చరమ‘గీతమే’ లక్ష్యంగా ఏయూ ఖజానాకు బాబు చిల్లు | Chandrababu Govt Looting University Funds: Andhra pradesh | Sakshi
Sakshi News home page

చరమ‘గీతమే’ లక్ష్యంగా ఏయూ ఖజానాకు బాబు చిల్లు

Apr 29 2026 5:37 AM | Updated on Apr 29 2026 5:37 AM

Chandrababu Govt Looting University Funds: Andhra pradesh

రూ. 300 కోట్లు లాగేసుకున్న ప్రభుత్వం

రూ.150 కోట్ల చొప్పున 2 విడతల్లో ప్రభుత్వ ఖజానాకు జమ  

పాలకవర్గం అనుమతి లేకుండానే వ్యవహారం నడిపిన వీసీ  

జీతాలకూ చెల్లింపులు నిలిపేసిన ప్రభుత్వం 

రూ.200 కోట్ల మేర ఏయూ ఖజానా నుంచే చెల్లింపులు 

శతాబ్ది ఉత్సవాల ఖర్చూ వర్సిటీదే.. ఏయూను ఆర్థికంగా దివాలా తీయించేందుకు ప్రభుత్వ ఎత్తుగడలు  

గీతంకు మేలు చేకూర్చేలా ప్రభుత్వ వ్యవహారం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకవైపు ప్రతి మంగళవారం వేలకు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... మరోవైపు విశ్వవిద్యాలయాల నిధులను కూడా దోచేస్తోంది. శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఖజానాకు ఎసరు పెట్టింది. ఏకంగా రూ.300 కోట్ల మేర ఏయూ నిధులను చంద్రబాబు ప్రభుత్వం కాజేసింది. ఏయూ నిధులు రూ.150 కోట్లు చొప్పున రెండు విడతల్లో రాష్ట్ర ఖజానాకు చంద్రబాబు ప్రభుత్వం జమ చేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి యూనివర్సిటీకి సంబంధించిన ఏ నిర్ణయాలనైనా పాలకవర్గం (ఈసీ) నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

అయితే గీతంలో పనిచేసి, గీతం వలన ఏయూ వీసీగా వచ్చిన రాజశేఖర్‌కు ఇవేవీ లెక్కలోలేవనే విమర్శలున్నాయి. ఈసీతో పనిలేకుండానే నేరుగా ఆయన ఏయూ నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించినట్టు సమాచారం. ఇప్పటికే యూనివర్సిటీ ఉద్యోగులు, ప్రొఫెసర్ల వేతనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. దీంతో ఏయూ ఖజానా నుంచే వేతనాలను చెల్లిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికే రూ.200 కోట్లను వర్సిటీ వేతనాలకు వినియోగించింది.

 ఇక నూరేళ్ల చరిత్రను పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు సైతం ప్రభుత్వం పైసా విదల్చలేదు. ఇందుకోసం కూడా సుమారు రూ.63.5 కోట్లను వర్సిటీ ఖజానా నుంచే వెచ్చించినట్లు సమాచారం. ఈ విధంగా వర్సిటీ ఖజానాను ఖాళీ చేయడం ద్వారా ఏయూలో అభివృద్ధి లేకుండా చూడాలనే పన్నాగం ఒకటి అమలవుతోందన్న ఆరోపణలున్నాయి. అంతిమంగా గీతం అనే ప్రైవేటు యూనివర్సిటీకి లబ్ధి చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఏయూను ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

శతాబ్ది ఉత్సవాలకు పైసా విదల్చని ప్రభుత్వం
1926 నుంచి 2026కు నూరేళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా ఏయూలో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఏడాది కాలంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అయితే ఇందుకోసం ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదు. పైగా శతాబ్ది ఉత్సవాలకు వెచ్చించిన రూ.63.5 కోట్లను ఏయూ ఖజానా నుంచే ఖర్చు చేశారు. అంతేగాకుండా కొద్దిరోజుల కిందట మరో రూ.300 కోట్లను ప్రభుత్వం లాగేసుకుంది. మరోవైపు ఉద్యోగుల జీతాలను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో రూ.200 కోట్ల మేర ఏయూ ఖజానా నుంచే చెల్లించారు.

వెరసి ఇప్పుడు ఏయూ ఖజానా డొల్లగా మారింది. ఒకవైపు ఏయూ ఖజానాను కొల్లగొడుతున్న చంద్రబాబు.. శతాబ్ది ఉత్సవాల్లో మాత్రం రూ.500 కోట్లు కేటాయిస్తానంటూ ప్రకటించారు. వాస్తవానికి 2016లో జరిగిన ఏయూ అలుమ్ని అసోసియేషన్‌ సమావేశంలో కూడా సీఎం హోదాలో ఏయూకి రూ.13.9 కోట్ల మేర మ్యాచింగ్‌ గ్రాంటు ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అలుమ్ని అసోసియేషన్‌ కార్పస్‌ఫండ్‌కు రూ.10 కోట్లు నేరుగా కేటాయిస్తామని చెప్పారు. అయినా ఆయన ఒక్కపైసా కూడా విదల్చలేదు. తాజాగా ఇప్పటికే ఏయూ ఖజానాను గుల్లచేసిన చంద్రబాబు.. ఇప్పుడు రూ. 500 కోట్లు కేటాయిస్తానని చెప్పడాన్ని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.

‘గీతా’లాపన కోసమే..!
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఏ వ్యవహారం జరిగినా అంతిమంగా గీతంకి లబ్ధి చేకూర్చేందుకేనని తెలుస్తోంది. మొన్నటికి మొన్న గీతం ఆక్రమించుకున్న రూ.5 వేలకోట్ల విలువైన భూములను సక్రమం చేసేందుకుగాను దాడులు చేసి మరీ జీవీఎంసీ కౌన్సిల్‌ తీర్మానం జరిగేలా చూశారు. ఏకంగా దేశంలో అగ్నివీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికైన మొదటి విశ్వవిద్యాలయంగా రికార్డు సృష్టించిన ఏయూలోని కేంద్రాన్ని పూర్తిస్థాయి స్కూలుగా మార్చాలని గతంలో నిర్ణయించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శిక్షణ కేంద్రాన్ని మూసేశారు.

దీంతో సెంటర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నిరంజన్‌ తన పదవికి రాజీనామా చేయగా, సమన్వయకర్త ఉజ్వల్‌ వంటి నిపుణులు వర్సిటీని వీడాల్సి వచ్చింది. ఇక యూనివర్సిటీలో బాగా డిమాండ్‌ ఉన్న దూరవిద్యలో అందించే రక్షణరంగ కోర్సులను ఎత్తేశారు. తద్వారా ఆ అడ్మిషన్లన్నీ సహజంగానే గీతం వంటి ప్రైవేటు సంస్థలకు మళ్లించేలా చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఏయూని వీడి వెళ్లిన నిపుణులు గీతంలో కన్సల్టెంట్లుగా చేరుతుండటం, రక్షణశాఖ ఏయూని భాగస్వామ్య జాబితా నుంచి తొలగించి ఇతర ప్రైవేటు సంస్థల వైపు చూస్తుండడాన్ని గమనిస్తే.. ఏయూలో వ్యవహారాలన్నీ గీతం కోసమే నడుస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా గీతం కోసమే ఏయూను భ్రష్టుపట్టించే కార్యక్రమం జరుగుతోందని స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement