చంద్రబాబే యమకింకరుడు! | chandrababu govt negligence taken more peoples Died: Andhra pradesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబే యమకింకరుడు!

Jun 24 2025 3:51 AM | Updated on Jun 24 2025 3:51 AM

chandrababu govt negligence taken more peoples Died: Andhra pradesh

పుష్కరాల్లో తొక్కిసలాట సమయంలో మృతదేహాలను పేర్చిన దృశ్యం(ఫైల్‌)

బాబు ‘పాద’ఘట్టంతో సామాన్యుల ప్రాణాలు బలి

బాబు ప్రచార ఆర్భాటానికి గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి 

కందుకూరు ఇరుకు రోడ్డులో 8 మందిని బలిగొన్న వైనం.. గుంటూరు చీరల పంపిణీలో ముగ్గురు మహిళల ప్రాణాలు హరీ 

అవన్నీ చంద్రబాబు పరోక్షంగా చేసిన హత్యలే 

తిరుపతిలో ఆరుగురు భక్తులను, సింహాచలంలో ఏడుగురిని బలిగొన్న బాబు ప్రభుత్వం

గతంలో చంద్రబాబు కాన్వాయ్‌ ఢీకొని ఇద్దరు మృతి

వాటిపై కేసులు పెడితే బాబు యావజ్జీవం జైల్లోనే  

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రచార కండూతికి గోదారమ్మ సాక్షిగా 29 మంది భక్తుల ప్రాణాలు బలి...! టీడీపీ అధినేత సభలకు జనం వెల్లువెత్తినట్లు చూపించే కనికట్టుకు 8 మంది అమాయకులు హరీ...! బాబు సభలో చీరల పంపిణీకి మహిళలు భారీగా వచ్చారని నమ్మించే మాయాజాలానికి ముగ్గురు మృత్యువాత... చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో తిరుపతిలో ఆరుగురు.. సింహాచలంలో ఏడుగురు దైవ సన్నిధిలో దుర్మరణం.  

ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ‘పాద’ఘట్టం కింద నలిగిపోయిన ప్రాణాలు అనేకం..! గతంలో చంద్రబాబు కాన్వాయ్‌ ఢీకొనిఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రభుత్వ వైఫల్యాలతో అర్ధాంతరంగా ముగిసిన జీవితాలు ఎన్నో..! కానీ అవి ఏదో ప్రమాదవశాత్తూ జరిగిన దుర్ఘటనలు కావు. పరోక్షంగా చంద్రబాబు చేసిన హత్యలే!! అందుకు బాధ్యుడిని చేస్తూ హత్యానేరం కింద కేసులు పెడితే ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు అడుగు పెడితే చాలు... యమపాశం పట్టుకుని యమకింకరుడు వచ్చినట్టుగా సామాన్యులు హడలిపోయే పరిస్థితులు కల్పించిన ఆ ఉదంతాలు ఇవిగో..

పుష్కరాల్లో తొక్కిసలాట సమయంలో మృతదేహాలను పేర్చిన దృశ్యం(ఫైల్‌)

గోదావరి పుష్కరాలు... 
బాబు ప్రచార దాహానికి 29 మంది బలి చంద్రబాబుకు లేని జనాదరణ ఉన్నట్టు... ఆయన వస్తే జనం భారీగా తరలి వస్తారని మభ్యపుచ్చేందుకు వేసిన ఎత్తుగడ గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొంది. 2015 గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిరోజు భారీగా వచ్చే భక్తులు కేవలం తనను చూసేందుకు వస్తున్నట్లు డ్రోన్‌ కెమెరాలతో వీడియోలు చిత్రీకరించి కనికట్టు చేయాలని చంద్రబాబు భావించారు. తమ ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌కు ఈ ప్రత్యేక కాంట్రాక్టు అప్పగించారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమైన 2015 జూలై 15 ముందు రోజు అంటే 14వతేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్‌కు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

నాటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు పుష్కర ఘాట్ల గేట్లను మూసివేశారు. మరోవైపు వేలాది మంది భక్తులు రాత్రంతా పుష్కర ఘాట్‌లో పడిగాపులు కాశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి తదితరులు జూలై 15న ఉదయం 8 గంటలకు పుష్కర ఘాట్‌లో స్నానానికి వచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం వారు స్నానాలు ఆచరించిన వెంటనే ఘాట్‌ వద్ద ఒక్క గేటును మాత్రమే అధికారులు హఠాత్తుగా తెరిచారు. పెద్ద సంఖ్యలో తోసుకుని వచ్చే భక్తులు చంద్రబాబు కోసం వస్తున్నట్టుగా డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించి ప్రచారం చేసుకోవాలని కుట్ర పన్నారు.

రాత్రంతా వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా రావడంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుని 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి ఇన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇదేమీ ప్రమాదవశాత్తూ జరిగింది కాదు. పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈ విషాదం చోటు చేసుకుంది. అంటే ఇవన్నీ ఆయన చేసిన హత్యలే! మరి ఆనాడు చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు పెట్టారా...? దీనిపై విచారణకు నియమించిన కమిటీ కాలయాపన చేయడం మినహా భక్తుల దుర్మరణానికి కారకుడైన చంద్రబాబును బాధ్యుడిని చేసిందా?  

కందుకూరులో తొక్కిసలాట క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం (ఫైల్‌)  
ఎన్నికల ప్రచార ఆర్భాటానికి ఎనిమిది ప్రాణాలు హరీ..! 
పోలీసులు వారించినా కందుకూరు ఇరుకు రోడ్డులో సభ
తన సభలకు జనం రావడం లేదన్న వాస్తవం చంద్రబాబును తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. కొందరి ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.. తన కార్యక్రమాలకు జనం భారీగా వచ్చినట్టుగా నమ్మించాలని ఆయన ఎత్తుగడ వేశారు. దీని ఫలితం.. కందుకూరులో 8 మంది సామాన్యుల మృత్యువాత! 2022 డిసెంబరు 29న చంద్రబాబు ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. తన కార్యక్రమానికి భారీగా జనం వచ్చినట్లు చూపించాలని ఉద్దేశపూర్వకంగా ఓ ఇరుకైన రోడ్డులో సభ నిర్వహించారు. ఆ రోడ్డులో సభ నిర్వహించవద్దని పోలీసులు ఎంత వారించినా టీడీపీ నేతలు ఖాతరు చేయలేదు.

ఆ రోడ్డుకు ఇరువైపులా చంద్రబాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో మరింత ఇరుకుగా మారిపోయింది. కనీసం చంద్రబాబు ప్రసంగించే వాహనాన్ని అయినా ఆ రోడ్డు వద్ద వెడల్పుగా ఉన్న జంక్షన్‌లో నిలపాలని పోలీసులు సూచించినా పట్టించుకోలేదు. ఆ ఇరుకైన రోడ్డులోకే చంద్రబాబు వాహనాన్ని హఠాత్తుగా తీసుకెళ్లారు. దాంతో అలజడి రేగి తొక్కిసలాట జరిగింది. జనం పక్కన ఉన్న కాలువలో ఒకరిపై ఒకరు పడిపోయారు. అమాయకులు మృత్యువాత పడ్డారు. చంద్రబాబు సభకు జనం భారీగా వచ్చినట్టు చూపించేందుకు వేసిన ఎత్తుగడ 8 మందిని బలితీసుకుంది. మరి దీన్ని దుర్ఘటన అంటారా...? చంద్రబాబు చేసిన హత్యలే కదా!! మరి అందుకు ఆయనపై హత్యానేరం కింద కేసు పెట్టాలి కదా? అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  

తిరుపతి తొక్కిసలాటలో కింద పడిన భక్తులు   
తిరుపతిలో ఆరుగురు భక్తుల దుర్మరణం
చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో ఎనిమిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. దాదాపు ఏడు లక్షల మంది భక్తులు తరలి వచ్చే వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీకి సంబంధించి కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఈ ఏడాది జనవరి 9వతేదీ తెల్లవారు జామున ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించగా ముందు రోజు మధ్యాహ్నం నుంచే భక్తులు భారీగా తిరుపతి చేరుకున్నారు.

వేచి ఉండేందుకు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో తీవ్ర చలిలో రోడ్లపైనే గంటల తరబడి నిరీక్షించారు. రాత్రి 8 గంటల సమయంలో టికెట్లు జారీ చేస్తున్నామంటూ హఠాత్తుగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.    

2018 మార్చి 31న వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్ట రాముల వారి కల్యాణం సందర్భంగా టెంపరరీ షెడ్‌ గాలికి కుప్ప కూలిన ఘటనలో నలుగురు మృతి చెందగా 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

తొక్కిసలాటలో మరణించిన మహిళ (ఫైల్‌)  

గుంటూరులో చీరలు పంపిణీ... ముగ్గురు మహిళలు మృత్యువాత
చంద్రబాబు తన ప్రచారార్భాటంతో మహిళలనూ వదిలిపెట్టలేదు. 2023 జనవరి 1న గుంటూరులో ఆయన సభ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ పేరిట కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున చీరలు పంచుతామంటూ మహిళలను తరలించి కొద్దిమందికి మాత్రమే ఇచ్చి ఆ కార్యక్రమం ముగిస్తున్నట్టు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ నేతలు  ప్రకటించారు. దాంతో ఉన్న కొద్ది చీరలు తీసుకునేందుకు మహిళలు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట సంభవించింది. చంద్రబాబు ప్రచారార్భాటం కోసం వేసిన చీప్‌ ట్రిక్‌తో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరి ఆ రోజు ముగ్గురు మహిళల మృతికి చంద్రబాబును బాధ్యుడిగా చేస్తూ ఆయనపై హత్యానేరం నమోదు చేయాలి కదా? అని పరిశీలకులు ప్రశి్నస్తున్నారు.  

అప్పన్న చందనోత్సవంలో తీవ్ర నిర్లక్ష్యం... ఏడుగురు భక్తుల దుర్మరణం
పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపశృతులు చోటు చేసుకుంటున్నా... దైవ సన్నిధిలో భక్తుల ప్రాణాలు పోతున్నా చంద్రబాబు సర్కారు అదే నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించింది. సింహాచలం లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా నాసిరకంగా నిరి్మంచిన గోడ కుప్ప కూలడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు.  

గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే  బాబు గద్దింపు ఇదీ..!
ఏం కుంభమేళాలో చనిపోవడం లేదా..?  
జగన్నాధ రథ యాత్రలో చనిపోవడం లేదా..? 
యాక్సిడెంట్లలో చనిపోవడం లేదా...?  

బాబు కాన్వాయ్‌ ఢీకొని ఇద్దరు మృతి
గతంలో చంద్రబాబు కాన్వాయ్‌ ఢీకొని ఇద్దరు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. 2015 జూలై 15న నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌ ఢీకొని పోలవరం పంచాయతీ యడ్లగూడెంకు చెందిన యడ్లపాటి మంగమ్మ (70) మృతి చెందింది. 2016 ఫిబ్రవరి 17న సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ వాహనం ఢీకొని విజయవాడలో నాగేంద్ర వరప్రసాద్‌ అనే ఉద్యోగి మృతి చెందారు. యనమలకుదురుకు చెందిన ఆయన సైకిల్‌పై కార్యాలయానికి వెళ్తుండగా వేగంగా వచ్చిన చంద్ర బాబు కాన్వాయ్‌ బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలైన వరప్రసాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement