ఇప్పటికే మంచి ఆదాయం పొందుతున్న రైతులు
చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో విస్తృత పరిశోధనలు
ప్రధాన పంటగా మార్చేందుకు శాస్త్రవేత్తల విశేష కృషి
మెరుగైన రకాలను గుర్తించి, గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం
విదేశాల్లో మంచి గిరాకీ ఉన్న అవకాడో (బటర్ ఫ్రూట్) సాగుపై చింతపల్లి ఉద్యానవన పరిశోధనా స్థానం ప్రత్యేక దృష్టి సారించింది. కాఫీ, మిరియాలు తరహాలోనే ఏజెన్సీలో అవకాడోను ఒక ప్రధాన వాణిజ్య పంటగా మార్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. మెరుగైన రకాలను గుర్తించి, రైతులకు మేలైన గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యంగా ఇక్కడ పరిశోధనలు ముమ్మరం చేశారు.
చింతపల్లి: అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం విదేశీ పంటలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికే స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు ఇక్కడ విజయవంతం కాగా, తాజాగా ఆ జాబితాలో అవకాడో (వెన్న పండు) వచ్చి చేరింది. గిరిజన రైతులకు ఈ పంటను మరింత చేరువ చేసేందుకు చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు చేపట్టారు. రకాల గుర్తింపు: సుమారు ఎకరా విస్తీర్ణంలో ఆరు రకాల దేశీ, విదేశీ అవకాడో రకాలను దిగుమతి చేసుకుని శాస్త్రవేత్తలు సాగు చేస్తున్నారు. ఏజెన్సీ వాతావరణానికి తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకాలను గుర్తించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యం.
⇒ ఐటీడీఏ ద్వారా గతంలోనే యాపిల్, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ వంటి మొక్కలను రైతులకు సరఫరా చేశారు. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన రైతులకు ఈ మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
⇒ రెండు దశాబ్దాల క్రితం కాఫీ తోటల్లో నీడ కోసం కాఫీ బోర్డు అధికారులు గొందిపాకల పంచాయతీలోని పలు గ్రామాల్లో ఈ మొక్కలను పంపిణీ చేశారు. అప్పట్లో రైతులకు వీటి విశిష్టత తెలియక, పండ్లు నేలరాలినా పట్టించుకోకుండా వృథాగా వదిలేసేవారు. అయితే, కొన్ని ఏళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఈ పండ్ల విలువను, మార్కెట్ డిమాండ్‌ను వివరించడంతో రైతులు వీటి అమ్మకాలు ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాపారులు నేరుగా గ్రామాలకు వచ్చి రైతుల వద్ద నుంచి పండ్లను కొనుగోలు చేస్తున్నారు.
పోషకాల పండు.. : అవకాడోలో అత్యధిక పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.క్యాన్సర్ కారకాలను నిరోధించడంతో పాటు కంటి చూపు మెరుగుదలకు, మధుమేహం, స్థూలకాయం తగ్గడానికి ఈ పండు ఎంతో తోడ్పడుతుంది. సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
మంచి గిరాకీ
చింతపల్లి ఉద్యానవన పరిశోధనా కేంద్రంలో అవకాడో సాగుపై విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సాగులో ఉన్న కేడీ–1, హోస్ రకాలతో పాటు పింకిర్టన్, ప్యూర్డ్ వంటి కొత్త రకాలను పరిశీలిస్తున్నాం. గిరిజన రైతులు పండించే పంటకు శాస్త్రీయ గుర్తింపు కల్పించి, మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యంగా కృషి జరుగుతోంది. భవిష్యత్తులో కాఫీ, మిరియాల తరహాలోనే అవకాడోను కూడా ఏజెన్సీలో ప్రధాన పంటగా మార్చేందుకు ఈ పరిశోధనలు కీలకం కానున్నాయి.
– రమణ, ప్రధాన శాస్త్రవేత్త, ఉద్యానవన పరిశోధనా స్థానం, చింతపల్లి


