
2 ఎకరాల్లో కుప్పంలో ఆధునిక భవంతి: ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి చంద్రబాబు కుప్పంలో రెండు ఎకరాల్లో నిర్మించుకున్న ఆధునిక భవంతి
ఏడాది పాలనలో చంద్రబాబు సొంత సంపద సృష్టి
కుప్పంలో ఆధునాతన భవంతి
సూపర్ సిక్స్ హామీల అమలుకు ఖజానా లేదని గగ్గోలు
ఆడబిడ్డ నిధికి మంత్రివర్గం చెల్లుచీటీ
అమరావతిలో ఇటీవల రూ.200 కోట్ల విలువైన స్థలంలో భవంతి నిర్మాణానికి శ్రీకారం.. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో రూ.వందల కోట్ల విలువైన నివాస భవనం... మదీనాగూడలో ఐదెకరాల ఫామ్ హౌస్
సాక్షి, అమరావతి: ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎం చంద్రబాబు మరో రికార్డు సాధించారు! ఏడాదిగా సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలు ఏ ఒక్కటీ అమలు చేయని ఆయన తనకోసం ఈసారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ ఆధునిక భవనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, మదీనాగూడలో విలాసవంతమైన భారీ ప్యాలెస్, ఫామ్‌హౌస్‌లను ఏర్పాటు చేసుకున్న ఆయన తాజాగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ పరిధిలోని శివపురంలో రెండు ఎకరాల్లో నిర్మించుకున్న నూతన గృహం ఆధునిక భవంతిని తలపిస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఇక ఇటీవలే అమరావతి ప్రాంతంలో 5.16 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతంగా మరో నూతన గృహ నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, పరిపాలనా నగరానికి ఆనుకుని ఉన్న ఈ ప్యాలెస్‌ను నిర్మించే బాధ్యతను తనకు అత్యంత సన్నిహితుడికి చెందిన కంపెనీకి అప్పగించారు. ఈ భూమి విలువ రూ.200 కోట్ల పైమాటేనని చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఉండవల్లిలోని కరకట్ట అక్రమ భవంతిని చంద్రబాబు తన నివాసంగా చేసుకున్న విషయం తెలిసిందే.
