భయాలకు తావులేకుండా ప్రాజెక్టును నెలకొల్పారు: సీఎం జగన్‌

CM Jagan Launches Aditya Birla Group Caustic Soda Unit East Godavari Live Updates - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రా‌సిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 'గ్రాసిమ్‌ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ప్రత్యక్షంగా 1300మంది, పరోక్షంగా 1150 మందికి అవకాశం లభిస్తుంది. ఇలాంటి కంపెనీలు రావడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా ఇప్పటికే రాష్ట్రంలో చట్టం చేశాం.

ఈ పరిశ్రమలో టెక్నాలజీలో మార్పు ద్వారా జీరో లిక్విడ్‌ వేస్ట్‌ డిశ్చార్జ్‌ అవుతుంది. భయాలకు తావులేకుండా ప్రాజెక్టును నెలకొల్పారు. గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్‌ సంస్థకు ప్రాజెక్ట్‌ అప్పగించింది. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేసింది. మన ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చేశాం. అవరోధాలను ఒక్కొక్కటిగా తొలగించి ప్రాజెక్టును నెలకొల్పామని సీఎం జగన్‌ అన్నారు.

సీఎం జగన్‌ సహకారం మరవలేం: కుమార మంగళం బిర్లా
బిర్లా గ్రూప్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ ప్రారంభం సందర్భంగా ఆదిత్యా బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను కొనియాడారు. పరిశ్రమలో 75 శాతం మంది స్థానికులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా సుమారు 2,500 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నట్లు వివరించారు. 

భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతికతతో గ్రాసిమ్‌ పరిశ్రమను ఏర్పాటు చేశామని కుమార మంగళం బిర్లా తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సీఎం జగన్‌ సహకారం మరవలేనిదంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే అంతకు ముందు గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్‌ ప్లాంట్‌ను సందర్శించారు.

ఉపాధి అవకాశాలు మెండు 
ఆదిత్య బిర్లా గ్రూపు భారీ స్థాయిలో రూ.2700 కోట్ల పెట్టుబడితో కాస్టిక్‌ సోడా ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూపులో ఒకటైన గ్రాసిమ్‌ కంపెనీ ముఖ్యమంత్రి చొరవతో ఈ ప్లాంట్‌ నిర్మాణానికి ముందుకు రావడంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయని సంతోషపడుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top