పీజీ.. నో క్రేజీ! | PG Courses lose charm with declining admissions in Andhra pradesh | Sakshi
Sakshi News home page

పీజీ.. నో క్రేజీ!

Mar 31 2026 6:00 AM | Updated on Mar 31 2026 6:00 AM

PG Courses lose charm with declining admissions in Andhra pradesh

ఆదరణ కోల్పోతున్న పీజీ కోర్సులు  

గత ఏడాది కంటే భారీ స్థాయిలో తగ్గిన పీజీసెట్‌–2026 దరఖాస్తులు 

ముగిసిన పీజీసెట్‌ దరఖాస్తుల గడువు   

పలుసార్లు గడువు పొడిగించినా ఆసక్తి చూపని అభ్యర్థులు

హమ్మయ్యా..పరీక్షలు పూర్తయ్యాయి.. కొన్ని రోజులు విరామం.. ఆ తరువాత పోటీలో మళ్లీ పరుగు తప్పదు..డిగ్రీ పరీక్షలు రాసేశాం..ఇక ఇప్పుడేం చేయాలి.. ఉన్నత విద్యా.. ఇక చదివే ఓపిక లేదు.. ఏదో ఉద్యోగం చూసుకుంటే సరిపోద్దీ.. మళ్లీ పీజీ అంటే పీజీ సెట్‌ రాయాలి.. మరో రెండేళ్లు చదవాలి.. అంత కష్టం ఎక్కడబ్బా.. వద్దులే అన్నట్లుగా యువత ఉపాధి వైపు చూస్తుండడంతో పోస్ట్రుగాడ్యుయేన్‌ చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పీజీ సీట్లు భర్తీ కాక మిగిలిపోతున్నాయి.  

తిరుపతి సిటీ: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అంటేనే పెద్ద చదువుగా భావించేవారు. పీజీ చేసిన వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గౌరవం ఉండేది. విద్యలోనే ఉన్నత చదువుగా గుర్తింపు పొందిన పీజీకి ప్రస్తుతం ఆదరణ తగ్గడంతో యూనివర్సిటీల భవితవ్యం ఆగమ్య గోచరంగా మారింది. క్రమక్రమంగా సాధారణ పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ లాంటి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గత మూడేళ్లుగా భారీ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నారు.

ఇందుకు ప్రధాన కారణం ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్, ఎంబీబీఎస్‌తోపాటు త్వరగా ఉపాధిని అందించే ఏఐ, మిషన్‌ లెర్నింగ్, కోడింగ్, క్యాంటమ్‌ టెక్నాలజీ అంటూ పలు ప్రొఫెషనల్‌ కోర్సులపై మొగ్గు చూపడంతో సాధారణ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయని అధ్యాపకులు, వర్సిటీ అధికారులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు యూనివర్సిటీల్లో ఉన్నత విద్యగా గుర్తింపు పొందిన పీజీ కోర్సులకు ఆదరణ తగ్గడానికి నూతన విద్యావిధానం, కామన్‌ పీజీసెట్‌ సైతం ప్రధాన కారణమని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.   

భారీ స్థాయిలో తగ్గిన దరఖాస్తులు 
ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీ సెట్‌–2026కు దరఖాస్తులు గత ఏడాది కంటే సుమారు 7 వేలకు పైగా తగ్గినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని సుమారు 17 యూనివర్సిటీల్లో 30 పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన పీజీ సెట్‌కు 18 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. 30 పాఠ్యాంశాలకు సంబంధించిన కోర్సుల్లో సుమారు 24 వేలకు పైగా సీట్లు ఉన్న నేపథ్యంలో 1:1 ప్రాతిపదికన సైతం దరఖాస్తులు అందకపోవడంతో పీజీ కోర్సుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది పీజీ సెట్‌ పరీక్ష అర్హత సాధించిన ప్రతి విద్యారి్థకీ కచ్చితంగా సంబంధింత కో­ర్సులో సీటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది.  

పలుసార్లు గడువు పొడిగించినా... 
పీజీసెట్‌కు దరఖాసులు పెంచాలని ఉన్నత విద్యామండలి విశ్వ ప్రయత్నం చేసినా దరఖాస్తులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పలుసార్లు దరఖాస్తుల గడువును పెంచుతూ ప్రసార మాద్యమాల ద్వారా ప్రచారం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు అందలేదు.

మూడేళ్లుగా ఏపీపీజీ సెట్‌ దరఖాస్తుల పరిస్థితి ఇదీ... 
2024లో... 
ఏపీపీజీసెట్‌కు అందిన దరఖాస్తులు – 33,149 
మొత్తం భర్తీ కావాల్సిన పీజీ సీట్లు (31 విభాగాల్లో) – 25 వేలు 

పీజీసెట్‌ ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు – 30, 207 
భర్తీ అయిన సీట్లు – 22,438

2025లో... 
పీజీ సెట్‌కు వచ్చిన దరఖాస్తులు   – 25,688 
మొత్తం భర్తీ కావాల్సిన సీట్లు – 25 వేలు  
గత ఏడాది పీజీసెట్‌ రాసిన అభ్యర్థులు  –21,995 
భర్తీ అయిన సీట్లు – దాదాపు 19,500

పీజీ కోర్సులతో ఉన్నత స్థాయి ఉద్యోగాలు 
వర్సిటీల్లో పీజీ కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఎన్‌ఈపీ ద్వారా విద్యారంగంలో పలు నూతన సంస్కరణలకు బీజం పడింది. ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పీజీ కోర్సులతో పాటు స్కిల్‌డెవలప్‌మెంట్‌ పెంపొందించుకోవాల్సి అవసరం ఉంది. ఈ మేరకు ప్రతి పీజీ కోర్సుల్లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. డిగ్రీలో ప్రవేశాలు తగ్గడంతో పాటు డిగ్రీ పూర్తి అయిన వెంటనే ఉద్యోగాల వైపు యువత వెళ్లడమే పీజీలో అడ్మిషన్లు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.  –ప్రొఫెసర్‌ బి దేవప్రసాద్‌రాజు, పీజీసెట్‌–2026 కోకన్వీనర్, ఎస్వీయూ  

డిగ్రీలో ప్రవేశాలు తగ్గడం ఒక కారణమే 
ప్రస్తుతం యువత తొందరగా లైఫ్‌ సెటిల్‌మెంట్‌ కోసం చూస్తున్నారు. సాధారణ డిగ్రీ పూర్తి చేస్తే ఉద్యోగాలు దొరకవనే అపనమ్మకం ఇటు తల్లిదండ్రులలోనూ, అటు విద్యార్థులలోనూ పాకిపోయింది. దీంతో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి యూజీ కోర్సుల్లో అడ్మిషన్లు తగ్గుముఖం పట్టాయి. ఆ ఎఫెక్ట్‌ పీజీ కోర్సులపై పడుతోంది. ప్రస్తుతం డిగ్రీ కోర్సులలోనూ ప్రధాన సబ్జెక్ట్‌తో పాటు ఏఐ, మిషన్‌ లరి్నంగ్, డేటా సైన్స్‌ వంటి కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఉన్నత విద్య లక్ష్యంగా విద్యార్థి అడుగులు పడాలి.  –ప్రొఫెసర్‌ కే సురేంద్రబాబు, ఎగ్జామినేషన్‌ డీన్, ఎస్వీయూ  

నేరుగా ప్రవేశాలు కలి్పంచడం ఉత్తమం  
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీలకు కామన్‌ పీజీసెట్‌ను నిర్వహించడంతో అడ్మిషన్లపై ప్రభావం పడుతోంది. ఆయా వర్సిటీలకు పీజీ అడ్మిషన్ల బాధ్యతను అప్పగించాలి. ఉన్నత విద్యామండలి ఈ విషయంపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది. పీజీ కోర్సులకు గత వైభవం రావాలంటే పీజీసెట్‌ను రద్దు చేసి నేరుగా విద్యార్థి మెరిట్‌ ప్రాతిపదికన సీట్లు కేటాయించడం ఉత్తమం. అప్పుడే పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. యూనివర్సిటీలు మనుగడకు ఎటువంటి ప్రమాదం ఉండదు.  –రాజేశ్వరీదేవి, ప్రైవేటు పీజీ కళాశాల అధ్యాపకురాలు, తిరుపతి  

మే 5 నుంచి పరీక్షలు 
ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు ఎస్వీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏపీ పీజీసెట్‌–2026 ప్రవేశ పరీక్షకు గడువు ముగిసింది. మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పీజీసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నాం.  
–ప్రొఫెసర్‌ పద్మావతి, పీజీసెట్‌ కన్వినర్, ఎస్వీయూ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement