144 ఆక్సిజన్‌ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నాం: సీఎం జగన్‌

CM Jagan Virtually Launches 144 Oxygen Plants Across Andhra pradesh - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌  మాట్లాడుతూ.. 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నామని​ తెలిపారు. 100 పడకలు ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లపై 30 శాతం సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు.

సొంతంగా ఆక్సిజన్‌ సరఫరా చేసేలా చర్యలు
ప్రతి ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ సౌలభ్యం అందిస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు. ఒక్కో ప్లాంట్‌లో నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. అదేవిధంగా కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ విమానాల్లో తెచ్చుకోవాల్సిన పరిసస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం మనమే సొంతంగా ఆక్సిజన్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. కోవిడ్‌ పరిస్థితుల్లోనూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.

విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌
రూ.20కోట్ల వ్యయంతో ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ ఐఎస్‌ఓ కంటైనర్లు కొనుగోలు చేశామని సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 24,419 బెడ్‌లకు ఆక్సిజన్‌ పైప్‌లైన్ల సౌకర్యం కల్పించనున్నామని తెలిపారు. 74 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 163 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 20 అత్యాధునిక ఆర్‌టీపీసీఆర్‌ వైరల్‌(వీఆర్‌డీఎల్‌) ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని సీఎం జగన్‌ చెప్పారు. 80 శాతం మందికి రెండు డోసులు ఇవ్వగలిగామని సీఎం పేర్కొన్నారు. ఇప్పటి వరకు  82 శాతం టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని తెలిపారు. 82 శాతం వ్యాక్సినేషన్‌తో దేశంలో అగ్రస్థానంలో​ ఉన్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 సార్లు డోర్‌ టూ డోర్‌ సర్వే చేశామని తెలిపారు. కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌లో వైద్యశాఖ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎ జగన్‌ పేర్కొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top