చంద్రబాబు వల్లే ‘ఏ’ గ్రేడ్‌ సంఘాలన్నీ ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయి: సీఎం జగన్‌

CM YS Jagan Review Meeting On YSR Cheyutha And YSR Asara Scheme - Sakshi

వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలపై సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, తాడేపల్లి: ‘గత ప్రభుత్వం మాఫీ చేస్తానని హామీ ఇచ్చి రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మోసం చేసింది. ఈ నేపథ్యంలో ఆ రుణాలను అక్కాచెల్లెమ్మలు చెల్లించలేదు. చివరకు వడ్డీలు కూడా చెల్లించలేక తడిసి మోపెడై అక్కాచెల్లెమ్మల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో కట్టలేని ఆ రుణాలను నాలుగు దఫాలుగా ప్రభుత్వమే చెల్లిస్తోంది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

2016లో రద్దయిన సున్నావడ్డీ రుణాలను మళ్లీ తిరిగి పునరుజ్జీవింపచేసి, మహిళలను ఆదుకోవడమే కాకుండా వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేట్టుగా ఐటీసీ, రిలయన్స్, అమూల్‌లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేసి, వారికి వ్యాపార మార్గాలను చూపించింది. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు వేస్తోంది’ అని తెలిపారు.

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మొదటి విడత ఆసరా కింద దాదాపు 8 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు రూ.6330.58 కోట్లు మహిళలకు ప్రభుత్వం అందించిందని వివరించారు. దాంతోపాటు రెండో విడత ఆసరా సన్నాహాకాలను అధికారులు వివరించారు. లబ్ధిదారుల జాబితాపై సామాజిక తనిఖీ పూర్తయిందని, గ్రామ సచివాలయాల్లో కూడా ఆ జాబితాలను ప్రదర్శించామని సీఎం జగన్‌కు అధికారులు చెప్పారు. ఆసరా, చేయూతల కింద మహిళల్లో సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం చేపడుతున్న ఉపాధి మార్గాలు, వాటి అమలు కార్యక్రమాలను సీఎం సమగ్రంగా సమీక్షించారు.

2014లో చంద్రబాబు అక్కాచెల్లెమ్మల రుణాలను మాఫీచేసి ఉండిఉంటే అక్కడితో భారం పోయేది. కానీ చంద్రబాబు హామీ ఇచ్చి వాటిని కట్టకపోవడంతో మహిళలపై ఆ భారం అమాంతంగా పడింది. మహిళలను ఆదుకోకపోవడంతో మొత్తం వ్యవస్థే ఛిన్నాభిన్నమయ్యింది. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ కూడా ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయి. పాదయాత్రలో నేను వెళ్లినప్పుడు ప్రతి మహిళా చేసిన డిమాండ్‌ .. డ్వాక్రా రుణాల మాఫీ. మా పరిస్థితి బాగోలేదని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే ఆసరా, చేయూతలను తీసుకువచ్చాం. మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను మళ్లీ ఒకసారి సమీక్షించి మరింతమందికి లబ్ధి చేకూర్చేలా కార్యక్రమాలను చేపట్టాలి. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో అవగాహన, చైతన్యం కల్పించాలి. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక భరోసా.. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఉపయోగపడాలి. రెండో విడత ఆసరాను ఉంచుకుని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలి. ప్రజాప్రతినిధులను కూడా ఇందులో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించాలి’ అని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశించారు.

‘ఆసరా కింద ఇచ్చే డబ్బును బ్యాంకులు జమచేసుకోలేని విధంగా అన్‌ ఇంకబర్డ్‌ ఖాతాల్లో జమచేయాలి. స్థిర ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉపాధి మార్గాల కోసం బ్యాంకులు రుణాలు ఇప్పించేలా స్పాట్‌ డాక్యుమెంటేషన్‌ జరిగేలా చూడాలి. ఇళ్ల లబ్ధిదారులైన అక్కాచెల్లెమ్మలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం జగన్‌ తెలిపారు.

అనంతరం వైఎస్సార్‌ చేయూతపైన ఆయన సమీక్షించారు. చేయూతపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. వైఎస్సార్‌ చేయూత మొదటి విడత ద్వారా దాదాపు 3 లక్షల మంది మహిళలకు సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. రిటైల్‌ షాపులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం తదితర ఉపాధి మార్గాలను కల్పించినట్లు వెల్లడించారు. రెండో విడతలో 2,21,598 మంది మహిళలకు ఉపాధి మార్గాల కల్పనకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మహిళలు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి మార్కెటింగ్‌ సమస్య ఉత్పన్నం కావొద్దని ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

మనం ఎలాంటి ఉపాధిమార్గం చూపినా మహిళలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతేడాది ప్రాక్టర్‌ అండ్‌ గాంబిల్, ఐటీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్, రిలయన్స్‌ రిటైల్, అమూల్, అల్లానాలతో కలిసి సుస్థిర ఆర్థిక ప్రగతి కార్యక్రమాలు చేపట్టినట్లు సీఎం జగన్‌కు వివరించారు. ఈ ఏడాది రిలయన్స్‌కు చెందిన అజియో, టనాజెర్, గ్రామీణ వికాస్‌ కేంద్ర, మహీంద్రా, గెయిన్, కల్‌గుడి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు.

ఆసరా, చేయూత కింద మనం ఇచ్చే డబ్బును మహిళలు సుస్థిర జీవనోపాధికి వినియోగించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. సుస్థిర జీవనోపాధి మార్గాలతో విజయవంతమైన మహిళల ద్వారా ఇతర మహిళలు స్ఫూర్తి పొందాలని సూచించారు. వారు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలు, పశుపోషణ ద్వారా పొందుతున్న ఆదాయాల వివరాలను ఇతర మహిళలకు వివరించాలని అధికారులకు సీఎం నిర్దేశించారు.

సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సెర్ఫ్‌ సీఈఓ ఎండీ ఇంతియాజ్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ ఆర్‌ అమరేంద్ర కుమార్, సెర్ఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ మహిత తదితరులు హాజరయ్యారు.

చదవండి: Andhra Pradesh: ఆరోగ్యశ్రీకి పెద్దపీట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top