గ్రూప్–1 కేసులో సిట్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రధాన పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేసి నివేదిక సమరి్పంచేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) హైకోర్టు నెల రోజుల గడువునిచి్చంది. నివేదికను సీల్డ్ కవర్‌లో ఉంచి తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటుతోపాటు 2018 గ్రూప్–1లో ఉత్తీర్ణత సాధించిన అధికారులను నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
‘నాన్ ఫోకల్’ అమలు తీరుపై అసహనం
కాగా, 2018 గ్రూప్–1లో ఉద్యోగం సాధించి డీఎస్‌పీలు, ఆర్డీవోలు తదితర హోదాల్లో కొనసాగుతున్న వారిని నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలన్న తమ ఆదేశాల అమలు తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కొందరు డీఎస్‌పీలకు సీఐడీలో పోస్టింగులు ఇచ్చారని, వారే ఇకపై ఈ కేసులో కీలక డాక్యుమెంట్లను తీసుకెళుతుంటారంది. ఎవరిపై ఆరోపణలు ఉన్నాయో వారినే సీఐడీలోకి తీసుకోవడం ఏంటో అర్థం కావడం లేదని ఆక్షేపించింది.
చేతకాకపోతే చెప్పండి: సిట్‌పై అసంతృప్తి
కాగా సిట్ పంపిన జవాబు పత్రాలన్నింటిని పరిశీలించడం తమకు సాధ్యం కాదని తెలిపిన హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్, 167 పత్రాలు మాత్రమే ఉంచుకుని మిగతావి తిరిగి పంపిందని అంతకుముందు సిట్ తరఫు న్యాయవాది పాణిని సోమయాజీ పేర్కొనడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను సిట్ అమలు చేయాలని లేదా సాధ్యం కాదని చెబితే, తాము ప్రత్యామ్నాయంగా మరో దర్యాప్తు సంస్థకు ఈ బాధ్యతలను అప్పజెబుతామని స్పష్టం చేసింది. అనంతరం సిట్ అధిపతితో మాట్లాడిన సోమయాజీ, దర్యాప్తును తామే కొనసాగిస్తామని ఆయన తెలిపినట్లు ధర్మాసనానికి నివేదించారు.


