గొప్పల కోసం పథకాలు, వ్యవస్థల పేరు మార్పులు
ప్రతి అడుగులోనూ క్రెడిట్ చోరీ చేస్తున్న సీఎం చంద్రబాబు
పరిపాలనను వికేంద్రీకరిస్తూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చి న నాటి సీఎం వైఎస్ జగన్
వలంటీర్లతో కలిసి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు
అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి ఈ వ్యవస్థపై బాబు అక్కసు
ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాలన్నీ విజన్ యూనిట్లుగా మార్పు
పేరైతే మార్చారు గానీ సచివాలయాలు ఒక విజన్‌తో పెట్టినవని అంగీకరించిన చంద్రబాబు
ఇప్పటికే అమ్మ ఒడి, రైతు భరోసా, నాడు–నేడు, దిశా యాప్, విద్యా కానుక పేర్ల మార్పు
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా 143 హామీల అమలులో ఘోర వైఫల్యం
సాక్షి, అమరావతి: ఏమార్చి.. పేరు మార్చి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. అమ్మ ఒడి నుంచి గూగుల్ డేటా సెంటర్ వరకూ అదే తీరు. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్లుగా పేరు మార్చి.. వాటిని తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఇచ్చిన 143 హామీల అమల్లో ఘోరంగా విఫలమైన చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, ప్రారంభించిన వ్యవస్థల పేర్లు మార్చి.. వాటిని తానే ప్రారంభించినట్లు గొప్పులు చెప్పుకోవడానికి తహతహలాడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందించాలనే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబర్ 2న నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిదే. దేశ చరిత్రలో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు.

ఒకే నోటిపికేషన్‌తో 1.34 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను నియమించారు. అంతకు ముందే అంటే 2019 ఆగస్టు 15న వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా నాలుగున్నరేళ్లలో ప్రజల ఇంటి గుమ్మం వద్దకే 12 కోట్ల ప్రభుత్వ సేవలను అందించారు.
సచివాలయ వ్యవస్థపై దేశ వ్యాప్త ప్రశంసలు
కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో రాష్ట్రంలో ప్రజలకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు అందించిన సేవలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. సచివాలయ వ్యవస్థ పనితీరును కేంద్రం, పలు రాష్ట్రాల అధికారుల బృందాలు పరిశీలించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడానికి కుట్ర పన్నారు. ఈ క్రమంలోనే విత్తనం నుంచి విక్రయం వరకూ రైతులకు చేదోడువాదోడుగా నిలిచే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు.
వాటి పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చి దిష్టిబొమ్మల్లా తయారు చేశారు. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.పది వేలకు పెంచుతామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఏకంగా వలంటీర్లను తొలగించి వెన్నుపోటు పొడిచారు. గ్రామ, వార్డు సచివాలయాలను అనవసరంగా ఏర్పాటు చేశారని.. వాటిలో నియమించిన ఉద్యోగుల వేతనాల భారం పెరిగి పోయిందని అక్కసు వెళ్లగక్కారు.
ఆ తర్వాత మోంథా తుపానును గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రశంసిస్తూ.. ఇప్పుడు ఆ వ్యవస్థను తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి వాటి పేర్లను విజన్ యూనిట్లుగా మార్చుతామని ప్రకటించారు.
‘అమ్మ ఒడి’ విషయంలోనూ అంతే..
» తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించే సమయంలో అది మంత్రి నారా లోకేశ్ ఆలోచన నుంచి పుట్టిందంటూ గొప్పలు పోయారు. వాస్తవానికి వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మ ఒడి పథకానికే పేరు మార్చి అమలు చేస్తున్నారని విద్యార్థులు, తల్లితండ్రులే ఎలుగెత్తిచాటారు.
» వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలను రద్దు చేయం అని, వాటిని అంతకంటే గొప్పుగా అమలు చేస్తామని.. అదనంగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలను కూడా అమలు చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక జగన్ అమలు చేసిన పథకాల పేర్లు మార్చారు. మరి కొన్ని రద్దు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలను గాలికొదిలేశారు.
» వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కృషి వల్ల విశాఖపట్నంలో గూగుల్‌తో కలిసి డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థ నడుం బిగించింది. ఇప్పుడు ఆ డేటా సెంటర్ తన వల్లే విశాఖకు వచ్చి ందంటూ సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు.
» వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించి, ఏడు కాలేజీలను అప్పట్లోనే పూర్తి చేశారు. తరగతులు కూడా ప్రాంభమయ్యాయి. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగిస్తూ అదే తన ఘనతగా చెప్పుకుంటుండటం కొసమెరుపు.


