నెల్లూరు జిల్లాలో జంట హత్యలు | Two found murdered in Nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో జంట హత్యలు

Mar 31 2026 5:46 AM | Updated on Mar 31 2026 5:46 AM

Two found murdered in Nellore district

కొడవలూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలో జరిగిన జంట హత్యలు సోమవారం కలకలం రేపాయి. జిల్లాలోని దగదర్తి మండలం పెద పుత్తేడుకు చెందిన కుందుర్తి వెంకటేష్‌ (29), సంగం మండలం వెంగారెడ్డిపాళెంకు చెందిన కొప్పోలు బాలవెంకయ్య (26) గండవరం మజరా వడ్డిపాళెం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. వీరిద్దరూ వరిగడ్డి కట్ట కట్టే యంత్రాన్ని తీసుకొని ఆదివారం వడ్డిపాళెం సమీపంలోని పొలాల్లోకి వచ్చారు. యంత్రానికి డీజల్‌ అయిపోవడంతో సాయంత్రం ఇద్దరూ కలిసి బైక్‌పై వచ్చి డీజల్‌ తీసుకొని పొలాల్లోకి వెళ్లారు.

రాత్రి ఇద్దరూ ఇంటికి రాలేదు. దీంతో వెంకటేష్‌ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి సోమవారం ఉదయం ఇద్దరూ పనికి వెళ్లిన పొలాల వైపు వెతుక్కొంటూ వస్తుండగా వడ్డిపాళెం వద్ద రోడ్డు పక్కనే తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల, ఏఎస్పీ సౌజన్య, నెల్లూరు రూరల్‌ డీఎస్పీ జి.శ్రీనివాసరావు ఘటనాస్థలికి వచ్చి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

మృతుడి బంధువులతో మాట్లాడి హత్యకు గల కారణాలను ఆరా తీశారు. వెంకటేష్ కు ఓ వివాహితతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని గుర్తించారు. వివాహిత తరఫు బంధువులే హతమార్చారని ప్రాథమికంగా నిర్థారించారు. వెంకటేష్ ను హత్య చేసేందుకు వచ్చి పక్కనే ఉన్న బాలవెంకయ్యను కూడా హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. పెదపుత్తేడుకు చెందిన బత్తల కళ్యాణ్, బత్తల ప్రశాంత్, బత్తల విజయభాస్కర్‌ను అనుమానితులుగా గుర్తించి ఐదు ప్రత్యేక బృందాలతో ఎస్పీ గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement