భారం పెరిగినా తీరం చేర్చాం

CM YS Jagan Comments at State level bankers committee meeting - Sakshi

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కోవిడ్‌ వల్ల 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గిన ఆదాయం  

నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8 వేల కోట్లు ఖర్చు  

మొత్తంగా రాష్ట్రంపై రూ.30 వేల కోట్ల భారం 

ఈ పరిస్థితిలో బ్యాంకింగ్‌ రంగం సహకారం మరవలేం 

థర్డ్‌వేవ్, ఒమిక్రాన్‌ ప్రచారం వల్ల రికవరీ కాస్త మందగించింది 

లేదంటే ఇంకా వేగంగా పుంజుకునేది  

ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలి 

పేదల ఇళ్లకు రూ.35 వేల చొప్పున 3 శాతం వడ్డీతో రుణం ఇవ్వాలి 

మిగతా వడ్డీ ప్రభుత్వమే భరిస్తుంది.. తద్వారా ఆర్థిక ప్రగతి  

వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు చేయూతనివ్వాలి 

ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. రానున్న రోజుల్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. తద్వారా లావాదేవీల ప్రక్రియ ఊపందుకుంటుంది. ఈ దృష్ట్యా ఏటీఎంలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వేదిక కావాలి. ఆ మేరకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఇది గొప్ప మార్పునకు దారితీస్తుంది.  
 
ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక రూ.2,83,380 కోట్లు కాగా, ఇందులో మొదటి ఆరు నెలల్లోనే 60.53 శాతం.. అంటే రూ.1,71,520 కోట్ల రుణాలు పంపిణీ చేశాయి. ప్రాధాన్యతా రంగాలకు వార్షిక రుణ లక్ష్యం రూ.2,13,560 కోట్లు కాగా, ఇందులో మొదటి ఆరు నెలల్లోనే 47.29 శాతం.. అంటే రూ.1,00,990 కోట్లు రుణాలుగా పంపిణీ చేశాయి.  
- సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమించేలా తీసుకొచ్చిన పలు కార్యక్రమాలు, పథకాలకు బ్యాంకర్లు తోడ్పాటు అందించి.. ఆర్థిక చక్రానికి ఊతమివ్వాలని  సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన నిర్వహించిన 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్‌ వ్యాప్తి తర్వాత దేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతోందన్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం పడిపోవడం, మరోవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో ప్రభుత్వంపై భారం మరింత పెరిగిందని తెలిపారు.

కోవిడ్‌తో ప్రభుత్వ ఆదాయం 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గడంతో పాటు కోవిడ్‌ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో బ్యాంకింగ్‌ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం గట్టెక్కించగలిగిందన్నారు. బ్యాంకులు తమ మొత్తం నికర రుణంలో ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన దానికి మించి 59.5 శాతం రుణాలు ఇవ్వడంతో పాటు రుణాలు–డిపాజిట్ల నిష్పత్తి 136 శాతం ఉండేలా చొరవ చూపినందుకు అభినందిస్తున్నానని చెప్పారు. కరోనా థర్డ్‌వేవ్, ఒమిక్రాన్‌ వేరియెంట్‌పై జరుగుతున్న ప్రచారం వల్ల ఆర్థిక స్థితి కాస్త మందగించిందని, లేకపోతే ఇంకా వేగంగా పుంజుకునేదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 
ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
  
ఇళ్ల లబ్ధిదారులకు మూడు శాతం వడ్డీతో రుణాలు  

► ‘నవరత్నాలు–అర్హులైన పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దీన్ని చూసి సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) ద్వారా తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. 
► దీని వల్ల ఆర్థికంగా ఎన్నో రంగాలకు మేలు కలుగుతోంది. సిమెంటు, స్టీల్‌ వినియోగం పెరుగుతోంది. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తోంది. కొందరు సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటుండడంతో వారికీ పని దొరుకుతోంది. ఆ విధంగా గ్రామాలు, పట్టణాల్లో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి.  
► కేంద్రం పీఎంఏవై ద్వారా ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. మరో రూ.35 వేల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందాల్సి ఉంది. ఆ ఇళ్ల స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా మహిళల పేరుతో రిజిస్టర్‌ చేసి ఇచ్చింది కాబట్టి, బ్యాంకులు ఆ రుణం మంజూరు చేయాలి.  
► బ్యాంకులు ఇచ్చే రూ.35 వేల రుణాలపై లబ్ధిదారుల నుంచి కేవలం 3 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ విషయంలో బ్యాంకులు చొరవ చూపితే అన్ని విధాలా ఆర్థిక ప్రగతికి చేయూత ఇచ్చినట్లుగా ఉంటుంది. 2,62,216 టిడ్కో ఇళ్ల (ఫ్లాట్లు)కు సంబంధించి బ్యాంకులు చొరవ చూపి రుణాలు మంజూరు చేస్తే, సమస్య పరిష్కారం అవుతుంది.   
 
వ్యవసాయానికి మరిన్ని రుణాలు  
► వ్యవసాయ స్వల్పకాలిక పంట రుణాలలో తొలి ఆరు నెలల్లోనే 51.57 శాతం పంపిణీ చేశాయి. అయితే వ్యవసాయ దీర్ఘకాలిక రుణాల్లో వ్యవసాయ మౌలిక వసతులకు సంబంధించి 35.33 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళికలో 37.31 శాతం మాత్రమే రుణాలివ్వడం నిరాశాజనకం. ఈ రెండింటిలో రుణాల మంజూరు పెంచడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలి. 
► వార్షిక రుణ ప్రణాళిక తొలి ఆరు నెలల్లో వ్యవసాయ యాంత్రీకరణలో 9.08 శాతం, పాడి రంగానికి 24.29 శాతం, మొక్కలు నాటడం, చెట్లు పెంచడానికి 4.52 శాతం, ఉద్యాన పంటల సాగు, చేపల పెంపకానికి 14.84 శాతం రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. 
► బ్యాంకులు నిర్దేశించుకున్న నికర రుణ మొత్తంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు (గత ఏడాది 42.50 శాతం) ఈ ఏడాది 38.48 శాతానికే పరిమితమయ్యాయి. దీనిపై దృష్టి పెట్టాలి. అర్హులైన రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (కేసీసీ)లను ఆర్బీకేల స్థాయిలో వెంటనే జారీ చేయాలి.  
► ఈ–క్రాప్‌ ఆధారంగా కౌలు రైతులకు కూడా రుణాలు అందాలి. రా>ష్ట్రంలో దాదాపు ఇంకా 4,240 ఆర్బీకేలలో బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ మేరకు కరెస్పాండెంట్లను నియమించాలి. 
 
వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నాం 
► వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు చేస్తూ, జాతీయ స్థాయి ప్రమాణాలు సాధించే దిశగా చర్యలు చేపట్టాం. రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి. కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రులు, మరో 16 నర్సింగ్‌ కాలేజీలు కడుతున్నాం. 
► ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక టీచింగ్‌ ఆస్పత్రి, నర్సింగ్‌ కాలేజీ ఉంటుంది. వాటిలో తగిన సంఖ్యలో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది ఉంటారు. ఇందు కోసం మొత్తం రూ.12,243 కోట్లు అవసరం కాగా, కొంత రుణం ఇవ్వడానికి నాబార్డు ముందుకు వచ్చింది. ఇంకా దాదాపు రూ.9 వేల కోట్ల నిధులు కావాలి. 
► ప్రాథమిక ఆరోగ్య రంగంలో కూడా సమూల మార్పులు చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకొస్తున్నాం. 108, 104 సర్వీసులు ఏర్పాటు చేశాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉంటాయి. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉంటారు. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌ ఉంటుంది. పీహెచ్‌సీల వైద్యులు ఒక్కో రోజు ఒక్కో గ్రామం సందర్శించి సేవలందిస్తారు. ఆ విధంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ వస్తోంది. 
► ఆరోగ్యశ్రీ పథకంలో 2,432 వైద్య, చికిత్స ప్రక్రియలు చేర్చాం. ఈ పథకం కింద ఇకపై పీహెచ్‌సీలలో కూడా చికిత్స పొందవచ్చు. 
 
విద్యా రంగానికి చేయూత ఇవ్వాలి 
► విద్యా రంగంలో నాడు–నేడు ఫర్నీచర్, గ్రీన్‌ బోర్డులు, క్లీన్‌ డ్రింకింగ్‌ వాటర్, టాయిలెట్‌ విత్‌ రన్నింగ్‌ వాటర్, పెయింటింగ్, ప్రహరీ, కిచెన్, ఇంగ్లిష్‌ ల్యాబ్‌ వంటి సదుపాయాలు కల్పించాం. ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్సీ సిలబస్‌ తీసుకొచ్చాం. 15,715 స్కూళ్లను తొలి దశలో రూ.3,500 కోట్లతో సమూలంగా మార్చాం.  
► మొత్తం మూడు దశల్లో అన్ని స్కూళ్ల (దాదాపు 57 వేలు)ను సమూలంగా మార్చేస్తాం. ఈ ప్రక్రియలో బ్యాంకులు తమ వంతు సహకారాన్ని అందించాలి. నిజానికి ఇది మానవ వనరుల్లో పెట్టుబడి అని చెప్పొచ్చు.  
 
ఎంఎస్‌ఎంఈల ఓటీఆర్‌ను అమలు చేయాలి 
► రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పలు చర్యలు చేపట్టింది. 2019లో తొలి చర్యగా ఎంఎస్‌ఎంఈల రుణాలను పునర్‌ వ్యవస్థీకరిస్తూ ‘వన్‌ టైమ్‌ రీస్ట్రక్చరింగ్‌’ (ఓటీఆర్‌) ప్రకటించింది.  ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి దాదాపు 8.3 లక్షల రుణ ఖాతాలుంటే, వాటిలో కేవలం 1.78 లక్షల ఖాతాలు.. అంటే 22 శాతం ఖాతాలు మాత్రమే పునర్‌ వ్యవస్థీకరణకు నోచుకున్నాయి. ఈ దృష్ట్యా వీలైనన్ని రుణ ఖాతాలు ఓటీఆర్‌ వినియోగిచుకునేలా చూడాలి. తద్వారా 10 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది.  
► ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన (గత ప్రభుత్వం బకాయి పెట్టినవి కూడా) నాలుగైదేళ్ల రాయితీలను చెల్లించాం. కోవిడ్‌ సమయంలో అండగా నిలిచాం. బ్యాంకులు కూడా సానుకూలంగా ఆలోచించాలి. 
 
చిరు వ్యాపారులకు అండగా నిలవాలి 
► వీధుల్లో చిరు వ్యాపారులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి జగనన్న తోడు పథకం కింద బ్యాంకుల ద్వారా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాం. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారి వడ్డీని ప్రభుత్వమే పూర్తిగా కడుతుంది. 
► రెండు విడతల్లో 7.57 లక్షల మందికి రుణాలు ఇచ్చాయి. స్త్రీ నిధి ద్వారా కూడా వారికి రుణాలు ఇస్తున్నాం. ఈ పథకంలో వచ్చే దరఖాస్తులను బ్యాంకులు వీలైనంత త్వరగా పరిష్కరించి, రుణాలు మంజూరు చేయాలి. ఈ పథకంలో మొత్తం 9.01 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు.  
► 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మంది వలంటీర్లు నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏ) తగ్గించడంలో మీకు తోడుగా నిలుస్తారు. 
 
మహిళల జీవనోపాధి పెంపునకు సహకారం  
► ఆసరా, చేయూత పథకాల ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చే నాటికి స్వయం సహాయక బృందాలలో 18.36 శాతం ఎన్‌పీఏలు ఉండేవి. వారికి వివిధ పథకాల ద్వారా తోడుగా నిలబడడంతో వారి రుణాలు, ఎన్‌పీఏ ఒక శాతం కంటే తక్కువ (0.73శాతం)గా ఉంది.  
► మహిళలకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సహాయం చేస్తున్నాం. వారికి ఉపాధి లభించేలా సొంత వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం మల్టీ నేషనల్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ చర్యల వల్ల ఇవాళ రాష్ట్రంలో 3.50 లక్షలకు పైగా మహిళలు వ్యాపారాల (కిరాణం దుకాణాలు) ద్వారా నెలకు రూ.7,500 నుంచి రూ.14 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. 
► గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థను కొన్ని జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించామని, దశల వారీగా విస్తరిస్తామని బ్యాంకర్లు సీఎంకు వివరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top