలోనూ జోరుగా బరులు 

మొక్కుబడిగా పోలీసుల దాడులు 

చింతలపూడిలో 32 మంది, నూజివీడులో 9 మంది అరెస్టు 

పందెంరాయుళ్లకు ముందస్తుగా సమాచారం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంక్రాంతి మూడు రోజులు సందడి చేసే కోడిపందేలు కూటమి నేతల వల్ల 365 రోజులు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లాలో ఏదోక ప్రాంతంలో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అప్పడప్పుడు పోలీసులు మొక్కుబడిగా దాడులు చేస్తున్నారు. కేసులు మినహా ఎలాంటి హడావుడీ లేకపోవడంతో జోరు పెరిగింది. సంక్రాంతి సరదా క్రీడను నిత్యం ఆడేలా పందెంరాయుళ్లు బరితెగించారు. గతేడాది వరకూ పండుగ మూడు రోజులూ అన్ని నియోజకవర్గాల్లో కోడిపందేల బరులు ఏర్పాటు చేసేవారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 350కుపైగా బరుల్లో రూ.150 కోట్ల నుంచి రూ.180 కోట్ల మేర పందేలు నిర్వహించేవారు. కూటమి పాలకులు సంక్రాంతి క్రీడను ఇప్పుడు ఏడాది మొత్తం క్రీడగా మార్చేశారు. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలోని పినకడిమి, పెదకడిమి, దుగ్గిరాల మరికొన్ని ప్రాంతాల్లో, అలాగే కృష్ణా– ఏలూరు జిల్లా సరిహద్దులోని కలిదిండి మండలంలోని ఒక గ్రామంలో, ఉండి నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వారాంతాల్లో, కొన్నిసార్లు వారంలో ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు.

చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో భారీ ఎత్తున పందేలు తరచూ నిర్వహిస్తున్నారు. అన్ని చోట్ల కూటమి నేతలే నిర్వాహకులు కావడం, ప్రజాప్రతినిధుల సహకారం ఉండటంతో మొక్కుబడి కేసులకే పోలీసులు పరిమితమవుతున్నారు. ప్రధానంగా 27 నుంచి 29 వరకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అనేక ప్రాంతాల్లో పందేల హడావుడి మొదలైంది. 

పందెంరాయుళ్లకు ముందస్తు సమాచారం 
కూటమి నేతల కనుసన్నల్లో జరిగే శిబిరాలకు సంబంధించి పందెంరాయుళ్లకు ముందస్తు సమాచారం అందుతోంది. అందరూ కాకుండా ఎంపిక చేసుకున్న 30–40 మందితో పెద్ద పందేలు నిర్వహించేలా శిబిరాలను కొనసాగిస్తున్నారు. వరుస సెలవులు, పండుగ, ప్రత్యేక దినాల్లో, అదే విధంగా రాజకీయ నేతల జన్మదినోత్సవాల్లో కూడా జిల్లాలో పందేలు నిర్వహిస్తున్నారు.    

మెట్ట ప్రాంతాల్లోనూ.. 
ఇక జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు కూడా ఏడాది పొడవునా పందేల నిర్వహణ పాకింది. ప్రధానంగా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ద్వారకాతిరుమల, నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో పెద్ద ఎత్తున పందాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురంలోని ఓ పామాయిల్‌ తోటలో ఉదయాన్నే సుమారు 200 మందితో కోడిపందేల నిర్వహణ ప్రారంభించారు. పండగ హడావుడి కావడంతో ఎవరూ పట్టించుకోరని కోడిపందేలకు తెరతీయగా స్థానికులు సోషల్‌ మీడియాలో పందేల వీడియో పోస్టు చేయడం పోలీసులు వస్తున్నారనే సమాచారంతో పందెంరాయుళ్లు పరారయ్యారు. 

చింతలపూడి మండలంలోని శివాపురం, చింతలపూడి, తీగలవంచ, కొమ్ముగూడెం  ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు దాడి చేయగా 32 మంది పందెంరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30,180 నగదు, 20 ద్విచక్రవాహనాలు, 14 కోళ్ళు స్వా«దీనం చేసుకున్నారు.  నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో కోడిపందేల నిర్వహణపై పోలీసులు సమాచారం అందుకుని 3 కోళ్లు, 2 కత్తులు, రూ.6480 నగదు, 9 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement