గతేడాది విత్తన బకాయిలు ఇవ్వని చంద్రబాబు సర్కారు
రూ.110 కోట్లు చెల్లిస్తే కానీ సరఫరా కష్టమంటున్న మిల్లర్లు
సకాలంలో రైతులకు విత్తన వేరుశనగ ఇవ్వడంపై సందేహాలు
రాయితీ తగ్గింపు, కేటాయింపులకు కొర్రీలు, పంపిణీలో ఆలస్యం
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి ఖరీఫ్–2026 ప్రారంభం కానుంది. అంతలోపు అంటే మే నెలలోనే రైతులకు రాయితీతో విత్తనం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఏప్రిల్ రెండో వారం నుంచి విత్తన సేకరణ ప్రక్రియ మొదలు పెట్టాలి. కానీ నాలుగో వారం వచ్చినా విత్తనానికి సంబంధించి చడీ చప్పుడు కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ‘అనంత’ రైతులకు విత్తన విపత్తు తప్పేపరిస్థితి కానరావడం లేదు.
గత ఏడాది ఇలా..
ఖరీఫ్–2025లో కూడా రైతులకు విత్తన వేరుశనగ సకాలంలో అందలేదు. దాదాపు నెల రోజులు ఆలస్యంగా అంటే జూన్ 5 నుంచి రాయితీ విత్తన పంపిణీ మొదలు పెట్టారు. గతేడాది మొదట లక్ష క్వింటాళ్ల వేరుశనగ అన్నారు. తర్వాత 50 వేల క్వింటాళ్లకు కొర్రీ వేశారు. పంపిణీ బాగా ఆలస్యం చేయడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే రబీలో కూడా రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీ పంట వేసుకున్న తర్వాత మొదలు పెట్టడంతో రైతులకు ఉపయోగం లేకుండా పోయింది.
రాష్ట్ర క్యాబినెట్‌లో కీలకమంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ స్వంత నియోజకవర్గం ఉరవకొండ ప్రాంతంలోనే పప్పుశనగ సాగు అధికంగా ఉన్నా సకాలంలో విత్తనం ఇవ్వలేని దుస్థితి కల్పించారు. జిల్లాకు 14 వేల క్వింటాళ్లు కేటాయించినా చివరకు 2 వేల క్వింటాళ్లు మాత్రమే అందించి చేతులు దులుపుకున్నారు. అది కూడా 25 శాతం రాయితీ కల్పించడంతో రైతులకు ఏ మాత్రమూ ప్రయోజనం కలగలేదు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం గత రెండేళ్ల ఖరీఫ్, రబీలో రాయితీ విత్తనం కంటితుడుపుగా ఇవ్వడంతో పంట సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విత్తన సేకరణకు ససేమిరా..
ఏపీ సీడ్స్ ద్వారా గత ఖరీఫ్, రబీలో విత్తనం సరఫరా చేసిన ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు పూర్తి చేయలేదు. దీంతో ఈసారి విత్తన సేకరణకు ఏజెన్సీలు మొగ్గు చూపే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాదికి సంబంధించి రూ.110 కోట్లు బకాయిలు చెల్లిస్తే కానీ తాము విత్తనం సమకూర్చలేమని ఇటీవల జేడీఏ దగ్గర మొరపెట్టుకున్నారు.
కనీసం రైతుల నుంచి వసూలు చేసిన నాన్‌సబ్సిడీ సొమ్ము కూడా తమకు ఇవ్వకుండా వాడేసుకోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈసారి కూడా సకాలంలో రైతులకు విత్తనం అందడం కష్టంగానే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇలా జాప్యం చేయడం వల్ల జిల్లాలో రబీలో రైతులు పండించిన నాణ్యమైన వేరుశనగ వ్యాపారులు, దళారులు ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రభుత్వం మేల్కొనేలోపు చివరకు నాసిరకం, కల్తీ సరుకు అంటగట్టే పరిస్థితి ఉంటుందని రైతులు వాపోతున్నారు.
జగన్ ప్రభుత్వంలో అవార్డులు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు హయాంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే)ల ద్వారా ఖరీఫ్, రబీ మొదలు కాకమునుపే గ్రామ స్థాయిలో రైతులకు రాయితీ విత్తనాలు విజయవంతంగా అందించారు. ఫలితంగా ఏపీ సీడ్స్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకుంది. 2021–22 అలాగే 2022–23 జాతీయ అవార్డులు తీసుకుంది. అలాగే 2022 ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు కూడా అందుకుంది. ఖరీఫ్, రబీలో రైతులకు అవసరమైన నాణ్యమైన అన్ని రకాల విత్తనాలు సకాలంలో అందించిన ఏపీ సీడ్స్ ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయితీ తగ్గించడంతో పాటు విత్తన కేటాయింపులకు కూడా సగానికి సగం మేర కొర్రీలు వేసింది. దీంతో రైతులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాన్ని నమ్ముకోలేక బయట ప్రాంతంలో స్వంతంగా సమకూర్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి.


