‘ఎవరైనా లంచం అడిగితే ఆ నంబర్‌ ఇవ్వాలి’

CM Jagan Review Meeting On implementation Of YSR Cheyutha, Aasara - Sakshi

సాక్షి, అమరావతి : స్వయం ఉపాధి కల్పనలో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వైఎస్సార్‌ చేయూత పథకంలో లబ్ధిదారులకు ఇచ్చే ఆవులు, గేదెల కొనుగోలులో నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఏ ఆవు లేదా గేదె కొనవచ్చు అన్నది మాత్రమే సూచించాలని తుది నిర్ణయం వారికే వదిలేయాలన్నారు. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల అమలుపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  మాట్లాడుతూ.. వైఎస్సార్‌ చేయూత పథకంలో మహిళలకు ఉపాధి కల్పనపై పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నందున ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు. చదవండి: రేపే జగనన్న విద్యా కానుక

ఉపాధి కోరుతున్న మహిళలు నిజంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందాలని ఆశించారు. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలనని ఆదేశించారు. కిరాణా షాపుల నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా, ఎక్కడైనా, ఎవరైనా లంచం అడిగినా, వెంటనే ఫోన్‌ చేసేందుకు వారికి ఒక నెంబరు ఇవ్వాలన్నారు. ఆ నెంబర్‌ను షాపు వద్ద ప్రదర్శించాలని తెలిపారు. వ్యవస్థలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలని, లేకపోతే విశ్వాసం కోల్పోతామని హెచ్చరించారు. లబ్దిదారుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం రాకుండా చూడాలని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న షాపులకు ఒక బ్రాండింగ్‌ తీసుకురావాలని, వాటికి తగిన ప్రాచుర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: మహిళల ఆధ్వర్యంలో పాల సేకరణ కేంద్రాలు       

                                        

అవినీతికి తావునివ్వొద్దు
వైఎస్సార్‌ చేయూత పథకంలో లబ్ధిదారులు ఆవు, గేదె ఏది తీసుకున్నా నాణ్యత ఉండేలా చూసుకోవాలని, ప్రభుత్వం తరపున వెటర్నరీ వైద్యుడి ద్వారా ఆ భరోసా కల్పించాలని సూచించారు. అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాతే వారు ఏ ఆవు లేదా గేదె తీసుకోవాలో సూచించాలని, దీని కోసం ఎస్‌ఓపీ రూపొందించుకోవాలన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం ఏదైనా ఇచ్చినప్పుడు సబ్సిడీ వస్తుందని, అప్పుడే అవినీతికి తెర లేస్తుందన్నారు. కానీ ఇక్కడ సబ్సిడీ లేకుండా లబ్ధిదారులకు నేరుగా నగదు ఇస్తున్నామన్నారు.అందుకే ఎలాంటి అవినీతికి తావు ఉండకూడదని ఆదేశించారు. ఇక పథకంలో ఆవు లేదా గేదె పొందిన వారికి ఆర్బీకేల ద్వారా పశు గ్రాసం కూడా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. పశువుల సేకరణ, వాటికి దాణా, అవసరమైన మందుల పంపిణీ ప్రక్రియలో అమూల్‌ సంస్థ కూడా పాలు పంచుకోవాలని తెలిపారు. చదవండి: 42.43 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

నాణ్యత ముఖ్యం
-మేలుజాతి ఆవులు, గేదెలు మాత్రమే కొనుగోలు చేయాలి. 
-అదే విధంగా నాణ్యతతో కూడిన నిర్వహణ (క్వాలిటీ ఆఫ్‌ మెయింటెనన్స్‌) కూడా ఎంతో ముఖ్యం.
-ఇందులో వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులను కూడా ఇన్‌వాల్వ్‌ చేయండి. 

మేకలు–గొర్రెలు
– మేకలు, గొర్రెలలో ఆడ, మగ రెండూ సేకరించాలి. 
– లబ్ధిదారులకు ఇస్తున్న రూ.75 వేలకు ఎన్ని మేకలు, గొర్రెలు వస్తే అన్నీ తీసుకోవాలి.
– లబ్ధిదారులకు ఒక మగ మేకపోతు లేక గొర్రెపోతు తప్పనిసరిగా ఇవ్వాలి.
– అదే విధంగా ఏ మాంసానికి (మేక లేక గొర్రె) డిమాండ్‌ ఉందో, ఉంటుందో తెలుసుకుని, వాటిని ఎక్కువగా సేకరించాలి.
– ఇంకా ఏది పెంచుకుని, అమ్ముకుంటే ఎక్కువ లాభం ఉంటుందో తెలుసుకుని వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలి.
– మేకలు, గొర్రెల సేకరణలో కూడా పక్కాగా ఎస్‌ఓపీ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.

పథకాలు–లబ్ధిదారులు
అదే విధంగా రాష్ట్రంలో వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా అమలుపై సమీక్షా సమావేశంలో అధికారులు పూర్తి వివరాలు తెలిపారు. పథకంలో ఇప్పుడు 21 లక్షల లబ్ధిదారులు ఉండగా, వారికి రూ.3937 కోట్లు,వైఎస్సార్‌ ఆసరా పథకంలో 87.74 లక్షల లబ్ధిదారులు ఉండగా వారికి రూ.6792 కోట్ల నిధులు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో స్వయం సహాయక బృందాలకు చెందిన 13.03 లక్షల మహిళలు రెండు పథకాల్లో ప్రయోజనం పొందారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 33,486 ఔట్‌లెట్లు (కిరాణా దుకాణాలు) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 8,836 ఔట్‌లెట్లు ఏర్పాటయ్యాయని, మిగిలినవి కూడా ఈ నెలాఖరులోగా ఏర్పాటవుతాయన్న అధికారులు, ఆ తర్వాత వాటి సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పారు.

పాల ఉత్పత్తి
రాష్ట్రంలో రోజూ 412.1 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయన్న అధికారులు, 9,889 గ్రామాల్లో పాల ఉత్పత్తి బాగా ఉందని తెలిపారు. వాటిలోనూ పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న 6,510 గ్రామాల్లో పాల సేకరణకు ఆర్బీకేల వద్ద అదనంగా గదులు నిర్మించాలని ప్రతిపాదించామని, తద్వారా రోజూ 75 లక్షల లీటర్ల పాలు సేకరించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా… ఆ 6510 గ్రామాల్లో 1000 నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యంతో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం మీద రాష్ట్రంలో వచ్చే ఏడాది జూలై 31 నాటికి, బీఎంసీయూల ఏర్పాటుతో పాటు, పాల సేకరణ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వివరించారు.

ఆవులు, గేదెల కొనుగోలు
రాష్ట్రంలో 3.43 లక్షల గేదెలు, 2.20 లక్షల ఆవులు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమావేశంలో ఆ శాఖ అధికారులు వెల్లడించారు. తొలి ఏడాది 40 వేల ఆవులు, 55 వేల గేదెలు, రెండో ఏడాది 1.80 లక్షల ఆవులు, 2.88 లక్షల గేదెలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా 2.97 లక్షల మేకలు, గొర్రెలు సేకరించి పంపిణీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top