పెట్రోల్, డీజిల్‌ సమస్య మన వల్ల రాలేదని చెప్పండి | Chandrababu meeting ap ministers on petrol and diesel shortage in andhra pradesh | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్‌ సమస్య మన వల్ల రాలేదని చెప్పండి

May 1 2026 4:25 AM | Updated on May 1 2026 4:25 AM

Chandrababu meeting ap ministers on petrol and diesel shortage in andhra pradesh

కేబినెట్‌ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, మంత్రులు

మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం 

రాజధాని కాంట్రాక్టర్ల కోసం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన అంశంపై చర్చ 

ఇతర రాష్ట్రాల్లోనూ ఆయిల్‌ కొరత ఉందని ప్రచారం చేయాలని సూచన 

ఆయిల్‌ కంపెనీలకు రాసిన లేఖలు, కేంద్రం ఆదేశాలు బయటకు ఎలా వచ్చాయని మల్లగుల్లాలు 

గూగుల్‌ డేటా సెంటర్‌ క్రెడిట్‌ మొత్తం మనకే దక్కేలా మీడియా సమావేశాల్లో చెప్పాలని సూచన  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమన్న వాస్తవం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ప్రభుత్వం దాన్నుంచి తప్పించుకొనేందుకు మల్లగుల్లాలు పడుతోంది. రాజధాని కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల కారణంగానే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ కొరత వచ్చిందన్న విషయం కేంద్ర ప్రభుత్వ లేఖలతో బయటపడింది. వారం రోజులుగా రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేస్తున్న పెట్రోల్‌ డీజిల్‌ కొరత వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఊరూవాడా తెలిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే రాజకీయ అంశాలపై మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ కొరత పెద్ద అంశంగా మారిందని, ఉన్నట్టుండి ఈ సమస్య రావడానికి ప్రభుత్వమే కారణమనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం. రాజధాని పనులు చేసే కాంట్రాక్టర్లకు రిటైల్‌ ధరలో బల్‌్కగా ఆయిల్‌ సరఫరా చేయాలని కంపెనీలను ఒత్తిడి చేయడం ద్వారా ప్రభుత్వమే ఈ సమస్య సృష్టించిందని ప్రజల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చను కొంతవరకైనా నివారించాలంటే మంత్రులు మాట్లాడాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. పెట్రోల్, డీజిల్‌ సమస్య ప్రభుత్వం వల్ల రాలేదని చెప్పాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఆయిల్‌ కంపెనీల వల్లే ఈ సమస్య వచ్చిందని, ఇందులో ప్రభుత్వం తప్పు లేదని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరినట్లు తెలిసింది.

ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయిల్‌ కొరత ఉందని బలంగా ప్రచారం చేయాలని, అప్పుడే ప్రజలు కొంత శాంతిస్తారని చెప్పినట్లు సమాచారం. రాజధాని పనులకు అవసరమైన ఆయిల్‌ సరఫరా చేయాలని కేంద్రానికి రాసిన లేఖలు, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలు, ఆయిల్‌ కంపెనీలకు ప్రభుత్వం రాసిన లేఖల వివరాలు బయటకు ఎలా వెళ్లాయనే అంశంపైనా చర్చ జరిగింది. ఈ వివరాలన్నీ బయటకు వెళ్లడం వల్ల ఇబ్బంది వచ్చిందని, ఇలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా చూడాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం.

9 మంది మంత్రులు ఒకేసారి సింగపూర్‌ పర్యటనకు వెళ్లడం, విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు, రాజధాని నిర్మాణాలకు అంచనాలకు మించి భారీ రేట్లతో పనులు చేస్తున్న అంశాలపై మంత్రులు స్పందించాలని చెప్పినట్లు తెలిసింది. ఎంత చెప్పినా కొందరు మంత్రులు ఇలాంటి విషయాలపై మాట్లాడటంలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ తమ వల్లే వచ్చిందని వైఎస్సార్‌సీపీ చెబుతోందని, దాని క్రెడిట్‌ మొత్తం టీడీపీకే దక్కేలా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు.  

మంత్రులు, అధికారులు, ఉద్యోగులే నిజమైన విజేతలు: సీఎం
టీమ్‌ ఏపీ పనితీరు వల్లే తనకు బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2025 అవార్డు వచ్చిందని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులే నిజమైన విజేతలని సీఎం చంద్రబాబు అన్నారు. బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు వచ్చిన సందర్భంగా చంద్ర­బాబు గురువారం మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్ర­టరీలు, హెచ్‌వోడీలకు ఆత్మీయ విందు ఇచ్చారు. వివిధ శాఖల్లో మంచి పనితీరు కనబరి­చిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా విందుకు ఆహ్వానించారు. తొలుత మంత్రులు, వివిధ శాఖల ఉన్నతా­ధి­కారులతో సీఎం సమా­వేశమై రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా చేపట్టా­ల్సిన కార్యక్రమాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement