డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు
ఇకపై విజన్ యూనిట్లుగా పని చేస్తాయని వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మారుస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై ఇవి విజన్ యూనిట్లుగా పని చేస్తాయని అన్నారు. గురువారం ఆయన సచివాలయంలో మంత్రులు, శాఖల ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో డేటా ఆధారిత పాలనపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరైనా కొన్ని శాఖలు ప్రజలు సంతృప్తి చెందేలా పని చేయడం లేదని అన్నారు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. ఆర్టీసీలో పారిశుద్ధ్యంతో పాటు రెవెన్యూ, మున్సిపల్ సేవల్లో ప్రజల్లో సంతృప్తి పెరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. వచ్చే నెల రెండో వారం నాటికి ఏ శాఖ పని తీరు ఎలా ఉందో పరీక్షిస్తామన్నారు.
డేటా ఆధారిత రియల్ టైమ్ పాలన
ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా పని చేయాలని సీఎం అన్నారు. రాష్ట్ర పౌరులందరి డేటా క్రోడీకరించామని, ప్రతి కుటుంబం యూనిట్‌గా గృహాలను జియో ట్యాగింగ్ చేశామన్నారు. డేటా ఆధారిత రియల్ టైమ్ పాలన ఉంటుందని, ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలన్నారు.
రూల్స్ ప్రకారం జీవోలు ఇవ్వక పోవడం వల్లే న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను వదిలేస్తున్నామని, కాశీబుగ్గ ఆలయానికి అంత మంది భక్తులు వస్తే తెలియక పోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆలయాలు, పరిశ్రమలు, రవాణా.. ఎక్కడా ఎస్‌వోపీలను పాటించడం లేదన్నారు.


