CM Jagan Increases Ration Door Delivery Vehicle Rent | రేషన్‌ వాహనదారులకు సీఎం జగన్‌ శుభవార్త - Sakshi
Sakshi News home page

రేషన్‌ వాహనదారులకు సీఎం జగన్‌ శుభవార్త

Feb 6 2021 3:36 AM | Updated on Dec 8 2022 12:49 PM

CM Jagan‌ Good news for ration‌ door delivery drivers - Sakshi

సాక్షి, అమరావతి: ‘ఇంటింటా రేషన్‌ పంపిణీ’ కోసం వినియోగిస్తున్న మొబైల్‌ వాహనదారులకు మరింత ఆదాయం కల్పించేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్క వాహనదారుడికీ ప్రస్తుతం అద్దె కింద రూ.10 వేలు, పెట్రోల్‌ నిమిత్తం రూ.3 వేలు, హెల్పర్‌ చార్జీల కోసం రూ.3 వేలు కలిపి నెలకు మొత్తం రూ.16 వేలు చెల్లిస్తున్నారు. అయితే, వారు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం అద్దెను రూ.10 వేల నుంచి రూ.13 వేలకు, వాహనదారుడి సహాయకుడికి చెల్లించే హెల్పర్‌ చార్జీలను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించింది. పెట్రోల్‌ కోసం గతంలో మాదిరే రూ.3 వేలు చెల్లిస్తారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కో వాహనదారుడికి నెలకు రూ.5 వేల చొప్పున అదనంగా అందుతుంది. అయితే, వాహనాన్ని శుభ్రంగా ఉంచారా లేదా అనే విషయాన్ని తహసీల్దార్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తారు. వాహనం శుభ్రంగా లేకపోతే అదనంగా చెల్లిస్తున్న మొత్తంలో కోత విధించేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. 


9,260 మందికి లబ్ధి
రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన 9,260 మందికి ప్రభుత్వం సబ్సిడీపై మొబైల్‌ వాహనాలను సమకూర్చింది. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2,300, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 700, బీసీ కార్పొరేషన్‌ ద్వారా 3,800, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 660, ఈబీ (ఎకనామికల్లీ బ్యాక్‌వార్డ్‌) కార్పొరేషన్‌ ద్వారా 1,800 మందికి వాహనాలను అందజేశారు. ఒక్కో యూనిట్‌ «(వాహనం) ధర రూ.5,81,000 కాగా, అందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.3,48,600 అందింది. బ్యాంక్‌ లింకేజీ ద్వారా రూ.1,74,357 మంజూరు చేయగా, లబ్ధిదారుని వాటా కేవలం రూ.58 వేలే. బ్యాంకు లింకేజీ రుణం చెల్లించేందుకు వీలుగా పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా అద్దె చెల్లించే విధంగా వీటిని సమకూర్చారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 9,260 మంది వాహనదారులకూ రూ.5 వేల చొప్పున అదనంగా లబ్ధి కలగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement